Langar house Police Station
-
మాజీ ముత్తవలి హఫీజ్‌పాషా అరెస్ట్
లంగర్‌హౌస్/ఆత్మకూరు: మంత్రాలనెపంతో బాలికతో అసభ్యంగా ప్రవర్తించడమేగాక లైంగికదాడికి యత్నించి పారిపోయిన కేసులో ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట దర్గా మాజీ పీఠాధిపతి (ముత్తవలి) హఫీజ్ పాషాను హైదరాబాద్ లంగర్‌హౌస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. లంగర్‌హౌస్ ఎండీలైన్స్‌లో నివాసం ఉంటున్న బాలిక మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. పలువురు వైద్యులను సంప్రదించినా ప్రయోజనం కనిపించలేదు. బంధువుల సూచనమేరకు ఏపీలోని ఏఎస్‌పేట రెహమతాబాద్ షరీఫ్ దర్గా పెద్ద షా గులామ్ నక్స్బాంద్ హఫీజ్‌పాషాను సంప్రదించారు. మంత్రాలతో ఆమె వ్యాధి నయం చేస్తానని పలుమార్లు నెల్లూరుకు రప్పించాడు. తాను కూడా తరచు హైదరాబాద్ వచ్చి మలక్‌పేటలో ఉంటూ బాధితులను కలిసేవాడు. మంత్రాలు చదువుతూ వ్యాధి నయం చేస్తున్నట్లు నటిస్తూ నెల్లూరులో పలుమార్లు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. జనవరిలో హైదరాబాద్‌లోని బాధితురాలి ఇంటికి వచ్చిన బాబా ఆమె కుటుంబీకులను బయటికి పంపి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పగా, ఆమెకు పిచ్చి ముదిరిందని బాబా చెప్పడంతో వారు అతడి మాటే నమ్మారు. ఫిబ్రవరి మొదటి వారంలో మరోసారి బాబా ఆమెను కలవాలని చెప్పడంతో కుటుంబసభ్యులు అతడికి తెలియకుండా ఆ గదిలో సీసీ కెమెరాలను అమర్చారు. గదిలోకి వెళ్లిన బాబా బాలికతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని గుర్తించిన కుటుంబీకులు అతడిని నిలదీయగా ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పాడు. ఫిబ్రవరి 11న వివాహానికి ఏర్పాట్లు చేయగా అనారోగ్యం పేరుతో ఆస్పత్రిలో చేరిన అతడు కొందరు పెద్దల సహకారంతో అక్కడి నుంచి పరారయ్యాడు. గొడవ పెద్దది కావడంతో మతపెద్దలు, వక్ఫ్‌బోర్డు నిర్వాహకులు జోక్యం చేసుకుని నిందితుడిని దర్గా నిర్వహణ బాధ్యతల నుంచి తొలగించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం హఫీజ్‌పాషాను మలక్‌పేటలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
కారు బీభత్సం...
* మద్యం తాగి డ్రైవింగ్ * అదుపుతప్పి డివైడర్ ఎక్కిన కారు * పోలీసులపై యువకుల దాడి లంగర్‌హౌస్: తప్పతాగి ఉన్న ఇద్దరు అతివేగంగా కారును నడిపి బీభత్సం సృష్టించారు. అదుపుతప్పిన కారు డివైడర్‌పై నుంచి దాదాపు రెండు వందల మీటర్ల దూరం దూసుకెళ్లి తర్వాత గాలిలో ఎగిరి పడింది. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.... టోలీచౌకి నదీం కాలనీకి చెందిన మొహమ్మద్ అన్వర్(33), తన స్నేహితుడు ఖుద్రత్ ఖాన్‌తో కలిసి పీ అండ్ టీ కాలనీలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు మద్యం తాగాడు. తెల్లవారుజామున 4 గంటలకు తన ఇన్నోవా కారులో టోలీచౌకిలోని ఇంటికి బయల్దేరారు. లంగర్‌హౌస్ బాపూనగర్ బస్టాప్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కింది. వేగంగా దూసుకెళ్లి ఇంద్రారెడ్డి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఉన్న సిమెంట్ దిమ్మెలను ఢీకొట్టి.. గాలిలోకి లేచి 30 మీటర్ల దూరంలో పడింది. బ్రిడ్జిపై ఉన్న 8 సిమెంట్ దిమ్మెలు చెల్లాచెదురైపడగా.. కారు టైర్లు నాలుగూ పగిలిపోయాయి. ఒక టైర్ అక్కడే పాల వ్యాపారం చేస్తున్నవారిపై పడింది. ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో కారులో ఉన్నవారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మత్తులో వీరంగం.... పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో ఉన్న వారిని బయటకు దించారు. స్టేషన్‌కు రమ్మని వారిని కోరగా.. మద్యం మత్తులో ఉన్న అన్వర్, ఖుద్రత్‌లు తాము సీఎం మనుషులమని, మమ్మల్నే స్టేషన్‌కు రమ్మంటారా అంటూ పోలీసులపై దాడి చేశారు. జనం గుమిగూడటంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి చనిపోయాడని, తమ డ్రైవర్ కూడా పారిపోయాడని వారిపై కూడా వీరంగం సృష్టించారు. షెడ్డులో కారు...? లంగర్‌హౌస్ పోలీసులు, టోలీచౌకి ట్రాఫిక్ పోలీసులు ప్రమాదం జరగడానికి గంట ముందు వరకు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించి 7 కార్లు పలు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అయితే, మద్యం తాగి కారు నడపడమే కాకుండా డివైడర్‌పై దూసుకెళ్లిన కారును మాత్రం సీజ్ చేయనీకుండా ఆ యువకులు పోలీసులతో గొడవపడ్డారు. మరమ్మత్తుల నిమిత్తం కారును బలవంతంగా షెడ్డుకు తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు సీజ్ చేయకపోవడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
బావను వదలాలంటూ యువకుడి హంగామా
తన బావను విచారణకు పిలుస్తారా.. అంటూ ఓ వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో హల్చల్ చేశాడు. తన బావను వదలాంటూ బ్లేడుతో చేయి కోసుకోవడంతో పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎండీలైన్స్‌కు చెందిన మహ్మద్ అతీఫ్ చిరువ్యాపారి. ఆదివారం రాత్రి ఆయన భార్య ఇంటి పక్కన ఉండే మరో మహిళ గొడవ పడ్డారు. వీరి ఇంటి పక్కనుండే వ్యక్తి కలగజేసుకుని అతీఫ్ భార్యపై చేయిచేసుకోబోయాడు. చుట్టుపక్కల వారు వీరికి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమనిగింది. అయితే, సోమవారం ఉదయం ఆ వ్యక్తి మళ్లీ అతీఫ్ ఇంటికి వచ్చి హంగామా చేశాడు. ఇదేంటని అతీఫ్‌కు గొడవపడ్డ వ్యక్తిని అడగ్గా అతను అతీఫ్, అతని బావమరిది రషీద్‌పై దాడి చేశాడు. రెండురోజులుగా గొడవ పడుతున్న వ్యక్తి తనను అతీఫ్, రషీద్‌లు కొట్టారని సోమవారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం రాత్రి అతీఫ్‌ను స్టేషన్‌కు పిలిపించారు. అదే సమయంలో పోలీస్‌స్టేషన్‌లోకి పరిగెత్తుకొచ్చిన అతీఫ్ బావమరిది రషీద్.. తన బావను వదలకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బ్లేడుతో చేతిపై కోసుకున్నాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ఆస్పత్రికి తరలించారు. -
న్యాయం కోసం వస్తే అత్యాచారం
హైదరాబాద్: తన భర్తతో విడాకులు ఇప్పించి న్యాయం చేయాలంటూ తనను ఆశ్రయించిన గృహిణిపై ఒక న్యాయవాది మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. ఇన్స్పెక్టర్ ఎన్బీ రత్నం తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన గృహిణి (23) వాంబేకాలనీ దోమలగూడలో నివాసముంటోంది. ఆమెకు మంచిర్యాలకు చెందిన శ్రీనివాస్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. విభేదాలు రావడంతో వీరిద్దరూ పెళ్లైన ఏడాది నుంచి దూరంగా ఉంటున్నారు. భర్తతో విడాకులు ఇప్పించాలని ఆరు నెలల క్రితం లంగర్‌హౌస్ ఇంద్రానగర్‌లో ఉండే మహ్మద్ ఖాజా మోయినుద్దీన్ వద్దకు బాధితురాలు వెళ్లింది. తనకు విడాకులు ఇప్పించాలని, అధిక మొత్తంలో డబ్బులు చెల్లించలేనని ఆమె ఖాజాకు చెప్పింది. అయితే భర్తతో విడాకులు ఇప్పించడమే కాక ఖర్చు కూడా భరిస్తానని, వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. పలుమార్లు ఆమెను తన ఇంటికి పిలిపించుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు. విడాకులు ఇప్పించకపోవడం, వివాహానికి నిరాకరించడంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు శుక్రవారం లంగర్‌హౌస్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.