రాకరాక అధికారమొచ్చింది.. పంచుకోవడం.. దోచుకోవడమే విధానమన్న సంస్కృతికి జిల్లా టీడీపీ నేతలు తెరతీశారు. పర్సంటేజీలకు కక్తుర్తిపడే అధికారులూ నిబంధనలకు పాతరేసి దీనికి వత్తాసు పలుకుతున్నారు. ఎంత పనైనా సరే రూ.5 లక్షలకే కుదించడం.. దానిని చేజిక్కించుకునే కొత్త సంస్కృతిని పాటిస్తున్నారు. టెండర్లతో పనిలేకుండా కొందరు జెడ్పీటీసీలే కాంట్రాక్టర్ల అవతారమెత్తుతున్నారు. మరికొందరు కుటుంబ సభ్యుల పేరిట పనులు చేపడుతున్నారు.
విశాఖపట్నం: విశాఖపట్నం పరిషత్‌కు సాధారణ నిధులు రూ.2.84కోట్లతో పాటు 13వ ఆర్థిక సంఘం నిధులు 11.39 కోట్లు మంజూరయ్యాయి. వీటితో చేపట్టే పనుల పంపకాలకు రంగం సిద్ధమైంది.సాధారణంగా ఐదు లక్షలు దాటితే ఏ పనిైకైనా టెండర్
పిలవాల్సిందే. టెండర్లు పిలిస్తే తమకు దక్కుతాయో లేదోననే ఆందోళనతో..ఈ పనులను ఐదేసి లక్షల ప్యాకేజీ కింద విభజించి టెండర్లతో ప్రమేయం లేకుండా టీడీపీ జెడ్పీటీసీలు చేజిక్కించుకుంటున్నారు. ఉదారణకు రూ.25 లక్షల అంచనాతో కైలాసగిరిలో జెడ్పీ గెస్ట్ హౌస్, మరో రూ.25లక్షల అంచనాతో జెడ్పీ చైర్‌పర్సన్ బంగ్లా, రూ.45లక్షల అంచనాతో జెడ్పీ కార్యాలయం ఆధునీకరించాలని ప్రతిపాదించారు. ఇవే కాదు జెడ్పీ, 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనులన్నీ ఐదేసి లక్షల చొప్పున విభజించారు. పైగా ఈ పనులన్నీ విచిత్రంగా గెస్ట్‌హౌస్‌లు, కార్యాలయాల మరమ్మతుల పేరిట కేటాయించినవే. ఈ దోపిడీని అడ్డుకునేందుకు ఇటీవల జరిగిన జెడ్పీసర్వసభ్య సమావేశంలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు తీవ్ర స్థాయిలోనే ఆందోళన చేశారు. అయినా లెక్కపెట్టకుండా మెజారిటీ ఉందనే అహంకారంతో నిబంధనలకు పాతరేసి మరీ అడ్డగోలుగా తీర్మానం చేయించుకున్నారు.
రాజ్యాంగేతర శక్తి కీలకం: ఇప్పుడు ఈ పనులను అధికారుల అండదండలతో తమ పరం చేసుకునేందుకు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందు కోసం కొందరైతే తమ కుటుంబసభ్యుల పేరిట చేపట్టేందుకు చక్రం తిప్పుతుంటే, మరికొందరు టీడీపీ జెడ్పీటీసీలే కాంట్రాక్టర్ల అవతార మెత్తుతున్నారు. ఈ వ్యవహారమంతా జెడ్పీలో రాజ్యాంగేతర శక్తిగా మారిన ఓ నాయకుడితో పాటు ఓ మంత్రి కనుసన్నల్లోనే సాగుతున్నట్టు తెలుస్తోంది. అధికారులతో సహా అందరికీ వాటాలు తీశాకే పనులు కేటాయిస్తున్నట్టు వినికిడి. దీంతో జెడ్పీ, 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే రూ.14.18కోట్ల పనుల్లో 50 శాతానికి పైగా నిధులు పక్కదారి పట్టనున్నాయనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి.
మున్సిపాలిటీల్లోనూ ఇదే తంతు : ఇక మున్సిపాల్టీల్లో అయితే రూ.లక్ష దాటితే టెండర్లు పిలవాల్సి ఉంటుంది. మరీ లక్షలోపైతే మిగిలేదేముంటుందని అనుకున్నారో ఏమో ఈ మొత్తాన్ని ఐదులక్షలకు పెంచేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను అడ్డంపెట్టుకుని జిల్లాలోని నర్సీపట్నం, యలమంచలిలలో కూడా అందుబాటులో ఉన్న జనరల్ ఫండ్స్‌ను ఐదేసి లక్షలతో పంచుకునేందుకు టీడీపీ నేతలే కాదు.. ప్రజా ప్రతినిధులు సైతం కాంట్రాక్టర్ల అవతారమెత్తుతున్నారు.
ఎంపీ లాడ్స్‌కు నామినేషన్లే.. : జెడ్పీ,మున్సిపాల్టీల్లోనే కాదు చివరకు ఎంపీ లాడ్స్ కింద మంజూరైన రూ.12.5కోట్లతో చేపట్టే పనులను సైతం ఇదే రీతిలో రూ.5లక్షలకు కుదించి నామినేషన్ల పద్ధతిలో పంచుకుంటున్నారు. గత ప్రభుత్వహయాంలో మంజూరై ,ప్రారంభం కాకుండా మిగిలి పోయినపనులు సీడీఎఫ్ కింద రూ.11.16కోట్లు, ఏసీడీపీ కింద రూ.20కోట్లు ప్రస్తుతం అందు బాటులో ఉన్నప్పటికీ వాటిపై ఫ్రీజింగ్ విధించారు. ట్రెజరీ ఆంక్షలు సడలించిన వెంటనే ఈ నిధులతో కూడా పనులను చేజిక్కించుకునేందుకు టీడీపీ నేతలు పావులు కదుపు తున్నారు.
అన్నీ సంతర్పణలే..
Published Wed, Feb 11 2015 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM
Advertisement
Advertisement