అన్నీ తెలిసిన వాణ్ని నమ్మితే దుస్థితే!
ఇస్లామాబాద్: ఉగ్రవాదం, కశ్మీర్ లే ప్రధానాంశాలుగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రసంగంపై విపక్షాలు మండిపడుతున్నాయి. షరీఫ్ అమలుచేస్తోన్న అస్పష్ట విదేశాంగ విధానంతో పాక్ అంతర్జాతీయ సమాజంలో ఏకాకిగా మారుతున్నదని పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత సయీద్ ఖుర్షీద్ షా అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదలచేశారు.
కీలకమైన రక్షణ, విదేశాంగ వ్యవహారాల్లో స్పష్టమైన విధానం లేకుండా ఎప్పటికప్పుడు అన్నట్లుగా వ్యవహరించడం దారుణమని షా విమర్శించారు. విదేశాంగ శాఖ మంత్రి సర్తాజ్ అజీజ్ కు షరీఫ్ ఎనలేని ప్రాధాన్యం ఇస్తుండటాన్ని ప్రస్తావిస్తూ అన్నీ తెలిసిన వాడిని (Mr know all) నమ్ముకుంటే ప్రధానికి దుస్థితి తప్పదని వ్యాఖ్యానించారు. (కశ్మీర్‌పై మళ్లీ నోరుపారేసుకున్న షరీఫ్!)
పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా గుర్తించాలంటూ అమెరికన్ కాంగ్రెస్ లో చర్చజరగడానికి కారణం షరీఫ్ వైఫల్యమేనని, భారత్ కారణంగా పాకిస్థాన్ ఎదుర్కొటున్న సమస్యలను ఐరాసాలో ప్రస్తావించడంలో ఆయన విఫలం అయ్యారని ఖుర్షీద్ షా పేర్కొన్నారు. ముఖ్యమైన అంశాల్లో ప్రతిపక్షాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవడాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని అన్నారు.