లీజు భూముల ఆక్రమణ | The occupation of lease land | Sakshi
Sakshi News home page

లీజు భూముల ఆక్రమణ

Published Fri, Mar 10 2017 10:56 PM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

The occupation of lease  land

► రూ.500 కోట్ల విలువైన  స్థలాలు కబ్జా
► 17 అసెస్మెంట్లు చేసిన కమిషనర్‌
►  మున్సిపల్‌ వైస్‌ చైర్మన్ , కౌన్సిలర్ల ఫిర్యాదుతో వెలుగులోకి..
►  సమీక్ష సమావేశంలో  కలెక్టర్‌ ఆగ్రహం


ఆదిలాబాద్‌ కల్చరల్‌ : ఆదిలాబాద్‌ మున్సిపాల్టీ లీజు భూములు కబ్జాకు గురయ్యాయి. వందల కోట్ల విలువైన భూములు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. బల్దియా వైస్‌ చైర్మన్ , కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ –వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

దీంతో కలెక్టర్‌ జ్యోతిబుద్ధ ప్రకాశ్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్‌ స్టాండింగ్‌ అడ్వకేట్‌ హన్మంత్‌రావు, జేసీ కృష్ణారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ అలివేలు మంగతాయారు, ఆదిలాబాద్‌ ఎమ్మార్వో, అసిస్టెంట్‌ ల్యాండ్‌ రికార్డు సర్వేయర్‌లతో ఇటీవల ప్రత్యేకంగా మూడు గంటలకు పైగా సమీక్ష సమావేశం నిర్వహించి.. లీజు భూముల ఆక్రమణపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారులతో కమిటీ వేసి తాను ప్రత్యక్షంగా దృష్టి సారిస్తానని పేర్కొన్నట్లు తెలిసింది.

45 నుంచి 25కు చేరిన లీజు భూములు
ఆదిలాబాద్‌ మున్సిపాల్టీలో గతంలో 45 లీజు భూములు ఉండేవి. రాను రాను ప్రస్తుతం 24 భూములు మాత్రమే మిగిలాయి. ఇందులో ప్రధానంగా రూ.500 కోట్ల విలువైన భూములు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణంలో కోట్ల విలువైన మున్సిపల్‌ లీజు భూములు సిమెంట్‌ పైపు ఇండస్ట్రీస్‌ పేరుతో అర్పన్ లాల్‌ సూరికి 1968లో 15 ఏళ్లపాటు మున్సిపల్‌ అధికారులు లీజుకు ఇచ్చారు.

లీజు గడువు ముగియడంతో అర్పన్ Sలాల్‌ సూరి మళ్లీ 1984లో లీజు గడువు పొడగింపునకు దరాఖాస్తు చేశారు. ఆ గడువు 1989 వరకు పొడగిస్తూ మున్సిపల్‌ కౌన్సిల్‌ నంబరు 62తో తీర్మానించింది. 1989 నుంచి 2016 వరకు లీజు డబ్బులు రూ.8,44,553 అర్పన్ Sలాల్‌ సూరి బకాయి పడ్డాడు. బకాయి చెల్లించాలని కమిషనర్‌ అలివేలు మంగతాయారు 17 నవంబర్‌ 2016న  అండర్‌ సెక్షన్ 194 ఆఫ్‌ ఏపీఎం యాక్టు 1965 ప్రకారం నోటీసులు అందజేశారు. లీజు కట్టని పక్షంలో మున్సిపల్‌ ఆధీనంలోకి తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో అర్పన్ లాల్‌ సూరి భూమి, అక్కడి స్థలం తమదేనని లీజు చెల్లించనని, ఇది మున్సిపల్‌ స్థలం కాదని తిరిగి బదులు ఇచ్చారు.

లీజు భూములకు 17 అసెస్మెంట్లు చేసిన కమిషనర్‌
అర్పన్ లాల్‌ సూరి లీజు ల్యాండ్‌ మున్సిపాలిటీదే అయినప్పటికీ 2006లో అప్పటి రెవెన్యూ అధికారులు, కుమ్మక్కై వారు కుటుంబ సభ్యుల పేరిట ఐదు పట్టాలు అందించారు. ఒక్కో పట్టాకు రూ.96 వేలు తీసుకుని, రెగ్యులరైజేషన్  ఆఫ్‌ ఇంక్రోచ్‌మెంట్‌ కింద పట్టాలు ఇచ్చారు. అప్పటి మున్సిపల్‌ కమిషనర్‌ వాటికి నోఆబ్జక్షన్ కాపీని అందించడం గమనార్హం. జీవో నంబర్‌ 508 ప్రకారం చిన్న ఇల్లు ఉన్నవారికి మాత్రమే ఇటువంటి జీవో వర్తిస్తుంది. కమర్షియల్‌ బిల్డింగ్‌లకు ఇది వర్తించదు.

నిబంధనల ప్రకారం 480 గజాలు ఉన్న భూములకు సైతం ఈ జీవో వర్తించదు. దీంతోపాటు సర్వే నంబర్‌ 1 ప్రాంతం చెరువు ప్రాంతంగా గుర్తించారు. చెరువు ఉన్న ప్రాంతంలో పట్టాలను నిబంధనలకు విరుద్ధంగా అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అర్పన్ లాల్‌ సూరికి ప్రస్తుత కమిషనర్‌ నోటీసులు అందించిన తర్వాత 16  ఫిబ్రవరి 2017లో అర్పన్ లాల్‌ సూరి సబ్‌ లీజర్ల పేరిట 17 మందికి అసెస్మెంట్లు చేయడం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్‌ కల్పించుకోని పక్షంలో వందల కోట్ల లీజు ల్యాండ్లు కబ్జాదారుల చేతిలోకి వెళ్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వినోదానికి ఇస్తే కమర్షియల్‌ చేశారు...
మున్సిపల్‌ పరిధిలోని లీజు ల్యాండ్‌ 2002లో గణేశ్‌ థియేటర్‌ వినోదం కోసం దండ మహేశ్‌ పేరుపై లీజుకు ఇచ్చారు. దీని గడువు 2007లో ముగిసింది. తిరిగి 2007లో 17ఏళ్లపాటు పొడగించారు. ప్రస్తుతం 2017 మేలో లీజు గడువు ముగియనుంది. ఈ లీజుల్యాండ్‌ థియేటర్‌ నిర్వహణ కోసం వినోదం కోసం అప్పటి కలెక్టర్‌ సుకుమార్‌ అప్పగించారు.

థియేటర్‌ నిర్వాహకులు దాని ముందర కమర్షియల్‌గా 29 దుకాణాలు నిర్మించి.. ఒక్కో దుకాణదారు నుంచి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు తీసుకుంటూ, అడ్వాన్స్ గా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు తీసుకుంటున్నారు. సంవత్సరానికి రూ.కోటిపైగా ఆర్జిస్తూ మున్సిపాలిటీకి మాత్రం రూ.7.80 లక్షలు చెల్లిస్తున్నారు. ఫలితంగా ఏడాదికి రూ.కోటిపైగా మున్సిపాలిటీ నష్టపోతోంది. ఏళ్లుగా సాగుతున్న ఈ తంతు రానున్న మేలో గడువు ముగియనుంది. అధికారులు దృష్టి సారించి లీజు గడువును పొడగించకుండా మున్సిపాలిటీ ఆదాయాన్ని పరిరక్షించాలి్సందిగా ప్రజలు కోరుతున్నారు.

మరింత ఆక్రమణలు..
మున్సిపాలిటీలో అప్రూవల్‌ లే ఔట్లు, బహిరంగ స్థలాలు, పార్కింగ్‌ స్థలాలు కబ్జాకు గురవుతున్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని స్పిన్నింగ్‌ మిల్లు సమీపంలో యాక్షన్  ప్లాటు నం.1, నం.2లో మున్సిపల్‌ ఇచ్చిన విస్తీర్ణం కంటే అదనంగా ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే తరహాలో పట్టణ నడిబొడ్డున వేల కోట్ల విలువ చేసే ద్వారకానగర్‌లోని రఘునాథ్‌ మిట్టల్‌ కేరాఫ్‌ జీఎన్ రావు పెట్రోల్‌ బంక్‌ ప్రాంతంలో మున్సిపాలిటీ రోడ్డు స్థలం ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ స్థలంలో జిల్లాకు చెందిన బడానేత హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement