లంగర్‌హౌస్, మీర్‌పేట: నగర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లంగర్‌హౌస్ జంట హత్యల మిస్టరీ వీడింది. ఈ ఉదంతాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని దర్యాప్తు చేసిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. అక్కాచెల్లెళ్లుగా తేలిన ఇద్దరు మహిళల్నీ ఒకే వ్యక్తి చంపినట్లు తేలింది. ఇరువురూ పూటుగా కల్లుతాగి ఉండటంతో అడ్డుకోలేకపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ హత్యలో ఇంకా ఎవరైనా పాల్గొన్నారా? అనే అంశంతో పాటు ఇతర విషయాలను ఆరా తీస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బడగూడ గ్రామానికి చెందిన దంపతులు రాజు–యాదమ్మ, లక్ష్మణ్–సుమిత్ర 15 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం సిటీకి వలసవచ్చారు.
వీళ్లు ప్రస్తుతం మీర్‌పేట పరిధిలోని బాలాపూర్ చౌరస్తా సమీపంలో ఉన్న లెనిన్‌నగర్‌లో నివసిస్తున్నారు. అక్కాచెల్లెళ్లు అయిన యాదమ్మ, సుమిత్రలు సమీపంలోని ఇళ్లల్లో పని చేస్తుండగా... రాజు, లక్ష్మణ్‌లు అడ్డా కూలీలుగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి నలుగురు చొప్పున సంతానం. సుమిత్ర భర్త లక్ష్మణ్ మద్యానికి బానిసై ఐదేళ్ల క్రితం చనిపోయాడు. తన పిల్లలకు వివాహాలు చేశాక సుమిత్ర.. యాదమ్మతో కలిసి కల్లు తాగడానికి అలవాటుపడింది. ఆ వ్యసనానికి బానిసలైన ఇరువురూ నిత్యం మత్తులోనే జోగుతూ ఉండేవారు. వీరి వ్యవహారశైలి అభ్యంతరకరంగా ఉండటంతో కాలనీవాసులు సైతం పలుమార్లు మందలించారు. దీంతో వీరు గత ఆరు నెలల క్రితం మీర్‌పేట అయోధ్యనగర్‌లో పక్కపక్క గదులు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. సుమిత్ర ఒంటరిగా, యాదమ్మ భర్తతో కలిసి జీవిస్తున్నారు. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు యాదమ్మ, సుమిత్రలు నిత్యం మాదిరిగానే కంచన్‌బాగ్ సరిహద్దుల్లో ఉన్న ధాతూనగర్ కల్లు కాంపౌండ్‌కు వెళ్లారు. అక్కడే కల్లు తాగడానికి వచ్చిన ఓ వ్యక్తితో వీరికి పరిచయమైంది.
ముగ్గురూ కలిసి మితిమీరిన మోతాదులో కల్లు తాగారు. అక్కడ ‘మాట్లాడుకున్న’ వీరంతా రాజేంద్రనగర్ మీదుగా అత్తాపూర్ బ్రిడ్జ్ కింద ఉన్న మూసీ తీరానికి చేరుకున్నారు. పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్ వే బ్రిడ్జ్ పిల్లర్ నెం.118 కింది భాగంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అంతకు ముందు రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆ సమీపంలో ఉన్న కల్లు కాంపౌండ్‌కు వెళ్లి మరింత తాగి వచ్చారు. అక్కడ ఉండగానే పూర్తిగా మత్తు తలకెక్కిన అక్కాచెల్లుళ్లు ఆ వ్యక్తిని ‘గేలిచేశారు’. దీనితో సహనం కోల్పోయిన అతగాడు సమీపంలో ఉన్న గ్రానైట్ రాయితో ఒకరి తర్వాత ఒకరి తలలపై మోదాడు. ఇద్దరూ మితిమీరిన మత్తులో ఉండటంతో ప్రతిఘటించడం, అక్కడ నుంచి పారిపోవడం సాధ్యం కాలేదు. అయినప్పటికీ వారు చావలేదనే అనుమానంతో అతగాడు వారి చీరలతోనే గొంతు బిగించేశాడు.
ఆపై రాయితో పాటు శవాలనూ మూసీలో పడేసి పరారయ్యాడు. ఆ ప్రాంతంలో ఆకుకూరలు పండించే వారి ద్వారా ఈ హత్యల విషయం మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న లంగర్‌హౌస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలించారు. సీసీ కెమెరాలు ఇచ్చిన ఆధారంగా ముందుకు వెళ్తూ అనుమానితుల జాబితా తయారు చేశారు. ఈ లోపు ఈ మృతదేహాలు లభించిన విషయం మీడియా ద్వారా తెలుసుకున్న మీర్‌పేటకు చెందిన నవనీత, ప్రవీణ్‌లు లంగర్‌హౌస్ పోలీసులను సంప్రదించారు. హతుల్లో ఒకరు తన తల్లి, మరొకరు పిన్ని అంటూ తెలిపారు. కీలక ఆధారాలు సేకరించిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతగాడిని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment