Lease lands
-
దేవాలయాల లీజు భూములపై సర్కార్ నజర్
సాక్షి, హైదరాబాద్: దేవాలయ లీజు భూములపై ప్రత్యేక దృష్టి సారించామని, ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఉద్యోగుల వేతన సమస్యల పరిష్కారం, ఆలయ భూముల పరిరక్షణ, లీజు భూములు, ఆన్లైన్ సేవలు, తదితర అంశాలపై ఆ శాఖ అధికారులతో ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఆలయ భూములు కబ్జా చేసిన ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదని, దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తుల లీజుల విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. దేవాలయ భూములకు సర్వే చేసి, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. న్యాయపరమైన చిక్కుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నామమాత్రపు ధరకు దేవాదాయశాఖకు సంబంధించిన షాపులను లీజుకు తీసుకుని తిరిగి వాటిని అధిక అద్దెకు సబ్లీజుకు ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆలయ భూముల ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి పెట్టాలన్నారు. ఉద్యోగుల పే స్కేల్ విషయంలో వారి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. దేవాలయాల్లో ప్లాస్టిక్ నిషేధం దేవాలయాల్లో ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు, ప్రత్యమ్నాయ మార్గాలను చూడాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించాలన్నారు. ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆలయాల్లో స్వామి వారికి సరిగా ధూపదీపం అందుతుందో లేదో అనే విషయంలో అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. దేవాలయాల్లో ఆర్జిత సేవల నుంచి గదులను ఫోన్ ద్వారానే బుక్ చేసుకునేలా సేవలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఆలయాల్లో దశలవారీగా బెల్లంతో తయారు చేసిన లడ్డూలను అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ శ్రీనివాసరావు, రీజినల్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి, హైదరాబాద్, వరంగల్ జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, వివిధ జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు, ఈవోలు పాల్గొన్నారు. యాదాద్రి కల్యాణ మండప భవనం ప్రారంభోత్సవం బర్కత్‌పురాలోని రూ.8 కోట్లతో నిర్మించిన యాదాద్రి సమాచార కేంద్రం, కల్యాణ మండప భవనాన్ని శుక్రవారం రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, శాసన మండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారిలతో కలసి ఆయన ప్రారంభించారు. భవన ప్రారంభం అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం ప్రసాదం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, ఈవో గీత, ఫౌండర్ ట్రస్టీ నర్సింహమూర్తి, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, దైవజ్ఞ శర్మ తదితరులు ఉన్నారు. -
గ్రేటర్లో గ‘లీజు’ స్కామ్ ?
సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో లీజు భూములు మాయమవుతున్నాయి. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్సుల్లోని దుకాణాలు సైతం తగ్గుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎస్టేట్ విభానికి చెందిన ఆస్తుల్లో ఏవి ఎవరి పరిధిలో ఉన్నాయో.. ఎన్ని మాయమయ్యాయో తెలియని పరిస్థితి. అధికారుల వద్ద సైతం ఇందుకు సంబంధించి స్పష్టమైన వివరాల్లేవు. షాపింగ్ కాంప్లెక్సులు, మున్సిపల్ మార్కెట్లు, లీజుకిచ్చిన భూముపై జీహెచ్ఎంసీ చాలాకాలంగా తగిన శ్రద్ధ చూపకపోవడంతో సదరు ఆస్తులు ఎవరికి లీజుకిచ్చారో, అవి ఎక్కడున్నాయో...వాటిల్లో ఎవరుంటున్నారో కూడా తెలియని పరిస్థితి. ఇది ఒక వైపు దృశ్యమైతే..జీహెచ్ఎంసీ లీజుకిచ్చిన దుకాణాల్లో థర్డ్‌పార్టీల వారుంటున్నప్పటికీ వారిని ఖాళీ చేయించే చర్యల్లేవు. అంతే కాదు రావాల్సిన అద్దెల్ని సైతం వసూలు చేయలేకపోతున్నారు. ఇటీవలే ఈ విభాగంపై దృష్టి సారించిన అధికారులు రావాల్సిన అద్దె బకాయిలే రూ. 20 కోట్లకు పైగా ఉన్నట్లు గుర్తించడం గమనార్హం. వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ సాంకేతిక విధానాలను అనసరిస్తోన్న జీహెచ్ఎంసీ.. సొంత ఆస్తుల ద్వారా రావాల్సిన ఆదాయాన్ని మాత్రం పట్టించుకోకపోవడం విశేషం. ఆస్తులు బోలెడు.. వివరాల్లేవ్.. ! నగరంలోని వివిధ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీకి అత్యంత విలువైన ఆస్తులెన్నో ఉన్నాయి. వాటికి సంబంధించి సరైన రికార్డుల నిర్వహణ లేదు.నాలుగేళ్ల క్రితం ఈ విభాగం బాధ్యతలు నిర్వహించిన ఐఏఎస్ అధికారిణి .. దీనిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించగానే ఆమె బదిలీపై వెళ్లారు. మరో ఇద్దరు ఎస్టేట్ ఆఫీసర్లు సైతం మొత్తం లీజు భూములను గుర్తించి కంప్యూటరీకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ, కార్యరూపం దాల్చకుండానే బదిలీ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన వారెవరూ ఎక్కువకాలం లేకపోవడంతో జీహెచ్ఎంసీ ఆస్తుల గురించి పట్టించుకున్నవారు లేరు. ఆదినుంచీ ఈ విభాగంపై అధికారుల నిర్లక్ష్యం, రికార్డుల్లేకపోవడం తదితర కారణాల వల్ల జీహెచ్ఎంసీ వద్ద సరైన వివరాల్లేవు. 272 నుంచి 86కు తగ్గిన ఆస్తులు.. నాలుగేళ్ల క్రితం అధికారులు చేపట్టిన చర్యలతో 272 ఆస్తులు లీజులో ఉన్నట్లు గుర్తించిన ప్పటికీ, అందులో 104 ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని మాత్రం రికార్డు చేయగలిగారు. ప్రస్తుతం ఆ సమాచారం కూడా లేదు. కేవలం 86 ఆస్తుల వివరాలు మాత్రమే ఉన్నాయి. థర్డ్ పార్టీల గుప్పిట్లోనే ఎక్కువ దుకాణాలు .. ప్రజా సదుపాయం కోసం మున్సిపల్ కాంప్లెక్సుల్లోని దుకాణాలను ఏళ్ల క్రితం తక్కువ ధరలకు అద్దెకిచ్చారు. అయితే వాటిల్లో అద్దెదారులుండటం లేరు. వారు రెండు మూడు రెట్లు ఎక్కువ ధరలకు థర్డ్‌పార్టీలకు అద్దెకిచ్చుకున్నారు. అయినా జీహెచ్ఎంసీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ దుకాణాల్లో వైన్స్ షాప్ కూడా సాగుతుండటంతో పరిసరాల్లోనే తాగుబోతులు తిష్ట వేస్తున్నారు. నిబంధనలకు చెల్లు.. చట్టాలకు తూట్లు.. వీటిల్లో చాలా దుకాణాలు 25 ఏళ్లకు పైగా ఒకరిపేరుమీదే ఉన్నా పట్టించుకోలేదు. మునిసిపల్ చట్టాలు, జీహెచ్ఎంసీ నిబంధనల మేరకు 25 ఏళ్లకు మించి లీజుకు ఉంటున్న వారిని ఖాళీ చేయించాలి. జీహెచ్ఎంసీ ఎస్టేట్స్‌కు చెందిన మార్కెట్లు, కాంప్లెక్స్‌ల్లో ఈ గడువు ముగిసిపోయిన వారు 886 మంది ఉన్నారు. సిబ్బంది లేమి.. ఎస్టేట్స్ విభాగానికి 30 మంది అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్స్, 30 మంది రెంట్ కలెక్టర్లు అవసరం కాగా..సిబ్బంది లేరు. ప్రధాన కార్యాలయంలో పది మంది ఉండాల్సిన చోట నలుగురితోనే నెట్టుకొస్తున్నారు. ఆయా దుకాణాల నుంచి అద్దెల వసూళ్ల బాధ్యతలు సర్కిళ్లలోని డిప్యూటీ కమిషనర్లకు అప్పగించారు. సర్కిళ్లలో ఈ అద్దెలు వసూళ్లు చేసేందుకు సిబ్బంది లేరు. దీంతో కోట్ల ఆదాయానికి గండిపడుతోంది. సికింద్రాబాద్ హరిహర కళాభవన్ షాపింగ్ కాంప్లెక్స్‌లో జీహెచ్ఎంసీ నిర్ణయించిన షాపుల అద్దెలు నెలకు దాదాపు రూ. 6 వేలు కాగా, ఏళ్ల క్రితం దాన్ని దక్కించుకున్న వ్యక్తులు ఇతరులకు రూ. 25 వేలకు అద్దెలకిచ్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. వీటిల్లోనే ఒక వైన్‌షాప్ కూడా నడుస్తోంది.శిథిలావస్థలోని షాపింగ్కాంప్లెక్సుల్లోని దుకాణాలను కూల్చడం వల్ల దుకాణాల సంఖ్య తగ్గినప్పటికీ, లీజు భూముల సంఖ్య ఎలా తగ్గిందో అర్థంకావడం లేదు?! ఆయా ప్రాంతాల్లో, ఆయా వ్యక్తులు, సంస్థలకు జీహెచ్ఎంసీ లీజుకిచ్చిన భూముల విస్తీర్ణం చదరపు గజాల్లో... లారీ యూనియన్ పార్కింగ్ స్టాండ్ : 2790 ఆర్య హైస్కూల్, కాలికబర్ : 1040 ఏపీఎస్ ఆర్టీసీ కి సనత్‌నగర్‌లో : రెండు భాగాలుగా 1508,1838 అరబిందో సొసైటీ : 794 వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ , బంజారాహిల్స్ : 260 ఫిల్మ్‌నగర్ కోఆపరేటివ్ సొసైటీ :16940 7.55 గజాల స్వల్ప స్థలం సైతం రికార్డుల్లో ఉన్నప్పటికీ, పెద్ద విస్తీర్ణంలోని పలు వివరాల్లేకపోవడం ఆశ్చర్యం గొలుపుతోంది. పైన పేర్కొన్న వాటిల్లో అరబిందో సొసైటీకిచ్చిన స్థలం ముషీరాబాద్ చౌరస్తాలోఉంది. ఇందులో ఒక అంతస్తులో ఒక జాతీయ బ్యాంకుతో పాటు మరో అంతస్తులో ఎక్సైజ్ శాఖ కార్యాలయం కూడా ఉండటం విశేషం. -
లీజు భూముల ఆక్రమణ
► రూ.500 కోట్ల విలువైన స్థలాలు కబ్జా ► 17 అసెస్మెంట్లు చేసిన కమిషనర్ ► మున్సిపల్ వైస్ చైర్మన్ , కౌన్సిలర్ల ఫిర్యాదుతో వెలుగులోకి.. ► సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఆగ్రహం ఆదిలాబాద్ కల్చరల్ : ఆదిలాబాద్ మున్సిపాల్టీ లీజు భూములు కబ్జాకు గురయ్యాయి. వందల కోట్ల విలువైన భూములు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. బల్దియా వైస్ చైర్మన్ , కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ –వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో కలెక్టర్ జ్యోతిబుద్ధ ప్రకాశ్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ స్టాండింగ్ అడ్వకేట్ హన్మంత్‌రావు, జేసీ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ అలివేలు మంగతాయారు, ఆదిలాబాద్ ఎమ్మార్వో, అసిస్టెంట్ ల్యాండ్ రికార్డు సర్వేయర్లతో ఇటీవల ప్రత్యేకంగా మూడు గంటలకు పైగా సమీక్ష సమావేశం నిర్వహించి.. లీజు భూముల ఆక్రమణపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారులతో కమిటీ వేసి తాను ప్రత్యక్షంగా దృష్టి సారిస్తానని పేర్కొన్నట్లు తెలిసింది. 45 నుంచి 25కు చేరిన లీజు భూములు ఆదిలాబాద్ మున్సిపాల్టీలో గతంలో 45 లీజు భూములు ఉండేవి. రాను రాను ప్రస్తుతం 24 భూములు మాత్రమే మిగిలాయి. ఇందులో ప్రధానంగా రూ.500 కోట్ల విలువైన భూములు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణంలో కోట్ల విలువైన మున్సిపల్ లీజు భూములు సిమెంట్ పైపు ఇండస్ట్రీస్ పేరుతో అర్పన్ లాల్ సూరికి 1968లో 15 ఏళ్లపాటు మున్సిపల్ అధికారులు లీజుకు ఇచ్చారు. లీజు గడువు ముగియడంతో అర్పన్ Sలాల్ సూరి మళ్లీ 1984లో లీజు గడువు పొడగింపునకు దరాఖాస్తు చేశారు. ఆ గడువు 1989 వరకు పొడగిస్తూ మున్సిపల్ కౌన్సిల్ నంబరు 62తో తీర్మానించింది. 1989 నుంచి 2016 వరకు లీజు డబ్బులు రూ.8,44,553 అర్పన్ Sలాల్ సూరి బకాయి పడ్డాడు. బకాయి చెల్లించాలని కమిషనర్ అలివేలు మంగతాయారు 17 నవంబర్ 2016న అండర్ సెక్షన్ 194 ఆఫ్ ఏపీఎం యాక్టు 1965 ప్రకారం నోటీసులు అందజేశారు. లీజు కట్టని పక్షంలో మున్సిపల్ ఆధీనంలోకి తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో అర్పన్ లాల్ సూరి భూమి, అక్కడి స్థలం తమదేనని లీజు చెల్లించనని, ఇది మున్సిపల్ స్థలం కాదని తిరిగి బదులు ఇచ్చారు. లీజు భూములకు 17 అసెస్మెంట్లు చేసిన కమిషనర్ అర్పన్ లాల్ సూరి లీజు ల్యాండ్ మున్సిపాలిటీదే అయినప్పటికీ 2006లో అప్పటి రెవెన్యూ అధికారులు, కుమ్మక్కై వారు కుటుంబ సభ్యుల పేరిట ఐదు పట్టాలు అందించారు. ఒక్కో పట్టాకు రూ.96 వేలు తీసుకుని, రెగ్యులరైజేషన్ ఆఫ్ ఇంక్రోచ్మెంట్ కింద పట్టాలు ఇచ్చారు. అప్పటి మున్సిపల్ కమిషనర్ వాటికి నోఆబ్జక్షన్ కాపీని అందించడం గమనార్హం. జీవో నంబర్ 508 ప్రకారం చిన్న ఇల్లు ఉన్నవారికి మాత్రమే ఇటువంటి జీవో వర్తిస్తుంది. కమర్షియల్ బిల్డింగ్‌లకు ఇది వర్తించదు. నిబంధనల ప్రకారం 480 గజాలు ఉన్న భూములకు సైతం ఈ జీవో వర్తించదు. దీంతోపాటు సర్వే నంబర్ 1 ప్రాంతం చెరువు ప్రాంతంగా గుర్తించారు. చెరువు ఉన్న ప్రాంతంలో పట్టాలను నిబంధనలకు విరుద్ధంగా అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అర్పన్ లాల్ సూరికి ప్రస్తుత కమిషనర్ నోటీసులు అందించిన తర్వాత 16 ఫిబ్రవరి 2017లో అర్పన్ లాల్ సూరి సబ్ లీజర్ల పేరిట 17 మందికి అసెస్మెంట్లు చేయడం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్ కల్పించుకోని పక్షంలో వందల కోట్ల లీజు ల్యాండ్లు కబ్జాదారుల చేతిలోకి వెళ్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినోదానికి ఇస్తే కమర్షియల్ చేశారు... మున్సిపల్ పరిధిలోని లీజు ల్యాండ్ 2002లో గణేశ్ థియేటర్ వినోదం కోసం దండ మహేశ్ పేరుపై లీజుకు ఇచ్చారు. దీని గడువు 2007లో ముగిసింది. తిరిగి 2007లో 17ఏళ్లపాటు పొడగించారు. ప్రస్తుతం 2017 మేలో లీజు గడువు ముగియనుంది. ఈ లీజుల్యాండ్ థియేటర్ నిర్వహణ కోసం వినోదం కోసం అప్పటి కలెక్టర్ సుకుమార్ అప్పగించారు. థియేటర్ నిర్వాహకులు దాని ముందర కమర్షియల్‌గా 29 దుకాణాలు నిర్మించి.. ఒక్కో దుకాణదారు నుంచి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు తీసుకుంటూ, అడ్వాన్స్ గా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు తీసుకుంటున్నారు. సంవత్సరానికి రూ.కోటిపైగా ఆర్జిస్తూ మున్సిపాలిటీకి మాత్రం రూ.7.80 లక్షలు చెల్లిస్తున్నారు. ఫలితంగా ఏడాదికి రూ.కోటిపైగా మున్సిపాలిటీ నష్టపోతోంది. ఏళ్లుగా సాగుతున్న ఈ తంతు రానున్న మేలో గడువు ముగియనుంది. అధికారులు దృష్టి సారించి లీజు గడువును పొడగించకుండా మున్సిపాలిటీ ఆదాయాన్ని పరిరక్షించాలి్సందిగా ప్రజలు కోరుతున్నారు. మరింత ఆక్రమణలు.. మున్సిపాలిటీలో అప్రూవల్ లే ఔట్లు, బహిరంగ స్థలాలు, పార్కింగ్ స్థలాలు కబ్జాకు గురవుతున్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని స్పిన్నింగ్ మిల్లు సమీపంలో యాక్షన్ ప్లాటు నం.1, నం.2లో మున్సిపల్ ఇచ్చిన విస్తీర్ణం కంటే అదనంగా ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే తరహాలో పట్టణ నడిబొడ్డున వేల కోట్ల విలువ చేసే ద్వారకానగర్‌లోని రఘునాథ్ మిట్టల్ కేరాఫ్ జీఎన్ రావు పెట్రోల్ బంక్ ప్రాంతంలో మున్సిపాలిటీ రోడ్డు స్థలం ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ స్థలంలో జిల్లాకు చెందిన బడానేత హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి.