సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ ఉ‍్యదమం చేస్తున్న రైతులకు మాజీ సివిల్ సర్వెంట్లు మద్దతుగా నిలిచారు. రైతులకు ఘోర అన్యాయం జరిగిందని, ఇది ఇంకా కొనసాగుతోంది అంటూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని మాజీ సివిల్ సర్వెంట్ల బృందం తప్పుబట్టింది. ఈ మేరకు 75 మంది మాజీ అధికారులు ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. హృదయపూర్వకంగా సమస్య పరిష్కారానికి ప్రయత్నించకుండా సర్కార్ అనుసరిస్తున్న విధానాలతో ఎప్పటికీ పరిష్కారం లభించదని స్పష్టం చేశారు. దేశంలో చాలా గందరగోళానికి కారణమైన సమస్యను ఇకనైనా పరిష్కరించాలని తమ లేఖలో ప్రభుత్వాన్ని కోరారు. (‘చక్కా జామ్’ : 50 వేల మందితో భారీ భద్రత)
రైతు ఉద్యమంలో పరిణామాలను తీవ్ర ఆందోళనతో గమనిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా జనవరి 26, రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో చోటుచేసుకున్న పరిణామాలు, సంఘటనలు, రైతులపై నిందలు వేయడానికి చేసిన ప్రయత్నాలపై మాజీ సివిల్ సర్వెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులకు తమ మద్దతును మరోసారి పునరుద్ఘాటించారు. తక్షణమే ఈ సమస్యను సంతృప్తికరంగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. 18 నెలల పాటు చట్టాల అమలును నిలిపివేయడం లాంటి చర్యలను ప్రతిపాదించడానికి బదులుగా, ప్రభుత్వం ఒక స్నేహపూర్వక పరిష్కారంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. చట్టాలను ఉపసంహరించు , లేదా ఇతర సాధ్యమైన పరిష్కారాల గురించి ఆలోచించాలన్నారు. వ్యవసాయం రాజ్యాంగంలో రాష్ట్ర జాబితాలో ఉందని గుర్తు చేయడం విశేషం. (రైతులకు మద్దతు : గ్రెటా థన్‌బర్గ్‌పై కేసు)
రైతుల నిరసన పట్ల ప్రభుత్వం మొదటినుంచీ మొండిగానే వ్యవహరిస్తోందని, ఈ వైఖరి ఘర్షణ సృష్టించేదిగానే ఉందని ఆరోపించారు. రైతులను ప్రతిపక్షంగా చూస్తూ, అపహాస్యం చేస్తున్నతీరును ఖండించారు. అలాగే కొంతమంది జర్నలిస్టులు, ప్రతిపక్ష పార్టీ ఎంపీలపై దేశద్రోహ ఆరోపణలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. కాన్‌స్టిట్యూషనల్ కండక్ట్ కమిటీ (సీసీజీ)లో భాగమైన మాజీ ఐఏఎస్ ఆధికారులు నజీబ్ జంగ్, జూలియో రిబెరియో, అరుణ రాయ్ లతో పాటు జవహర్ సిర్కార్, అరబిందో బెహెరా, మాజీ ఐఎఫ్ఎస్ అధికారులు కెబి ఫాబియన్, అఫ్తాబ్ సేథ్, మాజీ ఐపిఎస్ అధికారులు జూలియో రిబెరియో, ఎకె సమతా తదితరులు ఈ లేఖపై సంతకం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment