బలవంతపు శృంగారం.. అత్యాచారం కాదు: ఢిల్లీ హైకోర్టు
అత్యాచారాల విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. ఒకప్పుడు తాను తల్లిగా పిలిచే 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసి, ఆమెను హతమార్చిన కేసులో నిందితుడికి పడిన జీవితఖైదును పక్కన పెట్టింది. ఈ మేరకు జస్టిస్ ప్రదీప్ నందరాజోగ్, జస్టిస్ ముక్తా గుప్తాలతో కూడిన డివిజన్ బెంచి తన తీర్పు వెల్లడించింది. అచ్చేలాల్ అనే వ్యక్తి బాగా తాగి ఉన్న సమయంలో ఆ వృద్ధురాలిపై అత్యాచారం చేయడంతో ఆమె మరణించింది.
అతడు ఈ హత్యను కావాలని చేయలేదని, అలా బలవంతంగా శృంగారం చేయడం వల్ల ఆమె చనిపోతుందని కూడా అతడికి తెలియదని, అలాంటి ఉద్దేశం కూడా అతడికి లేదని.. అందువల్ల అతడికి ఐపీసీ సెక్షన్ 302 కింద విధించడం సరికాదని బెంచి తెలిపింది. అత్యాచారానికి గురైన మహిళ వయస్సు 60 ఏళ్లకు పైగా ఉందని, ఆమె మెనోపాజ్ దశ కూడా దాటడంతో ఆ చర్యను శిక్షార్హంగా భావించలేమని ధర్మాసనం తేల్చింది. మరోవైపు.. శృంగారంలో పాల్గొనేందుకు ముందు సదరు మహిళ కూడా మద్యం తాగి ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో ఉందని చెప్పారు.