Laundry services
-
కొత్త బిజినెస్‌లోకి దిగిన ఎల్జీ.. విద్యార్థులే టార్గెట్!
టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మిషన్లు వంటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు తయారు చేసే ఎల్జీ కంపెనీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. వివిధ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ తయారు చేసే ఈ దక్షిణ కొరియా కంపెనీ ఇప్పుడు సరికొత్త వ్యాపారంలోకి దిగింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ( LG Electronics India ) విద్యారంగాన్ని లక్ష్యంగా చేసుకుని దేశంలో స్వీయ-లాండ్రీ సేవా వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇక్కడ వాణిజ్య వాషింగ్ మెషీన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ఏడాదికల్లా 200 సెల్ఫ్ లాండ్రీ సర్వీస్ సెంటర్లను ప్రారంభించే ప్రణాళికలతో కంపెనీ ఈ వ్యాపారంలో 4 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.33 కోట్లు ) పెట్టుబడి పెడుతోంది. ఈ మేరకు గ్రేటర్ నోయిడాలోని గల్గోటియాస్ విశ్వవిద్యాలయంతో ఎల్జీ జత కట్టంది. అక్కడున్న 1500 మంది విద్యార్థులకు మొదటి సారిగా లాండ్రీ సేవలు ప్రారంభించింది. మెషిన్ రిజర్వేషన్, ఆపరేషన్, ఆటోమేటెడ్ చెల్లింపులను సులభతరం చేసేందుకు ఓ యాప్‌ను కూడా రూపొందించింది. ఈ యాప్ ద్వారా విద్యార్థులు ఎల్జీ కమర్షియల్ వాషింగ్ మెషీన్లను ఉపయోగించుకునే సౌలభ్యం ఉంటుంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హాంగ్ జు జియోన్ మాట్లాడుతూ.. విద్యా సంస్థల్లో సెల్ఫ్ లాండ్రీ సర్వీస్‌తో విద్యార్థులకు సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో కొత్త వ్యాపార రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపారు. "ఈ వ్యాపారంలో 4 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతున్నాం. 2024 చివరి నాటికి 200 సెల్ఫ్-లాండ్రీ సర్వీస్ సెంటర్లను తెరవడానికి ప్లాన్ చేస్తున్నాం" అని జియోన్ పేర్కొన్నారు. -
బూట్లు ఉతికే లాండ్రి.. కొత్త తరహా ఉపాధి
జీవితంలో ఎన్నో అనుకుంటాం. కానీ అనుకున్నవన్నీ జరగవు. కొంతమంది అనుకున్నవి జరగకపోయినా... ఇప్పటికి ఇదే ప్రాప్తం అనుకుని ఉన్నదానితో సంతృప్తి చెందుతుంటారు. మరికొందరు మాత్రం తాము చేసే పనిలో సంతృప్తి దొరకక నిత్యం మధనపడుతుంటారు. ఇలా మధనపడుతూనే తనకు నచ్చిన పనిని ఎంచుకుని షూ లాండ్రీ యజమానిగా మారి ఎంతో సంతృప్తిగా జీవిస్తోంది షాజియా కైజర్. బీహార్‌లోని భాగల్పూర్కు చెందిన షాజియా ఓ ప్రభుత్వ ఉద్యోగి కూతురు. ఇంటర్మీడియట్ అయిన వెంటనే పెళ్లి చేశారు. షాజియాకేమో పై చదువులు చదవాలని ఆశ. తన కెరీర్‌ను ఉన్నతంగా మలుచుకోవాలన్న కోరిక. ఈ క్రమంలోనే భర్త అనుమతితో ఫిజియో థెరపీలో డిగ్రీ పూర్తి చేసింది. అయితే ఫిజియోథెరపిస్టుగా పనిచేయకుండా రెండేళ్లపాటు టీచర్ ఉద్యోగం చేసింది. తనకు చాలా ఆనందంగా అనిపించింది. కానీ మనసులో ఇంకా ఏదో చేయాలన్న తపన. అదికూడా పెద్దగా చేయాలి. దీంతో టీచర్ ఉద్యోగం మానేసే యూనిసెఫ్‌లో చేరింది. ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ స్వేచ్ఛగా పనిచేసే వెసులుబాటు కనిపించకపోవడంతో ఏదైనా వ్యాపారం చేద్దామనుకుంది. బూట్లు ఉతికే లాండ్రి ఓ రోజు మ్యాగజీన్ చదువుతోన్న షాజియాకు బూట్లు శుభ్రం చేసే లాండ్రి సర్వీస్ గురించి తెలిసింది. బూట్ల లాండ్రీ పెడితే బావుంటుందన్న ఆలోచనతో షూస్‌ని ఎలా శుభ్రం చేస్తారో తెలుసుకోవడం ప్రారంభించింది. లెదర్‌తో తయారు చేసే షూలను వివిధ రకాల రసాయనాలు ఉపయోగించి క్లీన్ చేస్తారని తెలిసింది. షూ క్లీనింగ్ గురించి మరింతగా తెలుసుకునేందుకు చెన్నైలోని ‘సెంట్రల్ ఫుట్‌వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్’లో చేరి పాదరక్షలను తయారు చేసే టెక్నాలజీ, డిజైనింగ్ గురించి పూర్తిగా స్టడీ చేసింది. ఆ తరువాత నోయిడాలోని ‘ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో చేరి లెదర్‌తో తయారు చేసే చెప్పులు, బూట్లు, వివిధ రకాల బ్యాగ్‌ల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది. పట్నాలో 2014లో బూట్లు శుభ్రం చేసే ‘రివైవల్ షూ లాండ్రి’ పేరుతో ఇద్దరు పనివాళ్లతో కలిసి ఒక చిన్నపాటి షాపును ప్రారంభించింది. అయితే షూ లాండ్రీ అంటే ఏమిటో తెలియక వీరి షాపుకు చాలామంది చినిగిపోయిన బూట్లు తెచ్చి ఇచ్చేవారు. వారిని ఏమాత్రం విసుక్కోకుండా వాటిని చక్కగా కుట్టి శుభ్రంగా కడిగి కొత్తవాటిలా మార్చి తిరిగి ఇవ్వడంతో లాండ్రీకి వచ్చే కస్టమర్ల సంఖ్య పెరిగింది. దాంతో చూస్తుండగానే ఈ బిజినెస్ పెరిగిపోయింది. వీరి లాండ్రీకి కస్టమర్ల నుంచి ఆదరణ లభించడంతో బీహార్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ 2016లో షాజియా షూ లాండ్రిని ‘బెస్ట్స్టార్టప్’ అవార్డుతో సత్కరించింది. ఇప్పుడు లక్షల టర్నోవర్‌తో లాండ్రీ నడుస్తోంది. సీఎం నితీష్‌కుమార్, ఇంకా సీనియర్ ఉన్నతాధికారులు సైతం షాజియా లాండ్రిలో బూట్లు సర్వీసింగ్ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం పాట్న వ్యాప్తంగా ఐదు అవుట్లెట్లతో ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తోంది షాజియా లాండ్రీ. అంతేగాక షాజియా దగ్గర షూ క్లీనింగ్‌లో శిక్షణ తీసుకున్న కొంతమంది ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఢిల్లీ, ఒడిషాలలో షూ లాండ్రీలను నడుపుతున్నారు. రంగు వెలిసినా... షాజియా లాండ్రీలో రంగువెలిసిన బూట్లకు కొత్త రంగు వేయడం, ట్రాలీబ్యాగ్స్, బ్యాక్‌ప్యాక్స్, లెదర్, ల్యాప్‌టాప్ బ్యాగ్‌లను రిపేర్ చేయడంతోపాటు షూస్‌ను ఆవిరి మెషిన్ మీద శుభ్రం చేసి ఇస్తుంది. -
'గోల్డ్' తరం మోడలింగ్
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాటను అక్షరాలా నిజం చేసుకుంటున్నారు ఈ తాతమ్మ, తాతయ్యలు. పాత దుస్తులను ధరించి మోడలింగ్ చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పేరు సంపాదిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చిస్తున్న ఈ జంట యువతరం కాదు. మోడల్స్ కానే కాదు. సినిమా తారలు అసలే కాదు. కానీ, పాత దుస్తులతో ఆన్లైన్లో సంచలనం సృష్టిస్తున్నారు. ఈ దంపతుల దేశం తైవాన్. వీరికి తైచుంగ్‌లోని సెంట్రల్ సిటీ సమీపంలో ఓ చిన్న లాండ్రీ ఉంది. 83 ఏళ్ల చెంగ్ వాంజీ, 84 ఏళ్ల సువో షోర్ దంపతులకు ఇన్‌స్ట్రాగామ్‌లో ఇప్పుడు 6 లక్షలకు మందికి పైగా ఫాలోవర్స్ అయ్యారు.. మోడలింగ్ చేస్తున్న ఈ జంట ఫోటోలు ఈ తరానికి తెగ నచ్చుతున్నాయి. అసలు విషయం ఏంటంటే.. కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న వీరి లాండ్రీకి రోజూ కస్టమర్లు వచ్చేవారు. కరోనా మహమ్మారి కారణంగా లాండ్రీ మూతపడింది. లాండ్రీ తెరిచే సమయానికి ఇక్కడ బట్టలు ఇచ్చిన కస్టమర్లు వాటిని తిరిగి తీసుకోవడం మర్చిపోయారు. కొంతమంది పట్టణమే వదిలేసి వెళ్లిపోయారు. అలా దాదాపు 400 డ్రెస్సులు వీరి లాండ్రీలోనే ఉండిపోయాయి. ఈ వృద్ధ దంపతులకు 31 ఏళ్ల మనవడు రీఫ్ ఉన్నాడు. లాక్డౌన్ కారణంగా లాండ్రీ మూసేయడంతో తాత, బామ్మలు తరచూ బాధపడటం చూశాడు. రీఫ్ తమ బామ్మ, తాతయ్యల కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. ఆనందంగా మోడలింగ్ ఇంట్లో లాండ్రీకి వచ్చిన పాత బట్టలను ధరించి మోడలింగ్ చేయమని అవ్వాతాతకు సలహా ఇచ్చాడు. ముందు వారు ఒప్పుకోలేదు. కానీ, మనవడి కోసం ఆ డ్రెస్సులను వేసుకున్నారు. ‘వాటిని ధరించినప్పుడు మా వయస్సు ముప్పై సంవత్సరాలకు తగ్గినట్టుగా భావించాన’ని చెంగ్ వాంజీ సంబరంగా చెబుతున్నాడు. రీఫ్ అమ్మమ్మకు బట్టలు అంటే ఇష్టం. దీంతో ఈ అవ్వాతాతలు ఇద్దరూ రకరకాల దుస్తులు ధరించి మోడలింగ్ చేస్తూ తెగ ఆనందపడిపోతున్నారు. ‘నా వార్డోబ్ర్లో 35 ఏళ్ల క్రితం కొన్న నా డ్రెస్సులు ఉన్నాయి. ఇప్పుడు వాటిని ధరించడం, ఆ డ్రెస్సుల్లో నన్ను నేను చూసుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను మోడలింగ్‌ను ఆస్వాదిస్తున్నాను’ అని చెబుతుంది 84 ఏళ్ల సువో షోర్. మనవడు రీఫ్ ఈ జంట ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తున్నాడు. కరోనా కాలంలో ఈ వృద్ధ దంపతులు ప్రజలలో ఆశా కిరణాన్ని సృష్టిస్తున్నారని సోషల్ మీడియా అభిమానులు వీరికి అభినందనలు తెలుపుతున్నారు. ఆరు దశాబ్దాల క్రితం ఈ జంట ఆరు దశాబ్దాల క్రితం తైవాన్‌లో వివాహం చేసుకుంది. ‘వయసు మీద పడింది, లాండ్రీని మూసేసి విశ్రాంతి తీసుకోవాలని చాలాసార్లు ఆలోచించాను, కానీ మిషనరీ మీద ఈ పని సులభంగా చేయవచ్చులే అని ఆలోచనను మానుకున్నాం. పని మొదలెడితే తక్కువ కష్టమే అనిపిస్తుంది. అందువల్ల లాండ్రీని మూసివేయకూడదనుకున్నాం. వృద్ధాప్యంలో అలసటతో కూర్చోవడానికి బదులు చేతనైన పనులు చేసుకుంటేనే మంచిది. పని చేస్తూ ఉంటే వృద్ధాప్యంలో పుట్టుకొచ్చే అనేక శారీరక మానసిక సమస్యలను నివారించవచ్చ’ని చెంగ్ చెబుతున్నాడు. సెకండ్ హ్యాండ్ బట్టలు ధరించడం ద్వారా కూడా ఫ్యాషన్‌ని చూపించవచ్చని నిరూపిస్తున్నారు ఈ వృద్ధ దంపతులు. ప్రస్తుతం వీళ్లు ‘ఎన్విరాన్మెంటల్ ఫ్యాషన్‘ ను ప్రోత్సహించడంలో బిజీగా ఉన్నారు. -
కరోనా పేషెంట్ల బట్టలు ఉతకం
సాక్షి, ముంబై: దేశంలో అత్యధిక కోవిడ్-19 కేసులు నమోదైన మహారాష్ట్రలో కరోనా పేషెంట్ల బట్టలు ఉతకడానికి ధోబీలు ససేమీరా అంటున్నారు. తమకూ ఆ వైరస్ సోకుతుందేమోననన్న భయంతో వెనకడుగు వేస్తున్నారు. సాధారణంగా ఆసుపత్రిలోని వివిధ వార్డుల్లో వినియోగించే వస్త్రాలను స్థానికంగా పనిచేసే ధోబీలతో ఉతికిస్తారు. అదే విధంగా మహారాష్ట్రలోని యవత్మల్ స్థానిక ఆసుపత్రిలో సోమవారం అన్ని వార్డులతో పాటు ఐసోలేషన్ వార్డులో వినియోగించిన బెడ్ షీట్లు, కర్టెన్లు, పేషెంట్ల వస్త్రాలను ఉతకమని ధోబీలకు అందించారు. కానీ వారు తాము ఆ పని చేయలేమంటూ చేతులెత్తేశారు. ఐసోలేషన్ వార్డులో ఉపయోగించిన బట్టలు ముట్టుకుంటే తమకు ఆ వైరస్ సోకుతుందేమోనని భయంగా ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అశోక్ చౌదరి అనే వ్యక్తి పేర్కొన్నాడు. కాగా కరోనా అనుమానితులను, వ్యాధిగ్రస్తులను ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే.(కరోనా: యూరప్, ఆసియాలో అత్యధిక మరణాలు) -
లాండ్రీకార్ట్ యాప్‌ను ఆవిష్కరించిన సమంత..
బంజారాహిల్స్: భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం తప్పనిసరైన ప్రస్తుత తరుణంలో లాండ్రీ కార్ట్ ఓ వరంగా ఉపయోగపడుతుందని సినీ నటి సమంత అన్నారు. ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ సతీమణి సబిత సుకుమార్, అలేఖ్య, గిరిజ, శరత్‌లతో కలిసి నెలకొల్పిన లాండ్రీకార్ట్ సంస్థ మొబైల్ యాప్ సర్వీస్‌ను ఆదివారం ఆమె బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా లాండ్రీకార్ట్ వ్యవస్థాపకురాలు సబితా సుకుమార్ మాట్లాడుతూ .. యాడాదిన్నర పాటు గ్రౌండ్‌వర్క్ చేసిన తర్వాత గత ఏడాది జూన్‌లో దీన్ని ప్రారంభించామన్నారు. సినిమా నేపధ్యంతో ముడిపడిన సంస్థ కాదన్నారు. మధ్యతరగతి వర్గాలవారిని దృష్టిలో పెట్టుకుని తక్కువ వ్యయంతో సర్వీసులు అందించాలని ప్రారంభించామన్నారు. ఈ యాప్ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించడం, ఒక స్పూర్తిగా నిలుస్తుందని సమంత చెప్పారు. -
హైదరాబాద్ లో వాస్సాప్ లాండ్రీ
ఈక్విటీ రూపంలో ఈజీ వాష్ కొనుగోలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లాండ్రీ సేవలందిస్తున్న వాస్సాప్ సంస్థ... హైదరాబాద్‌లోనూ తన సేవలు ఆరంభించింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం సేవలందిస్తున్న ‘ఈజీ వాష్’ సంస్థను ఈక్విటీ రూపంలో కొనుగోలు చేస్తున్నట్లు వాస్సాప్ వ్యవస్థాపక సీఈఓ బాలచందర్.ఆర్ చెప్పారు. మాదాపూర్, వైట్‌ఫీల్డ్ ప్రాంతాల నుంచి సేవలను ప్రారంభిస్తున్నామని... మూడు నెలల్లో 25 ప్రాంతాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మూడేళ్లుగా లాండ్రీ సేవలందిస్తున్న ఈజీవాష్కు దాదాపు 8 వేల మంది కస్టమర్లున్నారని తెలియజేశారు. ‘‘రోజుకు ఈ సంస్థకు 100 ఆర్డర్లు వస్తున్నాయి. ఇప్పుడిక ఈ ఈక్విటీతో వాస్సాప్ జంట నగరాల్లో తన సేవలను విస్తరించినట్లయింది’’ అని చెప్పారు. ప్రస్తుతం వాస్సాప్ లాండ్రీ, డ్రైక్లీనింగ్, షూ అండ్ బ్యాగ్స్ రీఫర్బిష్మెంట్ సేవలను బెంగళూరు, ఢిల్లీ, గుర్గావ్, ముంబై, చెన్నై, పుణే నగరాల్లో 50 పికప్ పాయింట్లతో అందిస్తోంది. 5 నెలల్లో మరో 50 పాయింట్లను ఫ్రాంచైజీ మోడల్లో ప్రారంభిస్తామని బాలచందర్ చెప్పారు. ‘‘వాస్సాప్ సొంతం చేసుకున్న రెండో కంపెనీ ఈజీవాష్. 3 నెలల క్రితమే ముంబైలోని చమక్ లాండ్రీ స్టార్టప్‌ను కొనుగోలు చేశాం. దేశంలోని మరో 3 కంపెనీల కొనుగోళ్లకు చర్చలు జరుపుతున్నాం’’ అని వివరించారు. కార్యక్రమంలో వాస్సాప్ కో-ఫౌండర్ దుర్గాదాస్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీపీ రవికుమార్ పింజల తదితరులు పాల్గొన్నారు.