మార్కెట్ రేటు ప్రకారం పరిహారం ఇవ్వాలి
‘పురుషోత్తపట్నం’పై అఖిలపక్షం డిమాండ్
2013 భూసేకరణ చట్ట సవరణలపై రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి నిర్ణయం
చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్
దేవీచౌక్ (రాజమహేంద్రవరం) :
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్వాసితులకు మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని, భూసేకరణ చట్టం–2013ను యథాతథంగా అమలు చేయాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్వాసితుల కమిటీ ఆధ్వర్యాన ఆనం రోటరీ హాలులో గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నాయకులు, రైతులు రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న భూసేకరణ విధానాన్ని ఎండగట్టారు. వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా, ఇసుక దందాలు, భూకబ్జాలు, ఏవేవో పరిశ్రమల పేరిట విలువైన భూములను అస్మదీయులకు కట్టబెట్టడం నిత్యకృత్యంగా మారిందని అన్నారు. రాష్ట్రంలో దోపిడీదారీ వ్యవస్థ నడుస్తోందని, ప్రభుత్వమే చట్టాలను నీరుగారుస్తోందని అన్నారు. రైతుల కోసం ఎటువంటి ఉద్యమానికైనా తాము సిద్ధమని అన్నారు.
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, రైతుల అంగీకారంతో మాత్రమే భూములు తీసుకోవాలని, పరిశ్రమల స్థాపనకు పర్యావరణ, సామాజిక అంశాలను అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు. పురుషోత్తపట్నం, పట్టిసీమ రెండూ బోగస్ ప్రాజెక్టులేనని, ఎన్నికల తరువాత అవి ఉండవని అన్నారు. రైతులకు నష్టపరిహారం విషయంలో ప్రభుత్వాలు ఉదారంగా వ్యవహరించాలని, పది రూపాయలు ఎక్కువిచ్చినా తప్పు లేదని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే కొందరు ‘పెద్దలు’ పోలవరం కుడి కాలువ పనులను న్యాయస్థానాల ద్వారా అడ్డుకున్నారని ఆయన తెలిపారు. ‘‘పురుషోత్తపట్నం ప్రాజెక్టును వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారని నాయకులు చెబుతున్నారు. అయితే కేంద్ర జలవనరుల సంఘం నాడు ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదు’’ అని ఆయనన్నారు. ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో జరుగుతున్న అవినీతిని గురించి తాను ఎన్ని ఉత్తరాలు రాసినా, చంద్రబాబు ప్రభుత్వం నుంచి సమాధానం లేదని ఉండవల్లి అన్నారు.
సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల మోసపూరిత ధోరణి అవంబిస్తోందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ తరువాత మాత్రమే భూములు సేకరించాలని, భూములు కోల్పోయినవారికి మార్కెట్ ధరను అనుసరించి పరిహారం ఇవ్వడంతో పాటు ఉపాధి చూపాలని డిమాండ్ చేశారు. చట్ట సవరణల ద్వారా ప్రజాభిప్రాయానికి తిలోదకాలివ్వడం, నష్టపరిహారానికి చట్టబద్ధత కల్పించకపోవడం, పోలీసుల ద్వారా రైతులను భయభ్రాంతులను చేయాలనుకోవడం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. కాంట్రాక్టర్లకు, అధికార పక్షం నాయకులకు, కార్యకర్తలకు లబ్ధి కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, అక్రమ సొమ్ము విచ్చలవిడిగా ఖర్చు చేసి ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికి మించిన బలమైన శక్తి లేదన్న విషయం గుర్తుచుకోవాలని అన్నారు.
మాజీ ఎంపీ మిడియం బాబూరావు, సీపీఎం నేత టి.అరుణ్ తదితరులు ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. భూసేకరణ చట్టానికి చేసిన సవరణలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాలని, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్వాసితులకు మార్కెట్ రేటు ప్రకారం నçష్టపరిహారం ఇవ్వాలని, ఏప్రిల్ మూడో తేదీన అఖిలపక్ష నాయకులతో, పురుషోత్తపట్నం రైతులతో సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ నగర కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ¯ŒSవీ శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు నక్కా శ్రీనగేష్, ఉభయ గోదావరి జిల్లాల వర్తక సమాఖ్య ప్రతినిధి నందెపు శ్రీనివాస్, గోలి రవి, పురుషోత్తపట్నం నిర్వాసిత రైతు కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
రైతుల కడుపు కొట్టొద్దు
2013 భూసేకరణ చట్టానికి చేసిన సవరణలను రద్దు చేయాలి. చట్టాలను దుర్వినియోగం చేసి, రైతుల కడుపు కొట్టొద్దు. మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలి. బలవంతంగా భూములు తీసుకునే పద్ధతి విడనాడాలి.
– కలగర బాలకృష్ణ, రైతు, పురుషోత్తపట్నం
అయోమయంలో రైతులు
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రైతుల పరిస్థితి అయోమయంలో ఉంది. నావి రెండున్నర ఎకరాలు పోయాయి. భూములకు పరిహారం ఎంతిస్తారో, ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి దాపురించింది. నాకు వ్యవసాయం తప్ప మరో బతుకుతెరువు లేదు.
– చెరుకూరి పోసిబాబు, రైతు
కోర్టు తీర్పునుపట్టించుకోవడంలేదు
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో 30 సెంట్ల భూమి కోల్పోయాను. భూమి ఇవ్వనని రాతపూర్వకంగా తెలియజేశాను. న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. 2013 చట్టాన్ని అమలు చేయాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పులను పట్టించుకోవడం లేదు.
– గద్దే రామకృష్ణ, చినకొండేపూడి, సీతానగరం మండలం
వక్రభాష్యాలు చెబుతున్నారు
న్యాయస్థానం పిటిష¯ŒSను డిస్పోజ్ చేశామని చెబితే, డిస్మిస్ చేసిందని అధికారులు చెబుతున్నారు. ఇదెక్కడి విడ్డూరం? 788 జీఓ ప్రకారం పట్టిసీమ రైతులకు ఇచ్చినవిధంగానే నష్టపరిహారం చెల్లించాలి.
– రమేష్‌బాబు, పట్టిసీమ