Latest Collection
-
వరుస పండగలు.. వింటేజ్ వేడుక
ఆషాఢమాసం... బోనాలు శ్రావణం... వరలక్ష్మీ వ్రతాలు వరుస పండగలు, వేడుకలు మనల్ని పలకరించబోతున్నాయి. ఇన్ని రోజులూ మహమ్మారి కారణంగా సందడికి దూరంగా ఉన్నా ఇక ముందు వేడుకలు కొత్తగా ముస్తాబు కానున్నాయి. యాభై ఏళ్ల కిందటి వింటేజ్ కళతో ఇప్పుడిక మెరిసిపోనున్నాయి. కొన్ని చీరకట్టులను చూస్తే ప్రసిద్ధ వ్యక్తుల పరిచయం అక్కర్లేకుండా కళ్ల ముందు మెదలుతారు. అలాంటి వారిలో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, బాలీవుడ్ నటి రేఖ వంటి వారుంటారు. పెద్ద అంచు కంచి పట్టు చీరలైనా, రంగుల హంగులైనా, ఆభరణాల జిలుగులైనా, కేశాలంకరణ అయినా.. ఎటు కదిలినా ఆ అందం వారి ప్రత్యేకతను కళ్లకు కడుతుంది. ప్రసిద్ధ వ్యక్తులను తలపించేలా నేటి తరం అమ్మాయిల ఆహార్యం ఉంటే ఒక వింటేజ్ అట్రాక్షన్‌తో ఇట్టే ఆకట్టుకుంటారు. ఎప్పటికీ ఉండిపోవాలనే.. అమ్మమ్మ, అమ్మ, అమ్మాయి.. ఇలా తరతరాలకు ఈ గొప్పతనం అందాలనే ఉద్దేశ్యంతో ఎప్పటికీ ఆ కళ నిలిచిపోయే విధంగా డిజైన్ చేసిన చీరలు ఇవి. ప్యూర్ పట్టుతో మగ్గం మీద నేసిన చీరలు ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటాయి. సాధారణంగా కంచిపట్టు అనగానే అందరికీ తెలిసిన రంగులు ఎరుపు, పసుపు, గోల్డ్ టిష్యూ. కానీ, చాలా అరుదైన రంగుల చీరలను ఎంచుకొని యాభై ఏళ్ల కిందటి లుక్ వచ్చేలా చేనేతకారులతో డిజైన్ చేసిన చీరలు ఇవి. నటి రేఖను తలచుకోగానే ఆమె కంజీవరం చీరలో గ్రాండ్‌గా కనిపిస్తారు. దక్షిణభారత అందాన్ని ప్రపంచ ప్రసిద్ధి చేశారు. ఈ థీమ్‌ని బేస్‌గా చేసుకొని రంగులను ఎంపిక చేసి, ప్రత్యేకంగా రూపొందించిన చీరలు ఇవి. నిన్నటి తరం నుంచి నేడు, అలాగే రేపటి తరానికి కూడా ఈ కళను తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యంతో తీసుకువచ్చిన కలెక్షన్ ఇది. – భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్ -
Anita Dongre: ప్రకృతిలో అందంగా ఒదిగిపోయే ఫ్యాషన్
దానిమ్మకాయ తొక్కలను ఉడకబెట్టి చెట్టు బెరడు నుంచి తీసిన ఎరుపును పులిమి, బెల్లం నీళ్లను కలిపి ఓ రంగును తయారు చేయొచ్చని ఎప్పుడైనా ఆలోచించారా..!ఎక్కువ కాలం మన్నదగిన.. ప్రకృతిలో అందంగా ఒదిగిపోయే ఫ్యాషన్ గురించి ప్రస్తావించారా..! ఇప్పుడు మన కొనుగోలు అలవాట్లనూ, ఫ్యాషన్‌ను వినియోగించే విధానాన్ని పునరాలోచనలో పడేసింది కాలం. ఈ ఏడాది వాతావరణ మార్పులకు సంబంధించిన సమస్యల గురించి మనమే మరింత స్పృహతో జీవించడానికి చర్యలు తీసుకోవాలి. అందుకు, ‘సస్టెయినబుల్ ఫ్యాషన్ ’ అనే పదం ఇప్పుడు ఫ్యాషన్ ఇంట సందడి చేస్తోంది. గతకాలపు ఫ్యాషన్‌కు విరుద్ధంగా కాలాలకు అనుకూలంగా ఫ్యాబ్రిక్ డిజైన్ తీసుకురావాల్సిన అవసరం ఉందంటోంది. ఇండియన్ డిజైనర్ అనితా డోంగ్రే తాజా కలెక్షన్ అందుకు అసలైన ఉదాహరణ. సేంద్రీయ పత్తి పర్యావరణానికి అనుకూలమైనదని, మట్టిలో త్వరగా కలిసిపోతుందని మనకు తెలిసిందే. కానీ, ఇన్నాళ్లూ వాటిపై అంతగా దృష్టిపెట్టలేదు. ఇప్పుడిక పూర్తి బయోడిగ్రేడబుల్ ఫ్యాబ్రిక్ క్లాత్స్తో ఫ్యాషన్ ప్రపంచం మెరవనుంది. ‘రెడ్యూస్, రీ యూజ్, రీ సైకిల్’ అనే రెట్రో ఫీల్ ఇక ముందు కనిపించబోతోంది. అనితా డోంగ్రే తన తాజా కలెక్షన్ ‘టెన్సెల్ సౌండ్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ దీనిని ప్రతిఫలింపజేస్తుంది. తన డిజైన్లలో ఉపయోగించిన ఫ్యాబ్రిక్ ప్రకృతికి అనుకూలమైనదిగా చాటిచెబుతోంది. ‘ఈ కలెక్షన్ అంతా అడవుల నుంచి సేకరించిన పీచుపదార్థాలతో రూపొందించినవి, ఆకులు, పండ్ల నుంచి తీసిన రంగులతో ప్రింట్లుగా అలంకరించాం. డ్రెస్సులు మాత్రమే కాదు కవర్, ప్యాకేజింగ్ వరకు మా ఉత్పత్తులలో ప్లాస్టిక్‌ని ఉపయోగించకూడదని నిర్ణయం తీసుకున్నాం. ప్యాకేజింగ్‌లోనూ నూరు శాతం రీసైకిల్ కాగితాన్నే ఉపయోగిస్తాం’ అని డిజైనర్లు తెలియజేస్తున్నారు. డిజైనర్ అనావిలా మిశ్రా తన బ్రాండ్ నేమ్‌తో నార చీరలను సృష్టిస్తోంది. 100 శాతం సేంద్రీయ పత్తి నుండి తయారుచేసిన ఫ్యాబ్రిక్ ను తన డిజైన్స్‌కు ఉపయోగిస్తున్నారు. షర్ట్ డిజైన్స్, బ్యాండ్స్, బ్యాగులు పూర్తిగా బయోడిగ్రేడబుల్కి మారిపోయాయి. మెన్స్ బ్రాండ్‌లో పేరెన్నికగన్న బెస్పోక్ రాఘవేంద్ర రాథోడ్ ‘పర్యావణం శ్రేయస్సును అంతా దృష్టిలో పెట్టాల్సిన సమయం ఇది’ అని ప్రస్తావిస్తున్నారు. కరోనా వైరస్ ఫ్యాషన్‌ను మన్నదగిన భవిష్యత్తువైపు అడుగులు వేయిస్తోంది. నిజానికి ఫ్యాషన్ ప్రతి సీజన్ లోనూ కొత్త పోకడలు, శైలులు, సరికొత్త శ్రేణులతో మార్పు చెందుతుంది. మహమ్మారి కారణంగా ప్రజలు ఒక అడుగు వెనక్కి తీసుకొని వారి వినియోగ అలవాట్ల గురించి, పర్యావరణ నష్టం గురించి స్వయంగా తెలుసుకునే అవకాశం ఇకపై ఉంది. అనితా డోంగ్రే ఫ్యాషన్ డిజైనర్ -
Fashion: ఇకత్ స్టైల్.. ఎవర్గ్రీన్
ఇకత్ కాటన్ వేసవి ఉక్కపోతను తట్టుకుంటుంది. సంప్రదాయకతను కళ్లకు కడుతుంది. ఆధునికతనూ సింగారించుకుంటుంది. ఈ ఫ్యాబ్రిక్ కలనేతలోనే ఎవర్గ్రీన్ అనిపించే గొప్పదనం దాగుంటుంది. ఇక ఈ ఫ్యాబ్రిక్‌తో డ్రెస్సులను సందర్భానికి తగినట్టు డిజైన్ చేయించుకోవచ్చు. ఒకప్పుడు బెడ్షీట్స్గానే పేరొందిన ఇకత్ ఆ తర్వాత చీరలు, డ్రెస్సుల రూపంలోకి మారి అన్ని వయసుల వారినీ ఆకట్టుకుంది. క్యాజువల్ వేర్‌గానూ, పార్టీవేర్‌గానూ, అఫిషియల్ వేర్‌గానూ తన ప్రత్యేకతను చాటుతూనే ఉంది. ఇండోవెస్ట్రన్ స్టైల్లో డిజైన్ చేసిన ఇకత్ డ్రెస్సులు ఈ తరం అమ్మాయిలను, అమ్మలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అబ్బాయిలకు కుర్తీలు, అమ్మాయిలకు ఫ్రాక్స్, లాంగ్ గౌన్స్తో పాటు వీటికి ఈ కాలానికి తగినట్టు మ్యాచింగ్‌గా ఇకత్ మాస్క్‌లను కూడా జత చేసుకోవచ్చు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో ఉండే ఇకత్ సింగిల్, డబుల్, పట్టులో లభిస్తుంది. కాటన్లో అయితే యంగ్‌స్టర్స్‌కి ఫ్రాక్స్. మోడలింగ్‌కి ప్యాంట్–క్రాప్‌టాప్ విత్ ఓవర్ కోట్, లాంగ్గౌన్స్ చిన్న చిన్న గెట్ టు గెదర్ పార్టీలకు హ్యాపీగా ధరించవ్చు. ఇది చేనేతకారులను ప్రోత్సహించాల్సిన సమయం. ఇకత్ క్లాత్‌తో ఎన్ని డిజైన్లు చేసుకోగలిగితే అన్నీ ప్రయత్నించవచ్చు. అందుకు కొన్ని మోడల్స్ ఇవి. – రజితారాజ్, డిజైనర్, హైదరాబాద్ -
లేటెస్ట్ కలెక్షన్; ఈవిల్ ఐ బ్రేస్లెట్
దేశాల అంతరాలు లేకుండా చెడు దృష్టి పడకుండా అడ్డుకునేందుకు మనిషి ప్రాచీన కాలం నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. వాటిలో ముఖ్యమైనది పెద్ద నీలిరంగు కనుగుడ్డు ఆకారం. ఇది మనకి హాని జరగాలని కోరుకునేవారిపై చెడు ప్రభావాన్ని చూపుతుందనే నమ్మకంతో మార్కెట్లోకి వచ్చింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఇదో ఆభరణంగా అందరినీ ఆకర్షించింది. ఇప్పుడు ఈ డిజైన్స్‌కి ఏమాత్రం కొదవలేదన్నట్టుగా ‘నీలికన్ను’ దర్జా పోతోంది. ఇతర ఆభరణాలను ఒక్క చూపుతో కట్టడి చేస్తూ ట్రెండ్‌లో ముందంజలో ఉంటోంది. అదృష్టానికి చిహ్నంగా మారిపోయింది. ఆభరణాల విభాగంలో ఈవిల్ ఐ బ్రేస్లెట్, లాకెట్, ఉంగరం, చెవి పోగుల్లో ఎక్కువగా దర్శనమిస్తోంది. వీటిలో పెద్ద, చిన్న పరిమాణంలో ఉన్నవి లభిస్తున్నాయి. ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే ఫ్యాషన్ జ్యువెలరీలోనూ ఈవిల్ ఐ తన ప్రాధాన్యతను చాటుకుంటూనే ఉంది. ‘వినియోగదారులు వీటిని వ్యక్తిగత ఆభరణంగా ఎంపిక చేసుకుంటున్నారు’ అని ఆభరణాల నిపుణులు చెబుతున్న మాట. ఈవిల్ ఐ ఆభరణాన్ని తమ ఆత్మీయులకు మంచి జరగాలని కానుకగా కూడా ఇస్తున్నారు.