Law College
-
ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల
యూనివర్సిటీ క్యాంపస్: రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో 3, 5 ఏళ్ల ఎల్ఎల్ బీ, 2 ఏళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశానికి గ త నెల 22న నిర్వహించిన ఏపీ లాసెట్–2021 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి తిరుపతిలో గురువారం విడుదల చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏపీ లాసెట్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మూడు కోర్సుల్లోనూ మహిళలే మొదటి ర్యాంకులు సాధిం చారని తెలిపారు. వర్సిటీ వీసీ డి.జమున, లాసెట్ కన్వీనర్ చంద్రకళ, రెక్టార్ డి.శారద, రిజిస్ట్రార్ మమత పాల్గొన్నారు. మూడేళ్ల ఎల్ఎల్బీలో హరిప్రియకు మొదటి ర్యాంకు మూడేళ్ల ఎల్ఎల్బీలో మోపూరు హరిప్రియ (విజయవాడ రూరల్) మొదటి ర్యాంకు పొందారు. ఏపీ ట్రాన్స్‌కోలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మోపూరు హరిప్రియ 53 ఏళ్ల వయసులో ఈ ర్యాంక్ సాధించడం విశేషం ఎల్.రాజా (గుంటూరు) రెండో ర్యాంకు, కె.హరికృష్ణ (అనంతపురం) మూడో ర్యాంకు సాధించారు. ఐదేళ్ల ఎల్ఎల్బీకి సంబంధించి ఎం.మౌనిక బాయి (బనగానపల్లె, కర్నూలు జిల్లా) మొదటి ర్యాంకు పొందారు. వి.నాగసాయి ప్రశాంతి (రణస్థలం, శ్రీకాకుళం జిల్లా) రెండో ర్యాంకు, సునీల్ (పూసపాటిరేగ, విజయనగరం జిల్లా) మూడో ర్యాంకు సాధించారు. ఇక రెండేళ్ల ఎల్ఎల్ఎం ప్రవేశపరీక్షలో వై.గీతిక (విశాఖపట్నం) మొదటి ర్యాంకు పొందారు. కె.కృష్ణమ నాయుడు (ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా) రెండో ర్యాంకు, టి.రమేష్ బాబు (విజయవాడ) మూడో ర్యాంకు సాధించారు. -
65 శాతం సీట్లు గిరిజనులకే.. మంత్రి హర్షం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో న్యాయ కళాశాల ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు లభించాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు గిరిజన గురుకులంలో కో ఎడ్యుకేషన్ లా కాలేజీ (రెసిడెన్షియల్) ఏర్పాటుకు గతేడాది గిరిజన గురుకుల సొసైటీ ప్రతిపాదనలు పంపింది. కోవిడ్–19 నేపథ్యంలో అనుమతులకు ఆలస్యం అవుతుందని అధికారులు భావించారు. కానీ లాసెట్ పరీక్ష, ఫలితాల ప్రకటన, కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడం అడ్మిషన్ల ప్రక్రియకు కలసివచ్చింది. 2020–21 విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు అవకాశం దక్కింది. ప్రస్తుతం లాసెట్–20 తొలి విడత కౌన్సెలింగ్ పూర్తి కాగా రెండో విడత కౌన్సెలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా గిరిజన న్యాయ కళాశాలకు వచ్చిన అనుమతులను ఉన్నత విద్యా మండలి, సెట్ కన్వీనర్లకు సమరి్పంచడంతో ఈ కాలేజీలో సీట్ల భర్తీకి మార్గం సుగమమైంది. 65 శాతం సీట్లు గిరిజనులకే.. గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో కొత్తగా ప్రారంభం కానున్న న్యాయ కళాశాలలో 65 శాతం సీట్లు గిరిజనులకే కేటాయిస్తారు, గిరిజన విద్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో మొత్తం 60 సీట్లు ఉంటాయి. ఇందులో గిరిజనులకు 39, ఎస్సీలకు 6, బీసీలకు 7, అగ్రవర్ణాలకు 2, స్పోర్ట్స్ కోటా 2, ఎన్సీసీ 2, ఎక్స్ సరీ్వస్ మెన్ 1, వికలాంగులకు 1 కేటాయిస్తారు. శుభ పరిణామం: మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో న్యాయ కళాశాల ప్రారంభించడం శుభ పరిణామం. కేజీ టూ పీజీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గురుకులాలను నిర్వహిస్తోంది. ఇటీవలే నర్సంపేటలో దేశంలోనే తొలిసారిగా గిరిజన సైనిక్ స్కూల్ ప్రారంభించాం. బీఈడీ, మరో రెండు పీజీ కోర్సులకు అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–20 వల్ల అనుమతులు రావడంలో ఆలస్యం అవుతోంది. -
ఎందుకి'లా'
కడప అగ్రికల్చర్/వైవీయూ : తీగ లాగితే డొంక కదలడమంటే ఇదేనేమో..తమిళనాడులో ఓ ఘటన ఆధారంగా సెంట్రల్ విజిలెన్స్ అధికారులు దాడులు చేయడంతో ఇక్కడి న్యాయకళాశాలల్లోని డొల్లతనం బట్టబయలైంది. వివరాలిలా..కడపలోని శ్రీబసవతారకం న్యాయకళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా బీఈడీ, డీఎడ్ కళాశాలలు నిర్వహిస్తున్నారు. కళాశాల కరస్పాండెంట్ టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, వైవీయూ మాజీ పాలకమండలి సభ్యుడు ఎస్. గోవర్ధన్రెడ్డిది కావడం గమనార్హం. ఇందులో ప్రవేశాలు 50 శాతం లాసెట్ ద్వారా మరో 50 శాతం మేర యాజమాన్యకోటా కింద కల్పిస్తారు. లాసెట్‌కు ఆశించిన మేర ప్రవేశాలు జరగకపోవడంతో వీరి పంటపండింది. యాజమాన్య కోటా పేరుతో పొరుగు రాష్ట్రాల విద్యార్థులను ప్రలోభపెట్టి ప్రవేశాలు కల్పిస్తున్నారు. కళాశాలలోని 320 సీట్లలోదాదాపు 300 వరకు సీట్లను తమిళనాడు విద్యార్థులతోనే భర్తీ చేస్తున్నారు. ప్రవేశాలు పొందిన తర్వాత తమిళనాడులోనే పనిచేసుకుంటూ, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ పరీక్షల సమయంలోనే ఇక్కడకు వచ్చేవారు. తమిళనాడుకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి 57వ ఏట ఇదే తరహాలో ప్రవేశం పొందాడు. పరీక్షల సమయంలో సెలవులు పెట్టి వచ్చి రాసి పట్టా సాధించాడు. అక్కడి బార్ అసోసియేషన్‌లో ఇతని సభ్యత్వానికి న్యాయవాదుల అభ్యంతరం పెట్టడంతో నానా హంగామా చేసినట్లు తెలిసింది. సదరు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించగా సెంట్రల్ విజిలెన్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా గత నెలలో బసవతారకం న్యాయకళాశాలకు అధికారులు వచ్చి రికార్డులను తీసుకుని వెళ్లారు. తమిళనాడులో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, కడపలో రెగ్యులర్ విధానంలో న్యాయవిద్య ఎలా పూర్తిచేశారన్న అంశంపై పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో కళాశాలకు చెందిన ప్రిన్సిపాల్ హిమవంత్కుమార్ను సెంట్రల్ విజిలెన్స్ అధికారులు శుక్రవారం అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇది బయటపడిన ఒక ఘటన మాత్రమే. ప్రవేశాలతో తమ వర్సిటీకి సంబంధం ఉండదని యోగివేమన విశ్వవిద్యాలయం అధికారులు స్పష్టం చేశారు. కరస్పాండెంట్ ప్రమేయం లేకుండా ప్రిన్సిపాల్ అక్రమ ప్రవేశాలు కల్పించే సాహసం చేయరన్నది బహిరంగ రహస్యం. వివరణ కోరేందుకు కళాశాల కరస్పాండెంట్ ఎస్. గోవర్ధన్‌రెడ్డిని ఫోన్లో ప్రయత్నించగా, సెల్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది. -
టీడీపీ నేత లా కాలేజీలో విజిలెన్స్ తనిఖీలు
సాక్షి, వైఎస్సార్ కడప: జిల్లాలోని టీడీపీ నేత గోవర్ధన్‌రెడ్డి చెందిన న్యాయ కళాశాలలో కేంద్ర విజిలెన్స్ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న వారిని రెగ్యులర్ విద్యార్థిగా తన న్యాయ కళాశాలలోని సిబ్బంది అడ్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఓ కేసు విచారణలో తమిళనాడుకు చెందిన ఉద్యోగికి టీడీపీ నేత లా కళాశాలలో అడ్మిషన్ ఇచ్చినట్లు కోర్టు గుర్తించింది. అయితే కోర్టు ఆదేశాలతో కళాశాలలో తనిఖీలు చేపట్టినట్టు కేంద్ర విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. -
ఈ యూనివర్సిటీలో హ్యారీ పోటర్ పాఠాలు
కోల్‌కతా : హ్యారీ పోటర్ సిరిస్ సినిమాలకు, పుస్తకాలుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అంతేకాక ఈ నవలా రచయిత జేకే రోలింగ్‌కి కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అభిమానులున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రాసిన ఈ పుస్తకాలు చదువరులను మరో ప్రపంచానికి తీసుకెళ్తాయనడంలో సందేహం లేదు. అందుకే నిరంతరం ఒకే రకమైన సబ్జెక్ట్ చదువుతూ బోర్‌గా ఫీలయ్యే విద్యార్థుల కోసం ఈ సైన్స్ ఫిక్షన్ నవలని పాఠ్యాంశాలుగా చేర్చనుంది కోల్‌కతాలోని ఓ యూనివర్సిటీ. వివారాలు.. కోల్‌కతాలోని ‘నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జ్యురిడికల్ సైన్సెస్’లో ఈ వినూత్న ప్రయోగం జరగనుంది. ‘యాన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ఫాంటసీ ఫిక్షన్ లిటరేచర్ అండ్ లా : స్పెషల్ ఫోకస్ అన్ రోలింగ్స్ పోట్టర్వర్స్’ అనే పేరుతో ఈ కోర్స్‌ను ప్రారంభించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఇది ఈ ఏడాది వింటర్ సెమిస్టర్ నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. నాలుగో సంవత్సరం, ఐదో సంవత్సరం బీఏ ఎల్ఎల్బీ ఆనర్స్ చదువుతున్న విద్యార్థులకు దీన్ని ఓ ఎలక్టివ్‌గా ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయం గురించి యూనివర్సిటీ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘లా కాలేజ్‌లో విద్యార్థులకు వేర్వేరు అంశాలను బోధిస్తుంటాము. దాంతో పాటు ఇక్కడ నేర్చుకున్న లీగల్ అంశాలు బయట ప్రపంచంలో ఏ విధంగా అమలు అవుతున్నాయి అనే పరిస్థితుల గురించి కూడా వారికి అవగాహన కల్పిస్తాము. ఆయా చట్టాలను నిజజీవితంలో ఎలా అన్వయించుకోవాలనే అంశాల గురించి మరింత బాగా నేర్పించడం కోసం ఇలాంటి వినూత్న అంశాలను చేర్చాము. వీటి వల్ల విద్యార్థులకు కూడా తమ కోర్స్ పట్ల ఆసక్తి పెరుగుతుంది’ అన్నారు. -
‘క్లాట్’ కౌన్సెలింగ్ నిలుపుదలకు సుప్రీం నో
న్యూఢిల్లీ: క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్) ర్యాంకుల ఆధారంగా దేశవ్యాప్తంగా 19 ప్రతిష్టాత్మక న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం చేపట్టనున్న కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తాము జారీ చేసే తదుపరి ఉత్తర్వుల ఆధారంగానే ఎలాంటి చర్యలైనా తీసుకోవాలని స్పష్టం చేసింది. బుధవారం ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది. మే 13న నిర్వహించిన క్లాట్‌కు 54 వేల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. అయితే పరీక్ష సందర్భంగా సాంకేతిక సమస్య లు ఎదురయ్యాయని, ఫలితాలను నిలిపి వేయాలని, పరీక్ష మళ్లీ నిర్వహించాలని కొంద రు విద్యార్థులు పలు హైకోర్టులతోపాటు సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. విచారణ జరిపిన సుప్రీం.. ఫిర్యాదుల పరిష్కా ర కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాల్సిం దిగా కొచ్చిలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్‌ను ఆదేశించింది. -
టీఎస్ లాసెట్ 2017కు 85.65% హాజరు
30న ప్రిలిమినరీ ‘కీ’ విడుదల కేయూ క్యాంపస్: రాష్ట్రంలో శనివారం నిర్వహించిన టీఎస్ లాసెట్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా 24,858 మంది విద్యార్థులకుగాను 21,203 మంది (85.65శాతం) హాజరయ్యారు. రాష్ట్రంలో 12 రీజినల్ సెంటర్ల పరిధిలో మొత్తంగా 51 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిమిషం నిబంధనతో అక్కడక్కడ అభ్యర్థులు ఉరుకులు పరుగుల మీద పరీక్షా కేంద్రా లకు చేరుకున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతించలేదు. హన్మకొండలోని వర్సిటీ లా కళాశాలలో ఆయా కోర్సుల ప్రవేశాల ప్రశ్నపత్రాల సెట్లను ఉదయం 6 గంటలకు కేయూ వీసీ ప్రొఫెసర్ ఆర్. సాయన్న ఎంపిక చేశారు. ప్రతి కోర్సుకు రెండు ప్రశ్నపత్రాల సెట్లలో లాటరీ పద్ధతి ద్వారా ఒక సెట్‌ను ఎంపిక చేశారు. ఈనెల 30న ప్రిలిమినరీ కీ విడుదల చేయనున్నట్టు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ రంగారావు వెల్లడించారు. జూన్ 2 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, జూన్ 10న ఫలితాలు విడుదల చేస్తామన్నారు. -
విశాఖలో విద్యార్థినిపై అత్యాచారం
విశాఖపట్నం: విద్యార్థినిపై సీనియర్ విద్యార్థి అత్యాచారానికి పాల్పడిన ఘటన విశాఖపట్నంలో వెలుగు చూసింది. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో సీనియర్ విద్యార్థి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. నిన్న రాత్రి విద్యార్థులందరూ పార్టీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మద్యం సేవించినట్టు తెలుస్తోంది. బాధితురాలు ఎంవీపీ పోలీసు స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలితో పాటు నిందితుడిని వైద్య పరీక్షలకు పంపినట్టు సీఐ విద్యాసాగర్ తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. కాగా విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 376 కింద కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. నిందితుడు ఉత్తరప్రదేశ్ కు చెందిన రాషీబ్ సింగ్ కాగా, విద్యార్థిని లక్నో వాసి. -
లా విద్యార్థుల రాస్తారోకో
తిరువళ్లూరు: చెన్నైలో ఉన్న లా కళాశాలను కాంచీపు రం తిరువళ్లూరుకు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన లా విద్యార్థులపై లాఠీచార్జ్‌కు నిరసనగా తిరువళ్లూరులోని మెజిస్ట్రేట్ కోర్టు వద్ద శుక్రవారం లా విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై నిర్వహించిన రాస్తారోకో కార్యక్రమానికి లా విద్యార్థుల కోఆర్డినేటర్ జార్జిముల్లర్ అద్యక్షత వహించారు. రాస్తారోకో కార్యక్రమానికి తమిళనాడు, ఆంధ్ర లా విద్యార్థులు ఉమ్మడి ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. జార్జిముల్లర్ మాట్లాడుతూ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం అంబేద్కర్ లా కళాశాలను తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాకు తరలించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న లా విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవడంతో పాటు అంబేద్కర్ లా కళాశాల మార్పు నిర్ణయూన్ని విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాస్తారోకోతో దాదాపు 40 నిమిషాల పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అనంతరం కోర్టు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.