లాతేహార్ (జార్ఖండ్): ముంబైలో మహిళా ఫొటో జర్నలిస్టుపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని మరువక ముందే జార్ఖండ్‌లో మరో అఘాయిత్యం జరిగింది. లాతేహార్ జిల్లాలో దోపిడీ దొంగలు ఏకంగా మహిళా కానిస్టేబుల్‌పైనే సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బాధితురాలు కుటుంబ సభ్యులతో కలసి తన బావ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తరలిస్తుండగా ఈ సంఘటన జరిగిందని శనివారం పోలీసులు చెప్పారు. గురువారం వేకువజామున రాంచీ నుంచి తన బావ మృతదేహాన్ని కుటుంబ సభ్యులతో కలసి కారులో గర్వా తరలిస్తుండగా, లాతేహార్ జిల్లా జగల్దగా సమీపంలో 75వ నంబరు జాతీయ రహదారిపై కొందరు దోపిడీ దొంగలు అటకాయించారని తెలిపింది. వాహనంలో ఉన్న వారందరినీ దోచుకున్నారని, వారిలో ముగ్గురు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.