lathis
-
గిరిజన మహిళపై థర్డ్‌డిగ్రీ..
నాగోలు: ఒంటరిగా ఉన్న ఓ గిరిజన మహిళను అనుమానించారు. అంతటితో ఆగకుండా బలవంతంగా అర్ధరాత్రివేళ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రంతా స్టేషన్లో నిర్బంధించి లాఠీలు, బూటు కాళ్లతో తంతూ చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరగ్గా, ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పడమటిపల్లితండాకు చెందిన వడిడ్త్యా లక్ష్మి, భర్త శ్రీను చనిపోవడంతో ముగ్గురు పిల్లలతో మీర్‌పేటలోని నందిహిల్స్‌కు వచ్చింది. స్థానికంగా ఇళ్లలో పనికి కుదిరి ఇక్కడే నివాసముంటోంది. ఇటీవల లక్ష్మి పెద్ద కూతురుకు పెళ్లి సంబంధం కుదిరింది. ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఈనెల 30న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి ఖర్చుల కోసమని దేవరకొండలోని బంధువుల ఇంటికి ఈ నెల 15వ తేదీన వెళ్లింది. వారి వద్ద రూ.3లక్షల నగదు అప్పుగా తీసుకుంది. అక్కడి నుంచి ఎల్బీనగర్కు బస్సులో వచ్చింది. అప్పటికే అర్ధరాత్రి అయ్యింది. మీర్‌పేటకు వెళ్లేందుకు ఆటోలు, బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఎల్బీనగర్ చౌరస్తాలో రోడ్డు పక్కన లక్ష్మి నిలబడింది. అదే సమయంలో పెట్రోలింగ్ వాహనం ఆమె వద్దకు వచ్చి ఆగింది. ఎక్కడకు వెళుతున్నావు...చేతిలో డబ్బు ఎక్కడిదని పోలీసులు గట్టిగా ప్రశ్నించారు. ఊరి నుంచి వస్తున్నానని, ఆటో కోసం ఎదురుచూస్తున్నానని చెప్పినా పోలీసులు వినలేదు. కూతురు పెళ్లికార్డు చూపించినా పట్టించుకోలేదు. అర్ధరాత్రి వేళ లక్ష్మిని ఎల్బీనగర్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో లక్ష్మికి పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులకే ఎదురు మాట్లాడతావా అంటూ లక్ష్మిపై హెడ్ కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలత, మరో ఇద్దరు సిబ్బంది లాఠీలు, బూటు కాళ్లతో దాడి చేశారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఉదయం ఆటోలో పోలీసులు లక్ష్మిని ఇంటికి పంపించారు. లక్ష్మి నడవలేని పరిస్థితిని గమనించిన ఆమె కుటుంబసభ్యులు స్థానిక వైద్యుడిని ఇంటికి పిలిపించి వైద్యం చేయించారు. పూజ ఫిర్యాదు.. పోలీసులపై అట్రాసిటీ కేసు లక్ష్మి కూతురు వడ్త్యా పూజ ఫిర్యాదు మేరకు దాడి చేసిన పోలీసులపై ఎల్బీనగర్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదైంది. పూజ ఫిర్యాదు ప్రకారం...ఈనెల 15వ తేదీన తల్లి లక్ష్మి తన పెళ్లికి కోసం రూ. 3లక్షల అప్పుగా తేవడానికి మేనమామ చంద్రుని వద్దకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. సాయంత్రం వరకు నేనే నా తమ్ముడు అమ్మకోసం ఎదురుచూశాం. కానీ ఆమె రాలేదు. 16వ తేదీన ఎల్బీనగర్ స్టేషన్ అమ్మ ఉన్నట్టు సమాచారం తెలిసి కొంతమందితో కలిసి వెళ్లాను. అమ్మ గురించి పోలీసులను అడిగితే తనను కులం పేరుతో దూషించారని, తల్లిపై పోలీసులు తొడలు, మోకాలు ఇతర శరీర భాగాలపై తీవ్రంగా కొట్టి గాయాలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. తన తల్లి వద్ద ఉన్న రూ. 3లక్షల నగదు, బంగారు చెవి రింగులు కూడా కనిపించడం లేదని ఆ ఫిర్యాదులో వివరించింది. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు 354, 324, 379,సెక్షన్3(1) (ఆర్)(ఎస్), 3(2)(వీఏ), అట్రాసిటీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. లక్ష్మికి సొంత ఖర్చులతో వైద్యం చేయిస్తా.. గాయపడిన లక్ష్మి వైద్య ఖర్చులు మొత్తం తానే భరిస్తానని ఎల్బీనగర్ ఏసీపీ జానకిరెడ్డి తెలిపారు. లక్ష్మిని వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించామన్నారు. డబ్బు, ఆభరణాలు లాక్కొన్నారు ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి, రాత్రంతా అక్కడే ఉంచి చితకబాదారు. తన చేతిలోని నగదు, మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ పోలీసులు బలవంతంగా తీసుకున్నారు. ఈ క్రమంలో వారితో వాగ్వాదం జరిగింది. నాపై దాడి చేసిన ఎస్ఐపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. – బాధితురాలు లక్ష్మి అర్ధరాత్రి ముఠాగా సంచరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ముఠాగా ఏర్పడి అర్ధరాత్రి ఎల్బీనగర్ చౌరస్తాలో సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు పెట్రోలింగ్ సమయంలో పోలీసులు గుర్తించారు. దీంతో వారిపై ఐపీసీ సెక్షన్ 290 కింద కేసు నమోదు చేసి ఈనెల 16న రిమాండ్‌కు తరలించారు. అయితే మర్నాడు ఉదయం లక్ష్మి మినహా మిగిలిన నిందితులు జరిమానా చెల్లించారని ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపారు. – ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి ఇద్దరి సస్పెన్షన్.. జరిగిన సంఘటనపై ప్రాథమిక విచారణ చేసిన రాచకొండ పోలీస్ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతలను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేస్తామని, ఇతరుల పాత్ర రుజువైతే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ తెలిపారు. గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: మాజీ మంత్రి రవీంద్రనాయక్ గిరిజన సంఘాల నేతలు, ఇతర ప్రజాసంఘాల నాయకులు గురువారం బాధితురాలు లక్ష్మితో కలిసి ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రవీంద్ర నాయక్ మాట్లాడుతూ జరిగిన ఘటనపై గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. దాడి చేసిన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గణేష్, ప్రధానకార్యదర్శి బాలు, ఆల్ ఇండియా బంజారాసేవా సంఘం రాష్ట్ర అధ్య క్షుడు రాజు, గిరిజన విద్యార్థి నేత వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
లాఠీలకు ‘పని’ చెప్పిన ఖమ్మం ఖాకీలు
ఖమ్మంక్రైం/సత్తుపల్లి: ఖాకీలు లాఠీలకు పని చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను కొనసాగిస్తూనే.. అల్లరి మూకలు, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపేందుకు శిక్షణ పొందుతున్నారు. ఇటీవల కాలంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి, హుజూర్నగర్ పరిధిలోని మఠంపల్లి వద్ద రాళ్లు రువ్విన సంఘటనలు చోటుచేసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో పోలీసులు వైఫల్యం చెందొద్దనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో కానిస్టేబుళ్లకు లాఠీల వినియోగంపై తర్ఫీదునిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్‌కే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. దీనికితోడు ఆరేళ్ల నుంచి చెప్పుకోదగ్గ ఆందోళనలు పెద్ద ఎత్తున జరగకపోవటం వల్ల పోలీసుల చేతికి పని లేకుండా పోయింది. సాధ్యమైనంత వరకు ఎక్కడికక్కడ కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారానే కేసులను పరిష్కరించాలని, సామరస్యపూర్వకంగా వెళ్లాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. అయితే ఆందోళనల సమయంలో ఒకటి, రెండు సంఘటనలు మినహా పోలీసులు సర్దుబాటు ధోరణిలోనే వ్యవహరిస్తూ వచ్చారు. ఆందోళనకారుల ఫొటోలను తీస్తూ పోలీస్స్టేషన్లలో బైండోవర్ కేసులతో నడిపించారు. అయితే ఇక నుంచి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే లాఠీలకు పని కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. మారిన పరిస్థితులు.. పోలీసులు శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో జిల్లాలో చెదురు మదురు ఘటనలు మినహా ఎక్కడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన సందర్భాలు లేవు. ఫ్రెండ్లీ పోలీసింగ్, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలు.. ఇలా కారణమేదైనా పోలీసులు లాఠీలను మరిచిపోయి ఏళ్లయింది. వాటిని ఠాణాల్లోనే మూలన పెట్టాల్సి వచ్చింది. అయితే అక్కడక్కడా అల్లరి మూకలు పోలీసుల మాట వినకపోవడం.. చెప్పినా పట్టించుకోకపోవడంతోపాటు పోలీసులపై దాడులకు దిగిన పరిస్థితులు వచ్చాయి. వీటన్నింటికీ పరిష్కార మార్గం చూపేది లాఠీలేనని ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. కాగా.. ఐదేళ్లుగా పోలీసు ఉద్యోగాలకు ఎంపికవుతున్న కానిస్టేబుళ్లకు లాఠీల వినియోగం తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో డీజీపీ మహేందర్‌రెడ్డి జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లు, కమిషనరేట్ల పరిధిలో విడతలవారీగా కానిస్టేబుళ్లకు లాఠీల వాడకంపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. సిబ్బంది కొరత.. కాగా.. పోలీస్స్టేషన్లలో సిబ్బంది కొరత వేధిస్తోంది. జనాభా దామాషా ప్రకారం పోలీసులు లేకపోవటం వల్ల కేసులను ఛేదించటంలో ఆలస్యమవుతున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఉన్న సిబ్బంది కూడా పనిభారంతో ఒత్తిడికి లోనవుతున్నారు. వీఐపీల భద్రత, పోలీస్ పెట్రోలింగ్, ప్రముఖుల పర్యటనలు, నిత్యం ట్రాఫిక్‌పైనే దృష్టి సారించాల్సి వస్తుండటంతో క్రైం కేసులపై విచారణ విషయంలో ఆలస్యం జరుగుతున్నట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి ‘సాక్షి’ వద్ద వాపోయారు. పోలీస్స్టేషన్లలో సరిపడా సిబ్బందిని ఇస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వారం రోజులపాటు శిక్షణ.. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలతో జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో వారం రోజులపాటు లాఠీల వాడకంపై శిక్షణ ఇస్తున్నారు. ఏ సందర్భంలో లాఠీలను ఉపయోగించాలి? ఎలా ఉపయోగించాలి? శాంతిభద్రతలు శ్రుతి మించకుండా చర్యలు ఎలా చేపట్టాలి? ఘర్షణలపై ఎలా స్పందించాలి? అనే వాటిపై ప్రతిరోజు లాఠీ పరేడ్‌తోపాటు క్లాసులు తీసుకుంటున్నారు. మొదట్లో ఏఆర్ సిబ్బందికి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో శిక్షణ ప్రారంభించారు. అనంతరం అన్ని పోలీస్స్టేషన్లలో సిబ్బంది, హోంగార్డులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో.. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో కానిస్టేబుళ్లకు లాఠీలపై శిక్షణ ఇస్తున్నాం. దీంతోపాటు ప్రజలతో మమేకమై ఎలా మసులుకోవాలనే దానిపై కూడా అవగాహన కల్పిస్తున్నాం. ఆందోళనలతో శాంతిభద్రతలకు ఆటంకం కలిగితే విధిలేని పరిస్థితుల్లోనే లాఠీలను వాడుతాం. సాధ్యమైనంత వరకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌తోనే సమస్యలను పరిష్కరిస్తాం. – ఎన్.వెంకటేష్, ఏసీపీ, కల్లూరు చదవండి: పద్మశ్రీ వనజీవి రామయ్యకు అస్వస్థత -
చావబాదారు.. లేదు లేదు కౌన్సెలింగ్ ఇచ్చాం
హైదరాబాద్: పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన మైనర్ విద్యార్థులను గొడవ చేస్తున్నారంటూ పోలీసులు విచక్షణారహితంగా లాఠీలతో చితకబాదారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని న్యూబోయిన్‌పల్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. న్యూ బోయిన్పల్లి చిన్నతోకట్ట సేవన్ టెంపుల్స్ సమీపంలో ఉండే పసుపుల సాయి పుట్టినరోజును పురస్కరించుకుని 18వ తేదీ రాత్రి అతడి ఇంటికి పలువురు విద్యార్థులు వెళ్లారు. అయితే వారు అల్లరి చేస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు విద్యార్థులను అక్కడి నుంచి పంపించివేశారు. తిరిగి మరుసటిరోజు మధ్యాహ్నం 2 గంటలకు 40 మంది విద్యార్థులు సాయి ఇంటికి చేరుకుని పుట్టినరోజు కేక్ కట్ చేయించి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సమయంలో పెట్రోలింగ్ వాహనంలో వచ్చిన కానిస్టేబుళ్లు.. అభిషేక్, పుష్పరాజ్, కళ్యాణ్, భానుప్రకాశ్, భరత్, మనీశ్, శుభం(విద్యార్థులు)లను, పి.సందీప్‌కుమార్, అభిషేక్ యాదవ్(స్నేహితులు)లను డీసీపీ తీసుకురమ్మన్నారని చెప్పి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం వారిని సీఐ ఆనంద్‌కిశోర్, ఎస్ఐలు శ్రీనివాస్, గురుస్వామిలు కౌన్సెలింగ్ నిర్వహిస్తూ.. ఒక్కసారిగా వారిపై లాఠీలతో చితకబాదారు. అనంతరం రాత్రి 9 గంటల సమయంలో వారి తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించారు. కొట్టలేదు.. కౌన్సిలింగ్ ఇచ్చాం: సీఐ ఆనంద్ పుట్టినరోజు పేరుతో కాలనీలో గొడవ చేస్తున్నారంటూ కంట్రోల్ రూంకు ఫోన్ వచ్చిందని, దీంతో ఘటనా స్థలానికి వెళ్లి రోడ్డుపై గుమిగూడిన విద్యార్థులను వెళ్లిపోవాలని సూచించినట్లు సీఐ ఆనంద్‌కిశోర్ తెలిపారు. అయితే కొందరు వెళ్లిపోగా.. పోలీసులను రెచ్చగొట్టేలా మాట్లాడటంతో 9 మందిని స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చామని చెప్పారు. అనంతరం వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు రప్పించి అప్పగించామని, విద్యార్థులను తాము కొట్టలేదని తెలిపారు. ఇటీవల ఎన్నికల సందర్భంగా సాయిని బైండోవర్ చేశామని, అతడిపై పలు కేసులున్నాయని చెప్పారు. ఈ విషయం బయటికి పొక్కడంతో పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమేరాల ఫుటేజీలను పరిశీలిస్తునట్లు సమాచారం. -
రాందేవ్ ఫుడ్ పార్కులో తుపాకుల కలకలం
అదొక ఫుడ్ పార్కు. పతంజలి హెర్బల్స్ పేరుతో యోగా గురు రాందేవ్ బాబా ప్రజలకు అమ్మే మందులన్నీ అక్కడే తయారవుతాయి. అలాంటి చోట ఏడు తుపాకులు, భారీ సంఖ్యలో లాఠీలు కనిపించడం కలకలం రేపింది. రాందేవ్ ఫుడ్ పార్కువద్ద బుధవారం గలాటా, ఒకరి హత్య అనంతరం పార్కును తమ స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించారు. ఆ క్రమంలోనే ఏడు రైఫిల్స్, భారీగా లాఠీలు కనిపించాయని, వాటిని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించామని గర్వాల్ ఐజీ సంజయ్ గుంజ్యాల్ చెప్పారు. ఫుడ్ పార్కులో ప్రైవేటు గార్డులుగా పనిచేస్తోన్న ఏడుగురిని కూడా పోలీసులు అరెస్టుచేశారు. హరిద్వార్‌లోని పతంజలి హెర్బల్ ఫుడ్స్ అండ్ హెర్బల్ పార్కు నుంచి వివిధప్రాంతాలకు మందులు సరఫరాచేసే విషయంలో స్థానిక ట్రాలీ యూనియన్ నాయకులు, ఫుడ్ పార్కు సిబ్బందికి మధ్య బుధవారం జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంటు పోలీసులు అరెస్టుచేసిన రాందేవ్ సోదరుడు రాంభరత్కు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అయితే ఆత్మరక్షణలో భాగంగానే పార్కు సిబ్బంది ట్రాలీ యూనియన్ నాయకులపై ప్రతిదాడి చేయాల్సివచ్చిందని, రాజకీయ కక్షసాధింపులో భాగంగానే రాంభరత్ను ఈ కేసులో ఇరికించారని రాందేవ్ ప్రధాన అనుచరుల్లో ఒకరైన ఆచార్య బాలకృష్ణ మీడియాతో అన్నారు.