కోల్‌కతా : హ్యారీ పోటర్ సిరిస్ సినిమాలకు, పుస్తకాలుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అంతేకాక ఈ నవలా రచయిత జేకే రోలింగ్‌కి కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అభిమానులున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రాసిన ఈ పుస్తకాలు చదువరులను మరో ప్రపంచానికి తీసుకెళ్తాయనడంలో సందేహం లేదు. అందుకే నిరంతరం ఒకే రకమైన సబ్జెక్ట్ చదువుతూ బోర్‌గా ఫీలయ్యే విద్యార్థుల కోసం ఈ సైన్స్ ఫిక్షన్ నవలని పాఠ్యాంశాలుగా చేర్చనుంది కోల్‌కతాలోని ఓ యూనివర్సిటీ.
వివారాలు.. కోల్‌కతాలోని ‘నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జ్యురిడికల్ సైన్సెస్’లో ఈ వినూత్న ప్రయోగం జరగనుంది. ‘యాన్ ఇంటర్‌ఫేస్ బిట్వీన్ ఫాంటసీ ఫిక్షన్ లిటరేచర్ అండ్ లా : స్పెషల్ ఫోకస్ అన్ రోలింగ్స్ పోట్టర్‌వర్స్’ అనే పేరుతో ఈ కోర్స్‌ను ప్రారంభించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఇది ఈ ఏడాది వింటర్ సెమిస్టర్ నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. నాలుగో సంవత్సరం, ఐదో సంవత్సరం బీఏ ఎల్‌ఎల్‌బీ ఆనర్స్ చదువుతున్న విద్యార్థులకు దీన్ని ఓ ఎలక్టివ్‌గా ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ విషయం గురించి యూనివర్సిటీ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘లా కాలేజ్‌లో విద్యార్థులకు వేర్వేరు అంశాలను బోధిస్తుంటాము. దాంతో పాటు ఇక్కడ నేర్చుకున్న లీగల్ అంశాలు బయట ప్రపంచంలో ఏ విధంగా అమలు అవుతున్నాయి అనే పరిస్థితుల గురించి కూడా వారికి అవగాహన కల్పిస్తాము. ఆయా చట్టాలను నిజజీవితంలో ఎలా అన్వయించుకోవాలనే అంశాల గురించి మరింత బాగా నేర్పించడం కోసం ఇలాంటి వినూత్న అంశాలను చేర్చాము. వీటి వల్ల విద్యార్థులకు కూడా తమ కోర్స్ పట్ల ఆసక్తి పెరుగుతుంది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment