కేసీఆర్ బిజీబిజీ
బొకే అందజేసిన శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్
ప్రమాణ స్వీకారోత్సవంపై పార్టీ నేతలతో మంతనాలు
ఇంటి వద్ద సందడి
సాక్షి,సిటీబ్యూరో: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న కేసీఆర్‌కు అభినందనల వెల్లువ సాగుతోంది. ఆయన్ను కలిసేందుకు అనేకమంది బారులు తీరుతున్నారు. శుక్రవారం శాసనమండలి చైర్మన్ డాక్టర్ చక్రపాణి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌తో కలిసి కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆరగంట పాటు నూతనంగా ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రం గురించి పలు విషయాలను చర్చించినట్లు తెలిసింది. వీరితోపాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, నాయకులతోపాటు పలుశాఖల కార్యదర్శులు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, వివిధశాఖల ఉన్నతాధికారులు, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు, తెలంగాణ న్యాయవాదుల సంఘాల నాయకులు, పలు వ్యాపారసంస్థల అధిపతులు, పారిశ్రామివేత్తలు, ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల ఉద్యోగ సంఘాల నాయకులు, తెలంగాణ కళాకారుల సంఘం నాయకులు, తెలంగాణ చిన్నపరిశ్రమల సంఘం నాయకులు, ముస్లిం, క్రైస్తవ ధార్మిక సంఘాల నేతలు, పలు జిల్లాల నుంచి తరలివచ్చిన పార్టీ నాయకులు, తెలంగాణవాదులు కాబోయే సీఎంను కలిసి అభినందించారు.
మూతపడిన కల్లు దుకాణాలను తెరిపించాలి
దోమలగూడ: నూతన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న కేసీఆర్‌ను తెలంగాణ గౌడ ఐక్య సాధన సమితి, కల్లు దుకాణాల సాధన సమితి ప్రతినిధులు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో ఘనంగా సత్కరించారు.
హైదరాబాదులో మూతపడిన కల్లు దుకాణాలను తెరిపించాలని, తాటివనాల పెంపునకు గ్రామీణ ప్రాంతంలో ప్రతి సొసైటీకి ఐదు నుంచి పదిఎకరాల భూమిని కేటాయించాలని, గీత కార్మికుల సంక్షేమానికి గీత కార్పొరేషన్‌కు రూ.వెయ్యికోట్ల శాశ్వత నిధి కేటాయించాలని, 50 ఏళ్లు నిండిన ప్రతి గీతకార్మికుడికి రూ.3 వేలు పింఛన్ ఇవ్వాలని గౌడ ప్రతినిధులు కేసీఆర్‌కు విజ్ఞప్తిచేశారు.
ఆయన్ను కలిసిన వారిలో గౌడ ఐక్యసాధన సమితి రాష్ట్ర కన్వీనర్ అంబాల నారాయణగౌడ్, కల్లు దుకాణాల సాధన సమితి కన్వీనర్ భిక్షపతిగౌడ్, గౌడ సంఘం ప్రధానకార్యదర్శి మూల శ్రావణ్‌కుమార్‌గౌడ్, గౌడ జేఏసీ కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్, గౌడ ప్రతినిధులు కాసుల సురేందర్‌గౌడ్, సదానందంగౌడ్, నారాయణగౌడ్, కక్కెర్ల కొమురయ్యగౌడ్, చెరుకు పాపయ్యగౌడ్, రామరాజుగౌడ్, నరేష్‌గౌడ్, విజయ్‌కుమార్‌గౌడ్, బాలకృష్ణగౌడ్, వేమూరు గణేష్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, రమేష్‌గౌడ్ తదితరులున్నారు.
ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటాం
ఉస్మానియాయూనివర్సిటీ : తన రాజకీయ ఎత్తుగడలతో ఎమ్మార్పీఎస్‌ను కేసీఆర్‌ను విచ్ఛిన్నం చేశారని మాదిగ నేతలు విమర్శించారు. శుక్రవారం ఉస్మానియాయూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట రుద్రవరం లింగస్వామిమాదిగ, పురుషోత్తంమాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు విజయ్రావుమాదిగ తదితరులు విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ తీరును నిరసిస్తూ జూన్ 2న ఆయన ప్రమాణ స్వీకారోత్సవాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.