- విలువైన భూములను అత్తెసరు ధరలకే ప్రైవేటు సంస్థలకు ఎలా కట్టబెడతారు?
- ప్రభుత్వ భూ కేటాయింపుల ప్రక్రియపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించండి
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈ.ఏ.ఎస్. శర్మ లేఖాస్త్రం
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా అత్యంత విలువైన సర్కారీ భూములను అత్తెసరు ధరలకే ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం కేటాయిస్తుండటాన్ని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఆక్షేపించారు. విశాఖపట్నం జిల్లా మధురవాడలో రూ.338 కోట్ల విలువైన 50 ఎకరాల భూమిని ఓ ఐటీ సంస్థకు.. ఏపీఐసీకి చెందిన విలువైన 489 ఎకరాల భూమిని వీబీసీ ఫర్టిలైజర్స్‌కు అత్తెసరు ధరలకే ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించి.. ఈ భూదందా వెనుక దాగిన కుట్రను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు శనివారం శర్మ లేఖాస్త్రం సంధించారు.
రాజధాని నిర్మాణం నుంచి భూ కేటాయింపుల వరకూ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలను ఆక్షేపిస్తూ, విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శర్మ ఎప్పటికప్పుడు లేఖాస్త్రాలు సంధిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు మరో లేఖ రాశారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై సుప్రీం కోర్టు ఫిబ్రవరి 2, 2012న ఇచ్చిన తీర్పులో భూ కేటాయింపులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలకమైన సూచనలు చేసిందని గుర్తు చేశారు. రోజు రోజుకూ భూముల ధరలు ఆకాశన్నంటోన్న నేపథ్యంలో.. ప్రభుత్వ భూములు లభ్యత, వాటి పరిరక్షణ కీలకంగా మారిందని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యను గుర్తు చేశారు.
ప్రభుత్వ భూముల కేటాయించే సమయంలో ప్రజాభ్యుదయాన్ని దృష్టిలో ఉంచుకుని.. సర్కారుకు లాభం చేకూరేలా సమర్థవంతమైన సంస్థలకు మాత్రమే కేటాయించాలని సుప్రీం కోర్టు స్పష్టీకరించిందని ఆ లేఖలో వివరించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు లేకుండా సర్కారీ భూములను అత్తెసరు ధరలకే ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడంలో ఔచిత్యమేమిటని ప్రశ్నించారు. విశాఖపట్నం జిల్లాలోని మధురవాడలో సర్వే నెంబరు 409లో ఏపీఐఐసీకి చెందిన రూ.338 కోట్ల విలువైన 50 ఎకరాల భూమిని భూమిని ఓ ఐటీ సంస్థకు తక్కువ ధరకు ధారదత్తం చేయడాన్ని తప్పుబట్టారు.
కృష్ణా జిల్లాలో జగయ్యపేట మండలం జయంతిపురంలో సర్వే నెంబరు 93లో ఏపీఐఐసీకి చెందిన 499 ఎకరాల భూమిని అత్తెసరు ధరలకే వీబీసీ ఫర్టిలైజర్స్ సంస్థకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ డెవలపమెంట్ ఎనాబ్లింగ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ భూములను 33 ఏళ్లకే లీజుకు ఇవ్వొచ్చునని.. కానీ 99 ఏళ్లకు లీజుకు ఇచ్చేలా ఆ చట్టాన్ని సవరించడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. భూ కేటాయింపుల తీరును పరిశీలిస్తే ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా ఉందని.. స్వతంత్ర న్యాయ విచారణ జరిపించి వాస్తవాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
బాబు భూ సంతర్పణలపై కేంద్రానికి ఫిర్యాదు
Published Sun, Nov 22 2015 8:36 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
Advertisement