గ్రేటర్‌లో గ‘లీజు’ స్కామ్‌ ? | Lease lands are disappearing | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లో గ‘లీజు’ స్కామ్‌ ?

Published Thu, Jun 1 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM

గ్రేటర్‌లో గ‘లీజు’ స్కామ్‌ ?

గ్రేటర్‌లో గ‘లీజు’ స్కామ్‌ ?

సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో లీజు భూములు మాయమవుతున్నాయి. మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్సుల్లోని దుకాణాలు సైతం తగ్గుతున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎస్టేట్‌ విభానికి చెందిన ఆస్తుల్లో ఏవి ఎవరి పరిధిలో ఉన్నాయో.. ఎన్ని మాయమయ్యాయో తెలియని పరిస్థితి. అధికారుల వద్ద సైతం ఇందుకు సంబంధించి స్పష్టమైన వివరాల్లేవు.  షాపింగ్‌ కాంప్లెక్సులు, మున్సిపల్‌ మార్కెట్లు, లీజుకిచ్చిన భూముపై జీహెచ్‌ఎంసీ  చాలాకాలంగా తగిన శ్రద్ధ చూపకపోవడంతో సదరు ఆస్తులు ఎవరికి లీజుకిచ్చారో,  అవి ఎక్కడున్నాయో...వాటిల్లో ఎవరుంటున్నారో కూడా తెలియని పరిస్థితి. ఇది ఒక వైపు దృశ్యమైతే..జీహెచ్‌ఎంసీ లీజుకిచ్చిన దుకాణాల్లో థర్డ్‌పార్టీల వారుంటున్నప్పటికీ వారిని ఖాళీ చేయించే చర్యల్లేవు. అంతే కాదు రావాల్సిన అద్దెల్ని సైతం వసూలు చేయలేకపోతున్నారు. ఇటీవలే ఈ విభాగంపై దృష్టి సారించిన అధికారులు రావాల్సిన అద్దె బకాయిలే రూ. 20 కోట్లకు పైగా ఉన్నట్లు గుర్తించడం గమనార్హం.  వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ సాంకేతిక విధానాలను అనసరిస్తోన్న జీహెచ్‌ఎంసీ.. సొంత ఆస్తుల ద్వారా రావాల్సిన ఆదాయాన్ని మాత్రం పట్టించుకోకపోవడం విశేషం.

ఆస్తులు బోలెడు.. వివరాల్లేవ్‌.. !
నగరంలోని వివిధ ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీకి అత్యంత విలువైన ఆస్తులెన్నో ఉన్నాయి. వాటికి సంబంధించి సరైన రికార్డుల నిర్వహణ లేదు.నాలుగేళ్ల క్రితం ఈ విభాగం బాధ్యతలు నిర్వహించిన ఐఏఎస్‌ అధికారిణి .. దీనిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించగానే ఆమె బదిలీపై వెళ్లారు. మరో ఇద్దరు ఎస్టేట్‌ ఆఫీసర్లు సైతం మొత్తం లీజు భూములను గుర్తించి కంప్యూటరీకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ, కార్యరూపం దాల్చకుండానే బదిలీ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన వారెవరూ ఎక్కువకాలం లేకపోవడంతో జీహెచ్‌ఎంసీ ఆస్తుల గురించి పట్టించుకున్నవారు లేరు.  ఆదినుంచీ ఈ విభాగంపై అధికారుల నిర్లక్ష్యం, రికార్డుల్లేకపోవడం తదితర కారణాల వల్ల  జీహెచ్‌ఎంసీ వద్ద సరైన వివరాల్లేవు.

272 నుంచి 86కు తగ్గిన ఆస్తులు..
నాలుగేళ్ల క్రితం అధికారులు చేపట్టిన చర్యలతో 272 ఆస్తులు లీజులో ఉన్నట్లు గుర్తించిన ప్పటికీ, అందులో 104 ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని మాత్రం రికార్డు చేయగలిగారు. ప్రస్తుతం ఆ సమాచారం కూడా లేదు. కేవలం 86 ఆస్తుల వివరాలు మాత్రమే ఉన్నాయి.

థర్డ్‌ పార్టీల గుప్పిట్లోనే ఎక్కువ దుకాణాలు ..
ప్రజా సదుపాయం కోసం మున్సిపల్‌ కాంప్లెక్సుల్లోని దుకాణాలను ఏళ్ల క్రితం తక్కువ ధరలకు అద్దెకిచ్చారు. అయితే వాటిల్లో అద్దెదారులుండటం లేరు. వారు రెండు మూడు రెట్లు ఎక్కువ ధరలకు థర్డ్‌పార్టీలకు అద్దెకిచ్చుకున్నారు. అయినా జీహెచ్‌ఎంసీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ దుకాణాల్లో వైన్స్‌ షాప్‌  కూడా సాగుతుండటంతో పరిసరాల్లోనే తాగుబోతులు తిష్ట వేస్తున్నారు.  

నిబంధనలకు చెల్లు.. చట్టాలకు తూట్లు..
వీటిల్లో చాలా దుకాణాలు 25 ఏళ్లకు పైగా ఒకరిపేరుమీదే ఉన్నా పట్టించుకోలేదు. మునిసిపల్‌ చట్టాలు, జీహెచ్‌ఎంసీ నిబంధనల మేరకు 25 ఏళ్లకు మించి లీజుకు ఉంటున్న వారిని ఖాళీ చేయించాలి. జీహెచ్‌ఎంసీ ఎస్టేట్స్‌కు చెందిన మార్కెట్లు, కాంప్లెక్స్‌ల్లో ఈ గడువు ముగిసిపోయిన వారు 886 మంది ఉన్నారు.

సిబ్బంది లేమి..
ఎస్టేట్స్‌ విభాగానికి 30 మంది అసిస్టెంట్‌ ఎస్టేట్‌ ఆఫీసర్స్, 30 మంది రెంట్‌ కలెక్టర్లు  అవసరం కాగా..సిబ్బంది లేరు. ప్రధాన కార్యాలయంలో పది మంది ఉండాల్సిన చోట నలుగురితోనే నెట్టుకొస్తున్నారు. ఆయా దుకాణాల నుంచి అద్దెల వసూళ్ల బాధ్యతలు సర్కిళ్లలోని డిప్యూటీ కమిషనర్లకు అప్పగించారు. సర్కిళ్లలో ఈ అద్దెలు  వసూళ్లు చేసేందుకు సిబ్బంది లేరు. దీంతో కోట్ల ఆదాయానికి గండిపడుతోంది.

సికింద్రాబాద్‌  హరిహర కళాభవన్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో జీహెచ్‌ఎంసీ నిర్ణయించిన షాపుల అద్దెలు నెలకు దాదాపు  రూ. 6 వేలు కాగా,  ఏళ్ల క్రితం దాన్ని దక్కించుకున్న వ్యక్తులు ఇతరులకు రూ. 25 వేలకు అద్దెలకిచ్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. వీటిల్లోనే ఒక వైన్‌షాప్‌ కూడా నడుస్తోంది.శిథిలావస్థలోని షాపింగ్‌కాంప్లెక్సుల్లోని దుకాణాలను కూల్చడం వల్ల దుకాణాల సంఖ్య తగ్గినప్పటికీ, లీజు భూముల సంఖ్య ఎలా తగ్గిందో అర్థంకావడం లేదు?!

ఆయా ప్రాంతాల్లో, ఆయా వ్యక్తులు, సంస్థలకు  జీహెచ్‌ఎంసీ లీజుకిచ్చిన భూముల విస్తీర్ణం చదరపు గజాల్లో...

లారీ యూనియన్‌
పార్కింగ్‌ స్టాండ్‌ : 2790
ఆర్య హైస్కూల్, కాలికబర్‌  : 1040  
ఏపీఎస్‌ ఆర్టీసీ కి  సనత్‌నగర్‌లో :  
రెండు భాగాలుగా  1508,1838
అరబిందో సొసైటీ : 794
వజీర్‌ సుల్తాన్‌ టొబాకో
కంపెనీ , బంజారాహిల్స్‌ : 260  
ఫిల్మ్‌నగర్‌ కోఆపరేటివ్‌
సొసైటీ  :16940

7.55 గజాల స్వల్ప స్థలం సైతం రికార్డుల్లో ఉన్నప్పటికీ,  పెద్ద విస్తీర్ణంలోని పలు వివరాల్లేకపోవడం ఆశ్చర్యం గొలుపుతోంది. పైన పేర్కొన్న వాటిల్లో అరబిందో సొసైటీకిచ్చిన స్థలం ముషీరాబాద్‌ చౌరస్తాలోఉంది. ఇందులో ఒక అంతస్తులో  ఒక జాతీయ బ్యాంకుతో పాటు మరో అంతస్తులో ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం కూడా ఉండటం విశేషం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement