న్యాయం కోసం వస్తే అత్యాచారం
హైదరాబాద్: తన భర్తతో విడాకులు ఇప్పించి న్యాయం చేయాలంటూ తనను ఆశ్రయించిన గృహిణిపై ఒక న్యాయవాది మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన శుక్రవారం వెలుగుచూసింది.
ఇన్‌స్పెక్టర్ ఎన్‌బీ రత్నం తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన గృహిణి (23) వాంబేకాలనీ దోమలగూడలో నివాసముంటోంది. ఆమెకు మంచిర్యాలకు చెందిన శ్రీనివాస్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. విభేదాలు రావడంతో వీరిద్దరూ పెళ్లైన ఏడాది నుంచి దూరంగా ఉంటున్నారు. భర్తతో విడాకులు ఇప్పించాలని ఆరు నెలల క్రితం లంగర్‌హౌస్ ఇంద్రానగర్‌లో ఉండే మహ్మద్ ఖాజా మోయినుద్దీన్ వద్దకు బాధితురాలు వెళ్లింది.
తనకు విడాకులు ఇప్పించాలని, అధిక మొత్తంలో డబ్బులు చెల్లించలేనని ఆమె ఖాజాకు చెప్పింది. అయితే భర్తతో విడాకులు ఇప్పించడమే కాక ఖర్చు కూడా భరిస్తానని, వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. పలుమార్లు ఆమెను తన ఇంటికి పిలిపించుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు. విడాకులు ఇప్పించకపోవడం, వివాహానికి నిరాకరించడంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు శుక్రవారం లంగర్‌హౌస్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.