
ఒమర్ అబ్దుల్లా, పాయల్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విడాకుల కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ వివాహబంధం తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతిందనీ.. కాబట్టి మరో వివాహం చేసుకునేందుకు వీలుగా భార్య పాయల్ నుంచి విడాకులు ఇప్పించాలని విన్నవించారు. వాదనలు విన్న జస్టిస్ సిద్ధార్థ మ్రిదుల్, జస్టిస్ దీపా శర్మల ధర్మాసనం.. ఈ విషయమై ఏప్రిల్ 23లోగా స్పందనను తెలియజేయాలని పాయల్‌ను ఆదేశించింది. ఈ పిటిషన్‌ను త్వరితగతిన విచారించాలన్న ఒమర్ విజ్ఞప్తిపై కూడా పాయల్ అభిప్రాయాన్ని హైకోర్టు కోరింది.
2016, ఆగస్టు 30న తనకు పాయల్ నుంచి విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ఒమర్ ట్రయల్‌కోర్టును ఆశ్రయించగా.. ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. తమ వివాహబంధం కోలుకోలేనంతగా దెబ్బతిందని నిరూపించడంలో ఒమర్ విఫలమయ్యారని అప్పట్లో కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఒమర్, పాయల్‌లకు 1994, సెప్టెంబర్ 1న వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. అయితే 2007లో ఒమర్–పాయల్‌ల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2009 నుంచి వీరు విడిగా ఉంటున్నారు.