దానిమ్మకాయ తొక్కలను ఉడకబెట్టి చెట్టు బెరడు నుంచి తీసిన ఎరుపును పులిమి, బెల్లం నీళ్లను కలిపి ఓ రంగును తయారు చేయొచ్చని ఎప్పుడైనా ఆలోచించారా..!ఎక్కువ కాలం మన్నదగిన.. ప్రకృతిలో అందంగా ఒదిగిపోయే ఫ్యాషన్ గురించి ప్రస్తావించారా..! ఇప్పుడు మన కొనుగోలు అలవాట్లనూ, ఫ్యాషన్‌ను వినియోగించే విధానాన్ని పునరాలోచనలో పడేసింది కాలం.
ఈ ఏడాది వాతావరణ మార్పులకు సంబంధించిన సమస్యల గురించి మనమే మరింత స్పృహతో జీవించడానికి చర్యలు తీసుకోవాలి. అందుకు, ‘సస్టెయినబుల్ ఫ్యాషన్ ’ అనే పదం ఇప్పుడు ఫ్యాషన్ ఇంట సందడి చేస్తోంది. గతకాలపు ఫ్యాషన్‌కు విరుద్ధంగా కాలాలకు అనుకూలంగా ఫ్యాబ్రిక్ డిజైన్ తీసుకురావాల్సిన అవసరం ఉందంటోంది. ఇండియన్ డిజైనర్ అనితా డోంగ్రే తాజా కలెక్షన్ అందుకు అసలైన ఉదాహరణ.
సేంద్రీయ పత్తి పర్యావరణానికి అనుకూలమైనదని, మట్టిలో త్వరగా కలిసిపోతుందని మనకు తెలిసిందే. కానీ, ఇన్నాళ్లూ వాటిపై అంతగా దృష్టిపెట్టలేదు. ఇప్పుడిక పూర్తి బయోడిగ్రేడబుల్ ఫ్యాబ్రిక్ క్లాత్స్‌తో ఫ్యాషన్ ప్రపంచం మెరవనుంది. ‘రెడ్యూస్, రీ యూజ్, రీ సైకిల్’ అనే రెట్రో ఫీల్ ఇక ముందు కనిపించబోతోంది. అనితా డోంగ్రే తన తాజా కలెక్షన్ ‘టెన్సెల్ సౌండ్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ దీనిని ప్రతిఫలింపజేస్తుంది. తన డిజైన్లలో ఉపయోగించిన ఫ్యాబ్రిక్ ప్రకృతికి అనుకూలమైనదిగా చాటిచెబుతోంది. ‘ఈ కలెక్షన్ అంతా అడవుల నుంచి సేకరించిన పీచుపదార్థాలతో రూపొందించినవి, ఆకులు, పండ్ల నుంచి తీసిన రంగులతో ప్రింట్లుగా అలంకరించాం. డ్రెస్సులు మాత్రమే కాదు కవర్, ప్యాకేజింగ్ వరకు మా ఉత్పత్తులలో ప్లాస్టిక్‌ని ఉపయోగించకూడదని నిర్ణయం తీసుకున్నాం. ప్యాకేజింగ్‌లోనూ నూరు శాతం రీసైకిల్ కాగితాన్నే ఉపయోగిస్తాం’ అని డిజైనర్లు తెలియజేస్తున్నారు.
డిజైనర్ అనావిలా మిశ్రా తన బ్రాండ్ నేమ్‌తో నార చీరలను సృష్టిస్తోంది. 100 శాతం సేంద్రీయ పత్తి నుండి తయారుచేసిన ఫ్యాబ్రిక్ ను తన డిజైన్స్‌కు ఉపయోగిస్తున్నారు. షర్ట్ డిజైన్స్, బ్యాండ్స్, బ్యాగులు పూర్తిగా బయోడిగ్రేడబుల్‌కి మారిపోయాయి.
మెన్స్ బ్రాండ్‌లో పేరెన్నికగన్న బెస్పోక్ రాఘవేంద్ర రాథోడ్ ‘పర్యావణం శ్రేయస్సును అంతా దృష్టిలో పెట్టాల్సిన సమయం ఇది’ అని ప్రస్తావిస్తున్నారు.
కరోనా వైరస్ ఫ్యాషన్‌ను మన్నదగిన భవిష్యత్తువైపు అడుగులు వేయిస్తోంది. నిజానికి ఫ్యాషన్ ప్రతి సీజన్ లోనూ కొత్త పోకడలు, శైలులు, సరికొత్త శ్రేణులతో మార్పు చెందుతుంది. మహమ్మారి కారణంగా ప్రజలు ఒక అడుగు వెనక్కి తీసుకొని వారి వినియోగ అలవాట్ల గురించి, పర్యావరణ నష్టం గురించి స్వయంగా తెలుసుకునే అవకాశం ఇకపై ఉంది.
అనితా డోంగ్రే ఫ్యాషన్ డిజైనర్
Comments
Please login to add a commentAdd a comment