langarhouse
-
నిజాం ఆస్తులు ప్రజలకే..
సాక్షి, హైదరాబాద్/లంగర్‌హౌస్: ‘బీజేపీ అధికారంలోకి వస్తే నిజాం ఆస్తులు, భూములను స్వా ధీనం చేసుకుంటాం’అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. పరాధీనంలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటిని తిరిగి ప్రజలకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ‘ప్రజా సంగ్రామ యాత్ర మూడోరోజైన సోమవారం సాయంత్రం ఆరెమైసమ్మ ఆలయం వద్ద నిర్వహించిన సభలో ప్రజలనుద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. ‘భాగ్యలక్ష్మీ అమ్మ వారి సాక్షిగా ఎంఐఎం అడ్డాను బద్దలు కొట్టిన సత్తా బీజేపీ కార్యకర్తలదే. పాతబస్తీనే కాదు.. వాళ్లు సవాల్ చేస్తే ఏ బస్తీకైనా వచ్చి కాషాయ జెండా ఎగరేస్తాం. టీఆర్ఎస్కు ఆ దమ్ము ఉందా? దేశద్రోహుల పార్టీ ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీ చేస్తున్నా రు. కేసీఆర్ పాతబస్తీకి రావాలంటే ఎంఐఎం పర్మిషన్ తీసుకోవాలి. రాబోయే ఎన్నికల తరువాత దేశద్రోహుల పార్టీని తరిమికొడతాం. భాగ్యనగర్ అమ్మవారి పేరుతోనే భాగ్యనగర్ పేరొచ్చింది. గొల్ల కురుమల కొండ గొల్లకొండనే... అది గోల్కొండ కాదు. నిజాం స్థలాలు, ఆస్తులన్నీ కూడా మావే. హిందువుల స్థలాలను ఆక్రమించుకుని నిజాం ఆస్తులుగా చెప్పుకుంటున్నారు’అని అన్నారు. కుటుంబం చేతిలో తెలంగాణ తల్లి బందీ తెలంగాణ ఇచ్చిన వీరుడు సర్దార్ పటేల్ ముందు మోకరిల్లిన పార్టీ బీజేపీ అని, తెలంగాణ ప్రజల మానప్రాణాలను దోచుకుని హింసించిన నిజాం రాజు ముందు మోకరిల్లిన పార్టీ టీఆర్ఎస్దని బండి సంజయ్ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏనాడూ ఎంఐఎం సమర్థించలేదన్నారు. తెలంగాణ తల్లి ఒక కుటుంబం చేతిలో బందీ అయ్యిందని, విముక్తి చేసేందుకు బీజేపీ పోరాడుతుందని చెప్పారు. 111 జీవో పరిధిలోనే కేసీఆర్‌కు, ఆయన కొడుకు, కూతురుకు సామ్రాజ్యాలున్నాయని ఆరోపించారు. బీజేపీ ఏ మతానికీ, వర్గానికీ వ్యతిరేకం కాదని, కానీ హిందూ మతాన్ని కించపరిస్తే మాత్రం ఊరుకోదన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ మాట్లాడుతూ.. ఒవైసీ సోదరులపై మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఎం నేతలను పాకిస్తాన్ పంపిస్తామని అన్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల కాళ్లు పట్టుకోవటం ఎంఐఎంకు అలవాటైందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, కర్ణాటక ఎంపీ, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇన్చార్జి మునుస్వామి, ఎస్సీ మోర్చా జాతీయ ఇన్చార్జి లాల్ సింగ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాలికి గాయం: ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా రాత్రి లంగర్ హౌస్ వద్ద బండి సంజయ్‌ను కలిసేందుకు కార్యకర్తలు పోటీపడటంతో తోపులాట జరిగింది. ఈక్రమంలో ఆయన కిందపడిపోవడంతో కాలికి గాయమైంది. కాలికి కట్టుకట్టుకుని సోమవారం బాపూఘాట్ నుంచి యాత్రను కొనసాగించారు. టిప్పుఖాన్ బ్రిడ్జ్ మీదుగా.. ఆరె మైసమ్మ, అప్పా జంక్షన్, అజీజ్ నగర్ క్రాస్‌రోడ్డు మీదుగా హిమాయత్ సాగర్‌కు చేరుకున్నారు. యాత్ర రాజేందర్‌నగర్ నియోజకవర్గంలోకి చేరుకోగా మైలార్దేవరపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గుర్రాలు, ఒంటెలతో ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా బోనాలు, మంగళహారతులతో నీరాజనం పలికారు. ‘డబుల్’ ఇళ్ల లెక్క చెప్పండి: బండి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు కడతామన్నారు.. ఎన్ని పూర్తి చేశారు.. లబ్ధిదారుల జాబితాతో సహా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. తాను పాల్గొన్న పట్టణాభివృద్ధి కమిటీ భేటీలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి వెల్లడించిన వివరాల ప్రకారం.. 8,000 ఇళ్లు మాత్రమే కట్టినట్లు స్పష్టమౌతోందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం పేరును టీఆర్ఎస్ సర్కార్ మార్చేసిందని, కేంద్రం ఇచ్చిన నిధులతోనే డబుల్ బెడ్రూం ఇళ్లు కడుతున్నారని చెప్పారు. ప్రధాని మోదీకి మంచి పేరు వస్తుందనే పథకం పేరును మార్చేశారన్నారు. సోమవారం మూడో రోజు ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించి, హైదరాబాద్ బాపూఘాట్ సమీపంలో సంజయ్ మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టర్ల కమీషన్ కోసమే డబుల్బెడ్రూం ఇళ్లు కడుతున్నారని, వాటి నాణ్యతను ఇప్పటివరకు సీఎం కేసీఆర్ పరిశీలించలేదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు 2 లక్షలకు పైగా, జీహెచ్ఎంసీలో 1.40 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని ఈ ఇళ్లు ఎక్కడ కట్టారో చెప్పాలని ప్రశ్నించారు. వీటి నిర్మాణానికి కేంద్రం ఇప్పటివరకు రూ.3,500 కోట్లు విడుదల చేయగా, కేసీఆర్ సర్కార్ రూ.2,285 కోట్లు ఉపయోగించుకుందని చెప్పారు. ఇవిగాక జీహెచ్ఎంసీలో వివిధ పథకాల అమలుకు మోదీ ప్రభుత్వం రూ.1,287 కోట్లు మంజూరు చేసిందని సంజయ్ వివరించారు. ఆయుష్మాన్ భారత్ అమలేదీ.. హైదరాబాద్ శివారు భోజగుట్టలో టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు ఆక్రమించుకున్న 40 ఎకరాల స్థలంతో పాటు ఇతర చోట్ల పీఎంఏవై కింద ఇళ్లు కట్టించి ఇవ్వాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. కోవిడ్ కష్టకాలంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేసి ఉంటే వైద్యచికిత్స ఖర్చుల నుంచి పేదలకు ఉపశమనం లభించి ఉండేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ నాయకులు మోకాళ్ల యాత్ర చేయకతప్పదని బండి హెచ్చరించారు. -
అక్కాచెల్లుళ్లు ఆ వ్యక్తిని గేలిచేశారు అందుకే..
లంగర్‌హౌస్, మీర్‌పేట: నగర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లంగర్‌హౌస్ జంట హత్యల మిస్టరీ వీడింది. ఈ ఉదంతాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని దర్యాప్తు చేసిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. అక్కాచెల్లెళ్లుగా తేలిన ఇద్దరు మహిళల్నీ ఒకే వ్యక్తి చంపినట్లు తేలింది. ఇరువురూ పూటుగా కల్లుతాగి ఉండటంతో అడ్డుకోలేకపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ హత్యలో ఇంకా ఎవరైనా పాల్గొన్నారా? అనే అంశంతో పాటు ఇతర విషయాలను ఆరా తీస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బడగూడ గ్రామానికి చెందిన దంపతులు రాజు–యాదమ్మ, లక్ష్మణ్–సుమిత్ర 15 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం సిటీకి వలసవచ్చారు. వీళ్లు ప్రస్తుతం మీర్‌పేట పరిధిలోని బాలాపూర్ చౌరస్తా సమీపంలో ఉన్న లెనిన్‌నగర్‌లో నివసిస్తున్నారు. అక్కాచెల్లెళ్లు అయిన యాదమ్మ, సుమిత్రలు సమీపంలోని ఇళ్లల్లో పని చేస్తుండగా... రాజు, లక్ష్మణ్‌లు అడ్డా కూలీలుగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి నలుగురు చొప్పున సంతానం. సుమిత్ర భర్త లక్ష్మణ్ మద్యానికి బానిసై ఐదేళ్ల క్రితం చనిపోయాడు. తన పిల్లలకు వివాహాలు చేశాక సుమిత్ర.. యాదమ్మతో కలిసి కల్లు తాగడానికి అలవాటుపడింది. ఆ వ్యసనానికి బానిసలైన ఇరువురూ నిత్యం మత్తులోనే జోగుతూ ఉండేవారు. వీరి వ్యవహారశైలి అభ్యంతరకరంగా ఉండటంతో కాలనీవాసులు సైతం పలుమార్లు మందలించారు. దీంతో వీరు గత ఆరు నెలల క్రితం మీర్‌పేట అయోధ్యనగర్‌లో పక్కపక్క గదులు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. సుమిత్ర ఒంటరిగా, యాదమ్మ భర్తతో కలిసి జీవిస్తున్నారు. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు యాదమ్మ, సుమిత్రలు నిత్యం మాదిరిగానే కంచన్‌బాగ్ సరిహద్దుల్లో ఉన్న ధాతూనగర్ కల్లు కాంపౌండ్‌కు వెళ్లారు. అక్కడే కల్లు తాగడానికి వచ్చిన ఓ వ్యక్తితో వీరికి పరిచయమైంది. ముగ్గురూ కలిసి మితిమీరిన మోతాదులో కల్లు తాగారు. అక్కడ ‘మాట్లాడుకున్న’ వీరంతా రాజేంద్రనగర్ మీదుగా అత్తాపూర్ బ్రిడ్జ్ కింద ఉన్న మూసీ తీరానికి చేరుకున్నారు. పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్ వే బ్రిడ్జ్ పిల్లర్ నెం.118 కింది భాగంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అంతకు ముందు రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆ సమీపంలో ఉన్న కల్లు కాంపౌండ్‌కు వెళ్లి మరింత తాగి వచ్చారు. అక్కడ ఉండగానే పూర్తిగా మత్తు తలకెక్కిన అక్కాచెల్లుళ్లు ఆ వ్యక్తిని ‘గేలిచేశారు’. దీనితో సహనం కోల్పోయిన అతగాడు సమీపంలో ఉన్న గ్రానైట్ రాయితో ఒకరి తర్వాత ఒకరి తలలపై మోదాడు. ఇద్దరూ మితిమీరిన మత్తులో ఉండటంతో ప్రతిఘటించడం, అక్కడ నుంచి పారిపోవడం సాధ్యం కాలేదు. అయినప్పటికీ వారు చావలేదనే అనుమానంతో అతగాడు వారి చీరలతోనే గొంతు బిగించేశాడు. ఆపై రాయితో పాటు శవాలనూ మూసీలో పడేసి పరారయ్యాడు. ఆ ప్రాంతంలో ఆకుకూరలు పండించే వారి ద్వారా ఈ హత్యల విషయం మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న లంగర్‌హౌస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలించారు. సీసీ కెమెరాలు ఇచ్చిన ఆధారంగా ముందుకు వెళ్తూ అనుమానితుల జాబితా తయారు చేశారు. ఈ లోపు ఈ మృతదేహాలు లభించిన విషయం మీడియా ద్వారా తెలుసుకున్న మీర్‌పేటకు చెందిన నవనీత, ప్రవీణ్‌లు లంగర్‌హౌస్ పోలీసులను సంప్రదించారు. హతుల్లో ఒకరు తన తల్లి, మరొకరు పిన్ని అంటూ తెలిపారు. కీలక ఆధారాలు సేకరించిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతగాడిని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. -
సిటీలో జంట హత్యలు.. నరబలేనా..?
లంగర్‌హౌస్: సిటీ పశ్చిమ మండల పరిధిలోని లంగర్‌హౌస్‌లో జంట హత్యల కలకలం రేగింది. మంగళవారం సాయంత్రం మూసీ నదిలో ఇద్దరు మహిళల మృతదేహాలు బయటపడ్డాయి. సమీపంలోని కల్లు కాంపౌండ్ నుంచి తీసుకొచ్చి చంపారా? లేక ఎక్కడైనా చంపి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం పౌర్ణమి కావడం, గతేడాది తొలి పౌర్ణమి నాడు ఉప్పల్‌లో చిన్నారి నరబలి ఉదంతం చోటుచేసుకోవడంతో... ఇదీ ఆ తరహా ఉదంతమేనా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే మృతదేహాలను పరిశీలించిన పోలీసులు అలాంటిదేమీ లేదని స్పష్టం చేస్తున్నారు. మొఘల్ నాలా రింగ్ రోడ్డు నుంచి రాజేంద్రనగర్ వెళ్లే దారిలో పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్లు ఉన్నాయి. మూసీనదిపై ఉన్న అత్తాపూర్ బ్రిడ్జ్ కింద స్థానికులు ఆకుకూరలు పండిస్తారు. రోజు మాదిరి మంగళవారం ఉదయం అక్కడికి వచ్చిన వీరు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో పనులు పూర్తి చేసుకున్నారు. మూసీలో కాళ్లుచేతులు కడుక్కోవడానికి వెళ్లగా, పిల్లర్ నెం.118 కింది భాగంలో ఒడ్డుకు సమీపంలో గడ్డి మొక్కల మధ్యలో ఓ మనిషి కాలు ఉండడాన్ని గమనించారు. దీంతో మృతదేహంగా అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి వచ్చిన లంగర్‌హౌస్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమికంగా లభించిన ఆధారాలను బట్టి 30–35 ఏళ్ల మధ్య వయస్కురాలైన మహిళగా గుర్తించారు. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చగా... మరో కలకలం రేగింది. ఈ మృతదేహాన్ని తీసిన చోటే కదలిక ఉండడంతో ఇంకాస్త లోపలకు దిగిన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ మరో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే రెండో దాన్ని బయటకు తీశారు. ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో ఓ మృతదేహానికి తల వెనుక భాగంలో, మరోదానికి కన్ను, నుదురు ప్రాంతాల్లో గాయాలు ఉన్నట్లు తేల్చారు. మృతదేహాలు కుళ్లిపోకపోవడంతో హత్యలు సోమవారం రాత్రి లేదా మంగళవారం తెల్లవారుజామున జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆరాతీసినా... ఈ మృతదేహాలు బయటపడిన ప్రాంతానికి సమీపంలో కల్లు కాంపౌండ్ ఉంది. అక్కడకు వెళ్లి పోలీసులు ఈ మృతదేహాల ఫొటోలు చూపించి ఆరా తీసినా ఫలితం లభించలేదు. ఘటనాస్థలిలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆ ప్రాంతానికి దారి తీసే మార్గాల్లో ఉన్న వాటిలో నమోదైన ఫీడ్‌ను పరి«శీలిస్తున్నారు. మృతదేహాలు లభించిన చోట ఎలాంటి పెనుగులాట, హత్యలు జరిగిన ఆనవాళ్లు లభించలేదు. దీంతో ఇద్దరినీ మభ్యపెట్టి తీసుకొచ్చి ఇక్కడే చంపారా? లేక వేరే ప్రాంతంలో చంపి తీసుకొచ్చి పడేశారా? అనే అంశాలను దర్యాప్తు చేస్తున్నారు. రెండు మృతదేహాలపై ఉన్న వస్త్రాలు చెల్లాచెదురుగా ఉండడాన్ని బట్టి హత్యకు ముందు అఘాయిత్యం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోస్టుమార్టం పరీక్షలు పూర్తయితే తప్ప ఆ విషయం నిర్ధారించలేమని అంటున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మార్చురీకి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ రెండు మృతదేహాల ఒంటి నిండా పసుపు ఉంది. దీనికితోడు గతేడాది జనవరిలో వచ్చిన పౌర్ణమి తర్వాతి రోజు ఉప్పల్ చిలుకానగర్‌లోని రాజశేఖర్ ఇంటిపై చిన్నారి మృతదేహం కనిపించింది. ఈసారి పౌర్ణమి మరుసటి రోజు ఈ రెండు మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో ఇది కూడా నరబలే అని పుకార్లు చెలరేగాయి. పోలీసులు మాత్రం అలాంటిదేమీ లేదని, గాయాలు సైతం అలాంటి స్థితిలో లేవని పేర్కొంటున్నారు. నిందితుల్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. -
ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్ సిటీ: లంగర్‌హౌజ్ పరిధిలోని కనకదుర్గకాలనీలో సత్యనారాయణ(73) అనే మిలటరీ రిటైర్డ్ ఉద్యోగి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకున్నాడు. ఆరోగ్యం సరిగా లేనందునే ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
స్నేహితురాలు.. ఘరానా చోరీ
హైదరాబాద్ సిటీ: కొంతకాలంగా తనతో పాటు కలిసి ఉంటున్న స్నేహితురాలిని నమ్మి సొంత ఊరుకు వెళితే, స్నేహితురాలు రూ.లక్షల విలువైన వస్తువులతో ఉడాయించిన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం ఆల్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజస్తాన్‌కు చెందిన దేవికాశర్మ తల్లిదండ్రులు చనిపోవడంతో 2 సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి ఝాన్సీ బజార్లో బ్యూటీపార్లర్ నడుపుతోంది. అయితే పూనేకు చెందిన హాస్మాఖాన్ బ్యూటీపార్లర్‌కు వచ్చేది. ఇద్దరి మధ్య స్నేహం పెరిగి 2 సంవత్సరాలుగా రాజేంద్రనగర్‌లో వ్యభిచార గృహం నడిపిన కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. వీరిద్దరు బ్యూటీ పార్లర్ నడిపే యువతి సొంత ఊరుకు వెళ్లగా రూ.6 లక్షల ఖరీదైన బంగారం, ఇంట్లోని సామాగ్రితో పాటు మరో స్నేహితురాలు ఉడాయించింది.