leaders corruption
-
శభాష్ పోలీస్
ద్వారకాతిరుమల : చేపల కోసం చెరువులోకి దిగిన ఒక యువకుడు నీట మునిగి మృత్యువాత పడ్డాడు. ఇతడ్ని రక్షిద్దామని ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తుల పరిస్థితి చావుతప్పి కన్ను లొట్టబోయిన్డట్టయ్యింది. మండలంలోని కొమ్మరలో ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొమ్మరకు చెందిన మానుకొండ నాగరాజు(29)కూలి పనులు చేస్తూ భార్య కుమారి, తన ఇద్దరి పిల్లలను పోషిస్తున్నాడు. అయితే ఉదయం వర్షం కురుస్తుండటంతో పనికి సెలవుపెట్టి, స్థానిక బూర్గులమ్మ చెరువు వద్దకు చేపల వేట నిమిత్తం వెళ్లాడు. అతని వెనుక అదే గ్రామానికి చెందిన శీలం విఘ్నేశ్వరరావు, ముంగమూరి లక్ష్మణరావు సైతం వెళ్లగా, నాగరాజు చెరువులోకి దిగాడు. ఆ ప్రాంతంలో దాదాపు 12 అడుగుల లోతు ఉండటంతో నాగరాజు అక్కడ మునిగిపోయాడు. చివరి క్షణాల్లో దీన్ని గమనించిన విఘ్నేశ్వరరావు, లక్ష్మణరావులు నాగరాజును రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వారు వెనుదిరిగి విషయాన్ని స్థానికులు, పోలీసులు, భీమడోలు అగ్నిమాపక సిబ్బందికి తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే యువకుడు నీటమునిగిన ప్రాంతం లోతుగా ఉండటంతో పాటు, వర్షం కురుస్తుండటంతో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు ముందుకు సాగలేదు. ఈ తరుణంలో ట్రైనీ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్యతో పాటు భీమడోలు సీఐ బి.నాగేశ్వర్ నాయక్ సంఘటనా స్థలానికి వచ్చారు. ఎంతకీ మృతదేహం లభ్యం కాకపోవడంతో భీమడోలు సీఐ చెరువులోకి దిగి, మృతదేహాన్ని కనుగొని ఒడ్డుకు చేర్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఐ.వీర్రాజు తెలిపారు. అక్రమ తవ్వకాలే బలిగొన్నాయి కొమ్మరలోని బూర్గులమ్మ చెరువులో గతంలో కొందరు టీడీపీ నేతలు మట్టి అక్రమ తవ్వకాలను యథేచ్ఛగా జరిపారు. రియల్ ఎస్టేట్లకు ఆ మట్టిని అమ్మి సొమ్ము చేసుకున్నారు. అయితే చెరువును క్రమ పద్ధతిలో తవ్వకుండా ఇష్టం వచ్చినట్లు తవ్వేయడంతో అగాథాలు ఏర్పడ్డాయి. ఈ కారణంగా ఏర్పడిన అగాథాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు పుష్కలంగా నీరు చేరి, స్థానికులకు లోతు తెలియలేదు. ఈ కారణంగానే చేపల వేట కోసం చెరువులోకి దిగిన నాగరాజు ఆ అగాథంలో పడి దుర్మరణం పాలైనట్టు స్థానికులు తెలిపారు. చెరువులోకి దిగి యువకుడి మృతదేహాన్ని వెలికితీసిన సీఐ ఒకానొక సమయంలో ఎంతకీ నాగరాజు మృతదేహం లభ్యం కాకపోవడంతో అందరిలో నైరాశ్యం నెలకొంది. ఈ క్రమంలో ప్రమాదమని తెలిసినా భీమడోలు సీఐ బి.నాగేశ్వర్ నాయక్ తానే స్వయంగా రంగంలోకి దిగారు. యూనిఫాంను తొలగించి, షార్ట్, టీ షర్టులను ధరించి శవాన్ని వెదికేందుకు చెరువులోకి దిగారు. దాదాపు గంట పాటు సీఐ చెరువులో మునిగి ఈత కొడుతూ.. చివరికి మృతదేహాన్ని గుర్తించారు. తనే స్వయంగా మృతదేహాన్ని బయటకు తీసి బోటులో ఉన్న ఎస్సై వీర్రాజుకు అందించారు. అక్కడి నుంచి బోటులోనే జాగ్రత్తగా శవాన్ని ఒడ్డుకు చేర్చారు. అధికారే స్వయంగా చెరువులోకి దిగి మృతదేహాన్ని కనుగొనడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా పలువురు ఆయన సాహసాన్ని ప్రశంసించారు. -
అన్నీ సంతర్పణలే..
రాకరాక అధికారమొచ్చింది.. పంచుకోవడం.. దోచుకోవడమే విధానమన్న సంస్కృతికి జిల్లా టీడీపీ నేతలు తెరతీశారు. పర్సంటేజీలకు కక్తుర్తిపడే అధికారులూ నిబంధనలకు పాతరేసి దీనికి వత్తాసు పలుకుతున్నారు. ఎంత పనైనా సరే రూ.5 లక్షలకే కుదించడం.. దానిని చేజిక్కించుకునే కొత్త సంస్కృతిని పాటిస్తున్నారు. టెండర్లతో పనిలేకుండా కొందరు జెడ్పీటీసీలే కాంట్రాక్టర్ల అవతారమెత్తుతున్నారు. మరికొందరు కుటుంబ సభ్యుల పేరిట పనులు చేపడుతున్నారు. విశాఖపట్నం: విశాఖపట్నం పరిషత్‌కు సాధారణ నిధులు రూ.2.84కోట్లతో పాటు 13వ ఆర్థిక సంఘం నిధులు 11.39 కోట్లు మంజూరయ్యాయి. వీటితో చేపట్టే పనుల పంపకాలకు రంగం సిద్ధమైంది.సాధారణంగా ఐదు లక్షలు దాటితే ఏ పనిైకైనా టెండర్ పిలవాల్సిందే. టెండర్లు పిలిస్తే తమకు దక్కుతాయో లేదోననే ఆందోళనతో..ఈ పనులను ఐదేసి లక్షల ప్యాకేజీ కింద విభజించి టెండర్లతో ప్రమేయం లేకుండా టీడీపీ జెడ్పీటీసీలు చేజిక్కించుకుంటున్నారు. ఉదారణకు రూ.25 లక్షల అంచనాతో కైలాసగిరిలో జెడ్పీ గెస్ట్ హౌస్, మరో రూ.25లక్షల అంచనాతో జెడ్పీ చైర్పర్సన్ బంగ్లా, రూ.45లక్షల అంచనాతో జెడ్పీ కార్యాలయం ఆధునీకరించాలని ప్రతిపాదించారు. ఇవే కాదు జెడ్పీ, 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనులన్నీ ఐదేసి లక్షల చొప్పున విభజించారు. పైగా ఈ పనులన్నీ విచిత్రంగా గెస్ట్‌హౌస్‌లు, కార్యాలయాల మరమ్మతుల పేరిట కేటాయించినవే. ఈ దోపిడీని అడ్డుకునేందుకు ఇటీవల జరిగిన జెడ్పీసర్వసభ్య సమావేశంలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు తీవ్ర స్థాయిలోనే ఆందోళన చేశారు. అయినా లెక్కపెట్టకుండా మెజారిటీ ఉందనే అహంకారంతో నిబంధనలకు పాతరేసి మరీ అడ్డగోలుగా తీర్మానం చేయించుకున్నారు. రాజ్యాంగేతర శక్తి కీలకం: ఇప్పుడు ఈ పనులను అధికారుల అండదండలతో తమ పరం చేసుకునేందుకు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందు కోసం కొందరైతే తమ కుటుంబసభ్యుల పేరిట చేపట్టేందుకు చక్రం తిప్పుతుంటే, మరికొందరు టీడీపీ జెడ్పీటీసీలే కాంట్రాక్టర్ల అవతార మెత్తుతున్నారు. ఈ వ్యవహారమంతా జెడ్పీలో రాజ్యాంగేతర శక్తిగా మారిన ఓ నాయకుడితో పాటు ఓ మంత్రి కనుసన్నల్లోనే సాగుతున్నట్టు తెలుస్తోంది. అధికారులతో సహా అందరికీ వాటాలు తీశాకే పనులు కేటాయిస్తున్నట్టు వినికిడి. దీంతో జెడ్పీ, 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే రూ.14.18కోట్ల పనుల్లో 50 శాతానికి పైగా నిధులు పక్కదారి పట్టనున్నాయనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీల్లోనూ ఇదే తంతు : ఇక మున్సిపాల్టీల్లో అయితే రూ.లక్ష దాటితే టెండర్లు పిలవాల్సి ఉంటుంది. మరీ లక్షలోపైతే మిగిలేదేముంటుందని అనుకున్నారో ఏమో ఈ మొత్తాన్ని ఐదులక్షలకు పెంచేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను అడ్డంపెట్టుకుని జిల్లాలోని నర్సీపట్నం, యలమంచలిలలో కూడా అందుబాటులో ఉన్న జనరల్ ఫండ్స్‌ను ఐదేసి లక్షలతో పంచుకునేందుకు టీడీపీ నేతలే కాదు.. ప్రజా ప్రతినిధులు సైతం కాంట్రాక్టర్ల అవతారమెత్తుతున్నారు. ఎంపీ లాడ్స్‌కు నామినేషన్లే.. : జెడ్పీ,మున్సిపాల్టీల్లోనే కాదు చివరకు ఎంపీ లాడ్స్ కింద మంజూరైన రూ.12.5కోట్లతో చేపట్టే పనులను సైతం ఇదే రీతిలో రూ.5లక్షలకు కుదించి నామినేషన్ల పద్ధతిలో పంచుకుంటున్నారు. గత ప్రభుత్వహయాంలో మంజూరై ,ప్రారంభం కాకుండా మిగిలి పోయినపనులు సీడీఎఫ్ కింద రూ.11.16కోట్లు, ఏసీడీపీ కింద రూ.20కోట్లు ప్రస్తుతం అందు బాటులో ఉన్నప్పటికీ వాటిపై ఫ్రీజింగ్ విధించారు. ట్రెజరీ ఆంక్షలు సడలించిన వెంటనే ఈ నిధులతో కూడా పనులను చేజిక్కించుకునేందుకు టీడీపీ నేతలు పావులు కదుపు తున్నారు.