ఖమ్మంలో లాఠీల ప్రయోగంపై శిక్షణ పొందుతున్న పోలీస్ సిబ్బంది
ఖమ్మంక్రైం/సత్తుపల్లి: ఖాకీలు లాఠీలకు పని చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను కొనసాగిస్తూనే.. అల్లరి మూకలు, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపేందుకు శిక్షణ పొందుతున్నారు. ఇటీవల కాలంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి, హుజూర్‌నగర్ పరిధిలోని మఠంపల్లి వద్ద రాళ్లు రువ్విన సంఘటనలు చోటుచేసుకున్న విషయం విదితమే.
ఈ నేపథ్యంలో పోలీసులు వైఫల్యం చెందొద్దనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో కానిస్టేబుళ్లకు లాఠీల వినియోగంపై తర్ఫీదునిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్‌కే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. దీనికితోడు ఆరేళ్ల నుంచి చెప్పుకోదగ్గ ఆందోళనలు పెద్ద ఎత్తున జరగకపోవటం వల్ల పోలీసుల చేతికి పని లేకుండా పోయింది.
సాధ్యమైనంత వరకు ఎక్కడికక్కడ కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారానే కేసులను పరిష్కరించాలని, సామరస్యపూర్వకంగా వెళ్లాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. అయితే ఆందోళనల సమయంలో ఒకటి, రెండు సంఘటనలు మినహా పోలీసులు సర్దుబాటు ధోరణిలోనే వ్యవహరిస్తూ వచ్చారు. ఆందోళనకారుల ఫొటోలను తీస్తూ పోలీస్‌స్టేషన్లలో బైండోవర్ కేసులతో నడిపించారు. అయితే ఇక నుంచి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే లాఠీలకు పని కల్పించేందుకు సిద్ధమవుతున్నారు.
మారిన పరిస్థితులు..
పోలీసులు శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో జిల్లాలో చెదురు మదురు ఘటనలు మినహా ఎక్కడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన సందర్భాలు లేవు. ఫ్రెండ్లీ పోలీసింగ్, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలు.. ఇలా కారణమేదైనా పోలీసులు లాఠీలను మరిచిపోయి ఏళ్లయింది. వాటిని ఠాణాల్లోనే మూలన పెట్టాల్సి వచ్చింది.
అయితే అక్కడక్కడా అల్లరి మూకలు పోలీసుల మాట వినకపోవడం.. చెప్పినా పట్టించుకోకపోవడంతోపాటు పోలీసులపై దాడులకు దిగిన పరిస్థితులు వచ్చాయి. వీటన్నింటికీ పరిష్కార మార్గం చూపేది లాఠీలేనని ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. కాగా.. ఐదేళ్లుగా పోలీసు ఉద్యోగాలకు ఎంపికవుతున్న కానిస్టేబుళ్లకు లాఠీల వినియోగం తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో డీజీపీ మహేందర్‌రెడ్డి జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లు, కమిషనరేట్ల పరిధిలో విడతలవారీగా కానిస్టేబుళ్లకు లాఠీల వాడకంపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.
సిబ్బంది కొరత..
కాగా.. పోలీస్‌స్టేషన్లలో సిబ్బంది కొరత వేధిస్తోంది. జనాభా దామాషా ప్రకారం పోలీసులు లేకపోవటం వల్ల కేసులను ఛేదించటంలో ఆలస్యమవుతున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఉన్న సిబ్బంది కూడా పనిభారంతో ఒత్తిడికి లోనవుతున్నారు. వీఐపీల భద్రత, పోలీస్ పెట్రోలింగ్, ప్రముఖుల పర్యటనలు, నిత్యం ట్రాఫిక్‌పైనే దృష్టి సారించాల్సి వస్తుండటంతో క్రైం కేసులపై విచారణ విషయంలో ఆలస్యం జరుగుతున్నట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి ‘సాక్షి’ వద్ద వాపోయారు. పోలీస్‌స్టేషన్లలో సరిపడా సిబ్బందిని ఇస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
వారం రోజులపాటు శిక్షణ..
డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలతో జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో వారం రోజులపాటు లాఠీల వాడకంపై శిక్షణ ఇస్తున్నారు. ఏ సందర్భంలో లాఠీలను ఉపయోగించాలి? ఎలా ఉపయోగించాలి? శాంతిభద్రతలు శ్రుతి మించకుండా చర్యలు ఎలా చేపట్టాలి? ఘర్షణలపై ఎలా స్పందించాలి? అనే వాటిపై ప్రతిరోజు లాఠీ పరేడ్‌తోపాటు క్లాసులు తీసుకుంటున్నారు. మొదట్లో ఏఆర్ సిబ్బందికి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో శిక్షణ ప్రారంభించారు. అనంతరం అన్ని పోలీస్‌స్టేషన్లలో సిబ్బంది, హోంగార్డులకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాలతో..
పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో కానిస్టేబుళ్లకు లాఠీలపై శిక్షణ ఇస్తున్నాం. దీంతోపాటు ప్రజలతో మమేకమై ఎలా మసులుకోవాలనే దానిపై కూడా అవగాహన కల్పిస్తున్నాం. ఆందోళనలతో శాంతిభద్రతలకు ఆటంకం కలిగితే విధిలేని పరిస్థితుల్లోనే లాఠీలను వాడుతాం. సాధ్యమైనంత వరకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌తోనే సమస్యలను పరిష్కరిస్తాం.
– ఎన్.వెంకటేష్, ఏసీపీ, కల్లూరు
Comments
Please login to add a commentAdd a comment