ఆగని అత్యాచారాల పర్వం | Four arrested in minor girl gangrape case in Bihar | Sakshi
Sakshi News home page

ఆగని అత్యాచారాల పర్వం

Published Sat, Jun 23 2018 2:53 AM | Last Updated on Sat, Apr 6 2019 9:01 PM

Four arrested in minor girl gangrape case in Bihar - Sakshi

రాంచీ/న్యూఢిల్లీ/గ్వాలియర్‌: ప్రభుత్వం ఎన్నిచట్టాలు తీసుకొస్తున్నా దేశంలో కామాంధుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా జార్ఖండ్‌లో ఓ ఎన్జీవో సంస్థకు చెందిన ఐదుగురు మహిళల్ని దుండుగులు ఎత్తుకెళ్లి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడగా.. మధ్యప్రదేశ్‌లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా హత్యచేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో ఓ మైనర్‌ బాలికపై 10 మంది నీచులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వలసలు, మనుషుల అక్రమ రవాణాపై అవగాహన కల్పించేందుకు 11 మందితో కూడిన ఓ ఎన్జీవో బృందం ఈ నెల 19న జార్ఖండ్‌లోని కుంతి జిల్లా ఛోఛంగ్‌ గ్రామానికి వెళ్లి వీధి నాటకాన్ని ప్రదర్శించింది. ఇంతలో అక్కడికి బైక్‌లపై వచ్చిన దుండగులు తుపాకీ గురిపెట్టి ఐదుగురు మహిళల్ని సమీపంలోని అటవీప్రాంతానికి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ దారుణాన్ని మొబైల్‌ ఫోన్లతో రికార్డు చేసి పోలీసులకు చెబితే ఈ వీడియోలను వైరల్‌ చేస్తామని హెచ్చరించారు. ఈ విషయమై డీఐజీ అమోల్‌ హోమ్కర్‌ మాట్లాడుతూ.. గ్యాంగ్‌రేప్‌కు సంబంధించి తమకు ఫిర్యాదులేవీ అందలేదని తెలిపారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుకున్న సమాచారం ఆధారంగా 8 మంది నిందితుల్ని అరెస్ట్‌ చేశామన్నారు. పరారీలో ఉన్న నిందితుల్ని అరెస్ట్‌ చేసేందుకు మూడు బృందాలను ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు.  ఈ ఘటనపై విచారణ జరిపేందుకు జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌డబ్ల్యూసీ) ముగ్గురు సభ్యుల విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు బొకారో జిల్లాలో ఓ మైనర్‌ ఆదివాసీ బాలికపై నలుగురు యువకులు గురువారం గ్యాంగ్‌రేప్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఇద్దరిని అరెస్ట్‌ చేశామన్నారు.

మైనర్‌ బాలిక రేప్,హత్య..
తల్లిదండ్రులతో ఓ వివాహ వేడుకకు హాజరైన ఆరేళ్ల చిన్నారిపై మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో గుర్తుతెలియని దుండగుడు అత్యాచారానికి పాల్పడి కిరాతకంగా గొంతునులిమి హత్యచేశాడు. అర్థరాత్రి సమయంలో బాలిక నీళ్లు తాగేందుకు వెళ్లింది. ఎంతసేపయినా రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీలను పరిశీలించిన పోలీసులు గాలింపు చేపట్టగా వివాహ వేదికకు సమీపంలో బాలిక మృతదేహం లభ్యమైంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక(15)పై 10 మంది గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు.

జహంగీరాబాద్‌ సర్కిల్‌ అధికారి జితేంద్ర సింగ్‌ మాట్లాడుతూ.. బాధితురాలు తన తల్లిదండ్రులతో కలసి సోమవారం ఓ వివాహ వేడుకకు హాజరయిందని తెలిపారు. ఇంతలో బాలికకు పరిచయమున్న ఇద్దరు వ్యక్తులు సమీపంలోని పుణ్యక్షేత్రానికి వెళ్దామంటూ బాధితురాలిని బైక్‌పై ఎక్కించుకున్నారు. అనంతరం వీరితో పాటు మరో 8 మంది దుండగులు మైనర్‌ బాలికపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. నిందితులపై ఐపీసీతో పాటు పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అస్సాంలోని కోక్రాఝర్‌లో ఆరేళ్ల బాలికపై దుండగులు అత్యాచారానికి ఒడిగట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement