భార్య సమ్మతి లేకున్నా లైంగిక చర్య నేరం కాదు
స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: భార్య అంగీకారం లేకుండా ఆమెతో లైంగిక చర్యలో పాల్గొనడం నేరం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. భార్యపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసింది. ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం.. 2013 మార్చి 4న ఢిల్లీకి చెందిన వికాస్ తన భార్యకు మత్తుమందు ఇచ్చి ఆమెను ఘజియాబాద్ కోర్టులోని పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకెళ్లాడు. అక్కడ వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకున్న తర్వాత ఆమెపై లైంగిక చర్యకు పాల్పడి వదిలేశాడు. దీనిపై బాధితురాలు 2013 అక్టోబర్‌లో ఢిల్లీలోని బాబా హరిదాస్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. వికాస్ మాత్రం తమకు 2011 ఫిబ్రవరి 2న వివాహం జరిగిందని, తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని భావించి తాను భార్యను ఘజియాబాద్ కోర్టుకు తీసుకెళ్లానని చెప్పాడు.
తన సోదరి పేరున ఉన్న ఇంటి ని తన పేరున మార్చేందుకు తాను సంసిద్ధత వ్యక్తం చేయకపోవడం వల్లే తన భార్య అత్యాచార ఆరోపణలు చేస్తోందని ఆరోపించాడు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ‘‘బాధితురాలు(భార్య), నిందితుడు (వికాస్) ఇద్దరు చట్టప్రకారం భార్యాభర్తలు. బాధితురాలు మేజర్. వీరిద్దరి మధ్యా లైంగిక చర్య అత్యాచారం కిందకు రాదు. అది బాధితురాలి సమ్మతి లేకుండా జరిగినా కూడా. దీని ఆధారంగా నిందితునిపై అభియోగాలు మోపలేం’’ అని ఢిల్లీ కోర్టు అదనపు సెషన్స్ న్యాయమూర్తి వీరేంద్ర భట్ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు.