ఎక్కువ కాలం శృంగారం నిరాకరిస్తే.. విడాకులివ్వచ్చు
వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు భర్తకు శృంగారం నిరాకరిస్తే.. అది మానసిక క్రూరత్వమే అవుతుందని.. అలాంటి సందర్భాల్లో విడాకులు ఇవ్వొచ్చని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. గత నాలుగున్నరేళ్లుగా తన భార్య తనను దగ్గరకు రానివ్వడం లేదని, తనను మానసికంగా హింసిస్తోందని, ఆమెకు ఎలాంటి శారీరక ఇబ్బందులు లేకపోయినా అలా చేస్తోందని.. అందువల్ల తనకు విడాకులు మంజూరుచేయాలని కోరుతూ ఒక భర్త దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దిగువ కోర్టులో అతడి ఆరోపణలను ఖండించినా, హైకోర్టు మాత్రం అతడికి విడాకులు మంజూరుచేసింది.
ఈ కేసులో భర్త తాను తన భార్య వల్ల మానసిక క్రూరత్వానికి గురైనట్లు పూర్తిగా నిరూపించారని.. ఒకే ఇంట్లో ఉం టున్నా సుదీర్ఘ కాలంగా అతడికి సంసార సుఖం లేదని, పైగా ఆమె ఎలాంటి శారీరక వైకల్యంతో బాధపడకపోయినా ఎలాంటి కారణం లేకుండా నిరాకరించారని అందువల్ల విడాకులు ఇవ్వడానికి పూర్తి కారణాలున్నాయని జస్టిస్ ప్రదీప్ నందరాజోగ్, జస్టిస్ ప్రతిభారాణిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఇంతకుముందు దిగువకోర్టులో తాను దాఖలుచేసిన విడాకుల పిటిషన్‌ను కొట్టేయడంతో ఆ తీర్పును సవాలుచేస్తూ సదరు భర్త ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.
తమకు 2001 నవంబర్ 26న హర్యానాలో పెళ్లయిందని, తమకు 10, 9 ఏళ్ల వయసున్న ఇద్దు కొడుకులున్నారని భర్త చెప్పాడు. తర్వాత కొంత కాలం నుంచి తన భార్య ఇంటి పనులు చేయడం మానేసిందని, రానురాను ఆమె ప్రవర్తన భరించలేనంతగా మారడంతో తాను, తన పిల్లలు చాలా ఇబ్బందులకు గురయ్యామని చెప్పారు. దాంతో అదే ఇంట్లోని మరో పోర్షన్‌లో వేరేగా ఉండమని తన తల్లిదండ్రులు తనకు సలహా ఇచ్చారన్నారు. గత నాలుగున్నరేళ్లుగా భార్య తనను దగ్గరకు కూడా రానివ్వడంలేదని వాపోయారు.