Latehar
-
రెండో పెళ్లి కోసం భార్య, కూతుర్ని చంపి..
లాతేహార్(జార్ఖండ్) : ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలనే దురాలోచనతో భార్య, కూతుర్ని కిరాతకంగా నరికి చంపాడో వ్యక్తి. అనంతరం పోలీసులు తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జార్ఖండ్‌లోని లాతేహార్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇస్రాఫిల్ అన్సారీ గత సంవత్సర కాలంగా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై అన్సారీ దంపతుల మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవి. ఎలాగైనా ఈ నెలలో ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అన్సారీ రెండో పెళ్లికి సిద్ధపడ్డ విషయం అతని భార్య షమీనా బేగం, కూతురు ఆస్మా పర్వీన్‌లకు తెలియడంతో అందుకు అడ్డుచెప్పారు. బుధవారం రాత్రి ఈ విషయంపై భార్య భర్తల మధ్య వాగ్వివాదం చేటుచేసుకుంది. దీంతో అతని కోపం కట్టలు తెంచుకుంది. ఉన్మాదిగా మారిన అన్సారీ గొడ్డలితో భార్య, కూతుర్ని విచక్షణారహితంగా నరికి చంపాడు. కొద్ది సేపటి తర్వాత పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం ఈ విషయం గ్రామ ప్రజలకు తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. -
ఆయనో బీజేపీ నేత.. ఎలా దాడి చేశారో చూడండి!
రాంచీ: ఆయనో బీజేపీ నాయకుడు. తన పేరును, హోదాను వాహనంపై దర్జాగా రాసుకున్నాడు. కానీ అది నిబంధనలకు విరుద్ధం కావడంతో దానిని జిల్లా రవాణ అధికారి తొలగించారు. అంతే, ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. నలుగురు చూస్తున్నారన్న భయం కూడా లేకుండా బాహాటంగానే అధికారిపై దాడికి దిగాడు. అతనికి మీదకొచ్చి పిడిగుద్దులు కురిపించాడు. దుర్భాషాలు ఆడాడు. తిట్లదండకం ఎత్తుకున్నాడు. అధికారి ప్రతిఘటించడంతో ఆగాడు కానీ లేకుంటే ఇంకా దాడి చేసేవాడే.. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. స్థానిక బీజేపీ నాయకుడు రాజధాని యాదవ్ లాతెహార్ జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి (డీటీవో) ఎఫ్ బర్లాపై దాడికి దిగాడు. ఈ ఘటన కెమెరా కంటికి చిక్కింది. తన వాహనం మీద ఉన్న పేరు, హోదా స్టిక్కర్‌ను తీసివేయడంతో రాజధాని యాదవ్‌కు ఇలా పట్టరాని కోపం వచ్చింది. డీటీవోపై దాడిచేసిన ఆయనను అనంతరం పోలీసులు అరెస్టు చేశారు. -
విషాదకరమైన ట్విస్టు: పాము కాటేసిందని..
జార్ఖండ్‌లో ఓ గ్రామస్తుడిని విషపూరితమైన పాము కాటేసింది. దీంతో కోపోద్రిక్తుడైన అతడు పామును పట్టుకొని.. దానిని కొరికి చంపేశాడు. ఆ తర్వాత 12 గంటలకు పాము విషం వల్ల అతడు కూడా చనిపోయాడు. జార్ఖండ్ లాతేహార్లోని బరియతూ గ్రామంలో ఈ ఘటన జరిగింది. (చదవండి: ఊహించని ట్విస్ట్: పాము కాటేసిందని..) గురువారం అర్ధరాత్రి వేళ పాము బుస్సలు వినిపించడంతో 50 ఏళ్ల రాంథూ ఒరాన్ నిద్రలోంచి మేల్కొన్నారు. పొరుగు ఇంట్లోకి పాము దూరడంతో ఆ ఇంట్లోని వారు సాయం కోసం కేకలు వేశారు. దీంతో ఒరాన్ వెంటనే వాళ్ల ఇంట్లోకి వెళ్లి పామును తన చేతుల్లో పట్టుకొని బయటకు తీసుకొచ్చాడు. అంతలోనే అతడు పామును తన పళ్లతో కొరికేశాడు. దాంతో అది చనిపోయింది. అయితే, ఇంట్లోకి దూరిన పామును పట్టుకునే క్రమంలో అది ఆయనను కూడా కాటేసిందని ఆ తర్వాత గ్రామస్తులు, బంధువులు గుర్తించారు. మెల్లగా విషం పాకుతుండటంతో చికిత్స కోసం ఆయనను లాతేహార్ జిల్లాలోని కార్మెల్ ఆశా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. పాముకాటుకు ప్రత్యేక చికిత్స అందించే ఈ ఆస్పత్రిలో ఆయన 12 గంటల తర్వాత మరణించాడు. జార్ఖండ్‌లో పాముల్ని కొరకడం అసాధారణమేమీ కాదు. గతంలో ఓ గిరిజనుడిని పాము కాటేయగా.. ప్రతిగా దానిని అతడు తినేశాడు. అయినప్పటికీ అతడు బతకి బయటపడిన సంగతి తెలిసిందే. -
వారిని హిందుత్వవాదులే చంపారా?
రాంచి: జార్ఖండ్ రాష్ట్రంలోని జబ్బార్ గ్రామంలో శుక్రవారం ఉదయం ఇద్దరు పశువుల వ్యాపారులను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి, వారి చేతులను వెనక్కి విరిచికట్టి ఓ చెట్టుకు ఉరితీశారు. వారి హత్యకు కారణాలు ఏమిటో పోలీసులు నేటికి కనుక్కోలేకపోయినా వారిని హిందుత్వవాదులే హత్యచేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హత్యకు గురైన వారు ఆజాద్ ఖాన్ అలియాస్ ఇబ్రహీం(15), ముహమ్మద్ మజ్లూం(35) అనే ముస్లిం యువకులు అవడం, గోవులను కబేళాలకు తరలిస్తున్నారని ఆ మధ్య ఇద్దరు వ్యక్తులను హిందుత్వ వాదులు కొట్టి చంపిన నేపథ్యంలో ఈ హత్యలు కూడా ఆ కోవకు చెందినవేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉరితీసిన చోట ఓ వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడి గొడవ చేయడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితులను అదుపు చేయడం కోసం పోలీసులు పలుసార్లు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇవి కచ్చితంగా హిందూ ర్యాడికల్స్ చేసిన హత్యలేనని జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) ఎమ్మెల్యే ప్రకాష్ రమాస్ ఆరోపించారు. ఎనిమిది ఎద్దులను సమీపంలోని ఛాట్రా మార్కెట్‌కు తీసుకెళుతుండగా ఈ హత్యలు జరిగాయని, కొంతమంది గుంపు ముస్లిం యువకులను తీవ్రంగా కొట్టడం దూరం నుంచి చూశామంటూ కొందరు గ్రామస్థులు తెలిపారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఎద్దులు ఏమయ్యాయో గ్రామస్థులు కూడా చెప్పలేక పోతున్నారని వారన్నారు. ఇప్పుడే హత్యలపై ఓ నిర్ణయానికి రాలేమని, హత్యలకు గురైన వారితో ఎవరికైనా వ్యక్తిగత కక్ష్యలు ఉన్నాయా? వ్యాపార లావాదేవీల గొడవులున్నాయా ? అన్న అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. -
జార్ఖండ్‌లో మరో దారుణం
లాతేహార్ (జార్ఖండ్): ముంబైలో మహిళా ఫొటో జర్నలిస్టుపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని మరువక ముందే జార్ఖండ్‌లో మరో అఘాయిత్యం జరిగింది. లాతేహార్ జిల్లాలో దోపిడీ దొంగలు ఏకంగా మహిళా కానిస్టేబుల్‌పైనే సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బాధితురాలు కుటుంబ సభ్యులతో కలసి తన బావ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తరలిస్తుండగా ఈ సంఘటన జరిగిందని శనివారం పోలీసులు చెప్పారు. గురువారం వేకువజామున రాంచీ నుంచి తన బావ మృతదేహాన్ని కుటుంబ సభ్యులతో కలసి కారులో గర్వా తరలిస్తుండగా, లాతేహార్ జిల్లా జగల్దగా సమీపంలో 75వ నంబరు జాతీయ రహదారిపై కొందరు దోపిడీ దొంగలు అటకాయించారని తెలిపింది. వాహనంలో ఉన్న వారందరినీ దోచుకున్నారని, వారిలో ముగ్గురు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఎఫ్ఐఆర్లో ఆరోపించింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.