ద్వారకాతిరుమల : చేపల కోసం చెరువులోకి దిగిన ఒక యువకుడు నీట మునిగి మృత్యువాత పడ్డాడు. ఇతడ్ని రక్షిద్దామని ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తుల పరిస్థితి చావుతప్పి కన్ను లొట్టబోయిన్డట్టయ్యింది. మండలంలోని కొమ్మరలో ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొమ్మరకు చెందిన మానుకొండ నాగరాజు(29)కూలి పనులు చేస్తూ భార్య కుమారి, తన ఇద్దరి పిల్లలను పోషిస్తున్నాడు. అయితే ఉదయం వర్షం కురుస్తుండటంతో పనికి సెలవుపెట్టి, స్థానిక బూర్గులమ్మ చెరువు వద్దకు చేపల వేట నిమిత్తం వెళ్లాడు.
అతని వెనుక అదే గ్రామానికి చెందిన శీలం విఘ్నేశ్వరరావు, ముంగమూరి లక్ష్మణరావు సైతం వెళ్లగా, నాగరాజు చెరువులోకి దిగాడు. ఆ ప్రాంతంలో దాదాపు 12 అడుగుల లోతు ఉండటంతో నాగరాజు అక్కడ మునిగిపోయాడు. చివరి క్షణాల్లో దీన్ని గమనించిన విఘ్నేశ్వరరావు, లక్ష్మణరావులు నాగరాజును రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వారు వెనుదిరిగి విషయాన్ని స్థానికులు, పోలీసులు, భీమడోలు అగ్నిమాపక సిబ్బందికి తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే యువకుడు నీటమునిగిన ప్రాంతం లోతుగా ఉండటంతో పాటు, వర్షం కురుస్తుండటంతో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు ముందుకు సాగలేదు. ఈ తరుణంలో ట్రైనీ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్యతో పాటు భీమడోలు సీఐ బి.నాగేశ్వర్ నాయక్ సంఘటనా స్థలానికి వచ్చారు. ఎంతకీ మృతదేహం లభ్యం కాకపోవడంతో భీమడోలు సీఐ చెరువులోకి దిగి, మృతదేహాన్ని కనుగొని ఒడ్డుకు చేర్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఐ.వీర్రాజు తెలిపారు.
అక్రమ తవ్వకాలే బలిగొన్నాయి కొమ్మరలోని బూర్గులమ్మ చెరువులో గతంలో కొందరు టీడీపీ నేతలు మట్టి అక్రమ తవ్వకాలను యథేచ్ఛగా జరిపారు. రియల్ ఎస్టేట్‌లకు ఆ మట్టిని అమ్మి సొమ్ము చేసుకున్నారు. అయితే చెరువును క్రమ పద్ధతిలో తవ్వకుండా ఇష్టం వచ్చినట్లు తవ్వేయడంతో అగాథాలు ఏర్పడ్డాయి. ఈ కారణంగా ఏర్పడిన అగాథాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు పుష్కలంగా నీరు చేరి, స్థానికులకు లోతు తెలియలేదు. ఈ కారణంగానే చేపల వేట కోసం చెరువులోకి దిగిన నాగరాజు ఆ అగాథంలో పడి దుర్మరణం పాలైనట్టు స్థానికులు తెలిపారు.
చెరువులోకి దిగి యువకుడి మృతదేహాన్ని వెలికితీసిన సీఐ
ఒకానొక సమయంలో ఎంతకీ నాగరాజు మృతదేహం లభ్యం కాకపోవడంతో అందరిలో నైరాశ్యం నెలకొంది. ఈ క్రమంలో ప్రమాదమని తెలిసినా భీమడోలు సీఐ బి.నాగేశ్వర్ నాయక్ తానే స్వయంగా రంగంలోకి దిగారు. యూనిఫాంను తొలగించి, షార్ట్, టీ షర్టులను ధరించి శవాన్ని వెదికేందుకు చెరువులోకి దిగారు. దాదాపు గంట పాటు సీఐ చెరువులో మునిగి ఈత కొడుతూ.. చివరికి మృతదేహాన్ని గుర్తించారు. తనే స్వయంగా మృతదేహాన్ని బయటకు తీసి బోటులో ఉన్న ఎస్సై వీర్రాజుకు అందించారు. అక్కడి నుంచి బోటులోనే జాగ్రత్తగా శవాన్ని ఒడ్డుకు చేర్చారు. అధికారే స్వయంగా చెరువులోకి దిగి మృతదేహాన్ని కనుగొనడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా పలువురు ఆయన సాహసాన్ని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment