విషాదకరమైన ట్విస్టు: పాము కాటేసిందని..
జార్ఖండ్‌లో ఓ గ్రామస్తుడిని విషపూరితమైన పాము కాటేసింది. దీంతో కోపోద్రిక్తుడైన అతడు పామును పట్టుకొని.. దానిని కొరికి చంపేశాడు. ఆ తర్వాత 12 గంటలకు పాము విషం వల్ల అతడు కూడా చనిపోయాడు. జార్ఖండ్ లాతేహార్‌లోని బరియతూ గ్రామంలో ఈ ఘటన జరిగింది. (చదవండి: ఊహించని ట్విస్ట్: పాము కాటేసిందని..)
గురువారం అర్ధరాత్రి వేళ పాము బుస్సలు వినిపించడంతో 50 ఏళ్ల రాంథూ ఒరాన్ నిద్రలోంచి మేల్కొన్నారు. పొరుగు ఇంట్లోకి పాము దూరడంతో ఆ ఇంట్లోని వారు సాయం కోసం కేకలు వేశారు. దీంతో ఒరాన్ వెంటనే వాళ్ల ఇంట్లోకి వెళ్లి పామును తన చేతుల్లో పట్టుకొని బయటకు తీసుకొచ్చాడు. అంతలోనే అతడు పామును తన పళ్లతో కొరికేశాడు. దాంతో అది చనిపోయింది. అయితే, ఇంట్లోకి దూరిన పామును పట్టుకునే క్రమంలో అది ఆయనను కూడా కాటేసిందని ఆ తర్వాత గ్రామస్తులు, బంధువులు గుర్తించారు. మెల్లగా విషం పాకుతుండటంతో చికిత్స కోసం ఆయనను లాతేహార్ జిల్లాలోని కార్మెల్ ఆశా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. పాముకాటుకు ప్రత్యేక చికిత్స అందించే ఈ ఆస్పత్రిలో ఆయన 12 గంటల తర్వాత మరణించాడు.
జార్ఖండ్‌లో పాముల్ని కొరకడం అసాధారణమేమీ కాదు. గతంలో ఓ గిరిజనుడిని పాము కాటేయగా.. ప్రతిగా దానిని అతడు తినేశాడు. అయినప్పటికీ అతడు బతకి బయటపడిన సంగతి తెలిసిందే.