చవకైన 5జీ స్మార్ట్ఫోన్లు, వరుసలో మరిన్ని బ్రాండ్లు!
చవక ఫోన్లతో దేశీ బ్రాండ్లు గతంలో భారత 3జీ, 4జీ మార్కెట్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 5జీ విభాగంలోనూ అదే ట్రెండ్‌కు లావా మొబైల్స్ తెరలేపింది. రూ.10,000లోపు ధరలో మోడల్‌ను ప్రవేశపెట్టి భారత్‌లో చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్ ట్యాగ్‌ను సొంతం చేసుకుంది. మరిన్ని భారతీయ బ్రాండ్లు ఈ విభాగంలో రంగ ప్రవేశం చేయనున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 5జీ హ్యాండ్సెట్లు రూ.13 వేల నుంచి లభిస్తున్నాయి.
రానున్న రోజుల్లో రూ.10 వేల లోపు ధరలో మోడళ్లు వెల్లువెత్తనున్నాయి. దేశీయ కంపెనీల రాకతో చవక ధరల విభాగం జోరు కొనసాగనుంది. 5జీ నెట్వర్క్ విస్తరణ, కస్టమర్ల ఆదరణనుబట్టి ఈ విభాగంలో భారతీయ బ్రాండ్ల రాక ఆధారపడుతుందని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ తెలిపారు. గతంలో మాదిరిగా ఇబ్బడి ముబ్బడిగా బ్రాండ్స్ ఉండకపోవచ్చని అన్నారు.
ఒకదాని వెంట ఒకటి..
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో జూలై–సెప్టెంబర్‌లో 4.5 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ రంగంలో 15లోపు బ్రాండ్లదే హవా. షావొమీ తొలి స్థానంలో నిలవగా శామ్సంగ్ రెండవ స్థానంలో ఉంది. వివో, రియల్మీ, ఒప్పో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. యాపిల్, వన్‌ప్లస్, మోటో, మోటరోలా, నోకియా, ఐక్యూ, పోకో వంటివి పోటీపడుతున్నాయి. ఇక 5జీ విభాగంలో 20 శాతం వాటాతో శామ్సంగ్ అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశీ బ్రాండ్స్ అయిన మైక్రోమ్యాక్స్, కార్బన్‌తోపాటు టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో సైతం 5జీ స్మార్ట్‌ఫోన్స్ రంగంలో ఎంట్రీకి సమాయత్తం అవుతున్నాయి. ప్రస్తుతం అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్లలో మూడింట ఒక వంతు 5జీ మోడల్స్ ఉంటున్నాయి. అన్ని బ్రాండ్స్ కలిపి 300 దాకా 5జీ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. చవక మోడళ్లు మార్కెట్‌ను ముంచెత్తితే 5జీ విభాగం అంచనాలను మించి విక్రయాలను నమోదు చేయడం ఖాయంగా కనపడుతోంది.
బ్లేజ్ 5జీ ఫీచర్స్ ఇవే..
లావా మొబైల్స్ బ్లేజ్ 5జీ పేరుతో స్పెషల్ లాంచ్ ఆఫర్లో రూ.9,999 ధరలో ఫోన్‌ను ఆవిష్కరించింది. 6.51 అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే, ఆన్‌డ్రాయిడ్ 12 ఓఎస్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఆక్టాకోర్ 2.2 గిగాహట్జ్ ప్రాసెసర్, 50 ఎంపీ ఏఐ ట్రిపుల్ కెమెరా, 128 జీబీ స్టోరేజ్‌తో తయారైన ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుపరిచింది. 4 జీబీ ర్యామ్, 3 జీబీ వర్చువల్ ర్యామ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్, వాటర్ డ్రాప్ డిస్ప్లే, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి హంగులు ఉన్నాయి. గ్లాస్ బ్లాక్ డిజైన్‌లో రెండు రంగుల్లో లభిస్తుంది.
చదవండి: Disney Layoffs: ఐటీలో మొదలై అక్కడి వరకు.. ఉద్యోగులపై వేటుకు రెడీగా ఉన్న ప్రముఖ ఓటీటీ సంస్థ!