పోలీసుల అదుపులో రాందేవ్ సోదరుడు రాంభరత్
అదొక ఫుడ్ పార్కు. పతంజలి హెర్బల్స్ పేరుతో యోగా గురు రాందేవ్ బాబా ప్రజలకు అమ్మే మందులన్నీ అక్కడే తయారవుతాయి. అలాంటి చోట ఏడు తుపాకులు, భారీ సంఖ్యలో లాఠీలు కనిపించడం కలకలం రేపింది. రాందేవ్ ఫుడ్ పార్కువద్ద బుధవారం గలాటా, ఒకరి హత్య అనంతరం పార్కును తమ స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించారు. ఆ క్రమంలోనే ఏడు రైఫిల్స్, భారీగా లాఠీలు కనిపించాయని, వాటిని సీజ్ చేసి స్టేషన్కు తరలించామని గర్వాల్ ఐజీ సంజయ్ గుంజ్యాల్ చెప్పారు. ఫుడ్ పార్కులో ప్రైవేటు గార్డులుగా పనిచేస్తోన్న ఏడుగురిని కూడా పోలీసులు అరెస్టుచేశారు.
హరిద్వార్లోని పతంజలి హెర్బల్ ఫుడ్స్ అండ్ హెర్బల్ పార్కు నుంచి వివిధప్రాంతాలకు మందులు సరఫరాచేసే విషయంలో స్థానిక ట్రాలీ యూనియన్ నాయకులు, ఫుడ్ పార్కు సిబ్బందికి మధ్య బుధవారం జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంటు పోలీసులు అరెస్టుచేసిన రాందేవ్ సోదరుడు రాంభరత్కు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అయితే ఆత్మరక్షణలో భాగంగానే పార్కు సిబ్బంది ట్రాలీ యూనియన్ నాయకులపై ప్రతిదాడి చేయాల్సివచ్చిందని, రాజకీయ కక్షసాధింపులో భాగంగానే రాంభరత్ను ఈ కేసులో ఇరికించారని రాందేవ్ ప్రధాన అనుచరుల్లో ఒకరైన ఆచార్య బాలకృష్ణ మీడియాతో అన్నారు.