lecturer ghouse mohiuddin
-
మూడు రోజుల కస్టడీ.. నాలుగు గంటల విచారణ
ఏలూరు(వన్ టౌన్) : మూడు రోజుల పోలీసుల కస్టడీలో అనారోగ్యం సాకుతో రెండు రోజులు వృథా కాగా ఆఖరి రోజు కూడా మిగిలిన పూట గౌస్‌ను వైద్య పరీక్షలు చేసి కోర్టుకు తరలించేందుకు సరిపోయింది. ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ మాట్లాడాల్సి వచ్చిన ప్రతీసారి గొంతునొప్పి, ఛాతినొప్పి, రక్తపోటు సాకుతో పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. దీంతో పోలీసులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇన్ని రోజుల విచారణలో పోలీసులకు గౌస్ సహకరించిన సమయం కేవలం నాలుగైదు గంటలు మాత్రమే. కుటుంబ సభ్యులతో తన లాయర్‌తో చక్కగా మాట్లాడానికి ఆరోగ్యం సహకరించినప్పటికీ పోలీసులు ప్రశ్నలు అడిగే సమయానికి టంచనుగా రక్తపోటు వచ్చేస్తుంది. వైద్య పరీక్షల్లో సైతం ఏమీ లేదని, ఆరోగ్యంగా ఉన్నాడని తెలుస్తున్నా.. కిమ్మనకుండా ఉండిపోవడం తప్ప పోలీసులు ఏమీ చేయలేక పోయారు. కీలక సమాచారం రాబడతారనుకున్న పోలీసులు ఏమాత్రం వివరాలు రాబట్టలేక పోయారని తెలుస్తోంది. విచారణకు ఏమాత్రం సహకరించకుండా ఆధ్యంతం అనారోగ్యం సాకుతో పోలీసులకు, ఆస్పత్రి వైద్యులకు విలువైన సమయాన్ని గౌస్ వృథా చేసి మూడో రోజు డ్రామా ముగించి జైలుకు చేరుకున్నాడు. గౌస్‌ను కలిసిన నిఘా విభాగం డీఐజీ స్థాయి అధికారి వేరే ప్రాంతానికి చెందిన ఒక నిఘా విభాగానికి చెందిన డీఐజీ స్థాయి అధికారి గౌస్‌ను కలిసి మాట్లాడటం కలకలం రేపింది. రాత్రి సమయంలో ఎవరో ఒకరు వచ్చి గౌస్‌ను పరామర్శిచడం ఒక ఎత్తయితే శనివారం ఓ నిఘా విభాగపు ఉన్నత స్థాయి అధికారి వచ్చి వెళ్లాడన్న వార్త ఆస్పత్రిలో కలకలం సృష్టించింది. ఆ అధికారి కేసుకు సంబంధించిన వివరాల కోసమే వచ్చినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు అనంతరం కోర్టుకు తరలించి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జిల్లా జైలుకు తరలించారు. -
‘రేంజ్’ దాటిన గౌస్ లీలలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏలూరు.. గుంటూరు.. రాయలసీమ, తెలంగాణ.. ఇలా అన్ని పోలీసు రేంజ్‌ల్లోనూ సీఆర్ రెడ్డి కళాశాల లెక్చరర్ గౌస్‌మొహియిద్దీన్ ఉరఫ్ పోలీస్ బ్రోకర్ తన లీలలు సాగించినట్టు తెలుస్తోంది. గౌస్ ఫోన్ కాల్‌డేటా పరిశీలించిన పోలీసు అధికారులు అతనితో ఎక్కువసార్లు సంభాషించిన డీజీపీ కార్యాలయంలోని కం ప్యూటర్ విభాగం ఔట్సోర్సింగ్ ఉద్యోగి పిల్లి జస్టిన్ను ఏలూరు పిలిపించి విచారణ చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి టూటౌన్ పోలీసుల అదుపులోనే ఉన్న జస్టిన్ కీలక సమాచారాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది. ఐపీఎస్‌ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని డీజీపీ కార్యాలయం కంప్యూటర్ విభాగం నుంచి గౌస్‌కు చేరవేసినట్టు అతడు అంగీకరించినట్టు తెలిసింది. పోలీస్ డీఐజీల శాఖాపరమైన వివరాలను కూడా గౌస్‌కు చేరవేసిన విషయాన్ని జస్టిన్ ఒప్పుకున్నాడని అంటున్నారు. సీఆర్ రెడ్డి కళాశాలలో తన భార్య చదువుకుందని, అప్పట్లో తమ ప్రేమ వివాహాన్ని గౌస్ దగ్గరుండి జరిపించాడన్న కృతజ్ఞతతోనే తాను ఈ వివరాలన్నీ చేరవేశానని జస్టిన్ వివరించినట్టు తెలుస్తోంది. మరేవిధమైన దురుద్దేశం తనకు లేదని స్పష్టం చేశాడని అంటున్నారు. గుంటూరులో మరో రియల్ వివాదం గుంటూరు పోలీస్ రేంజ్ పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ గౌస్‌పై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే సిరిసంపద రియల్ వెంచర్ కేసుకు సంబంధించి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తుండగా, తాజాగా గుంటూరులోనూ ఓ కేసు నమోదుకు రంగం సిద్ధమవుతోంది. గుంటూరు నగరానికి సమీపంలోని నల్లపాడు ప్రాంతంలో రూ.మూడుకోట్ల విలువైన ఓ స్థల వివాదానికి సంబంధించి గౌస్ అడ్డగోలుగా సెటిల్మెంట్ చేసినట్టు తెలుస్తోంది. దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఓ బిల్డర్ ఆ స్థలాన్ని ఆక్రమించాడు. ఇదేమని ప్రశ్నించిన స్థలం యజమానిని గౌస్ సాయంతో గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురిచేశారు. గౌస్ చెప్పడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేయకుండానే 15 రోజులపాటు స్టేషన్లో ఉంచి లాఠీలకు పనిచెప్పడంతో చివరకు సదరు యజమాని స్థలం కాగితాలను గౌస్ వకాల్తా పుచ్చుకున్న బిల్డర్‌కు ఇచ్చి తప్పుకున్నాడు. ఈ పనిచేసినందుకు గాను సదరు బిల్డర్ గౌస్‌కు ఫోర్డ్ ఐకాన్ కారు బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. గౌస్ లీలలు ఇలా ఒక్కొక్కటిగా బయటపడటంతో సదరు బాధితుడు బయటకు అటు గుంటూరు, ఇటు ఏలూరు పోలీసులను ఆశ్రయించాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ గ్రానైట్ వివాదాన్ని సెటిల్మెంట్ చేసిన గౌస్‌కు ప్రస్తుతం గుంటూరులోనే ఉంటున్న ఓ వ్యాపారి ఇటీవలే ఇన్నోవా కారును బహుమతిగా ఇచ్చాడని తెలిసింది. ఆరు రోజుల కిందట అరెస్టయ్యే వరకు గౌస్ ఆ ఇన్నోవా వాహనాన్ని వాడేవాడని అంటున్నారు. సెలవుపై గౌస్ అనుచరులు ఇన్నాళ్లూ షాడో బాస్‌కు వేగుల్లా అన్నీ తామై వ్యవహరించిన ఏలూరులోని వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బంది పరిస్థితులు తారుమారు కావడంతో ఎటు తిరిగి ఎటొస్తుందోన్న భయంతో సెలవులు పెట్టేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఓ కానిస్టేబుల్, రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఓ కానిస్టేబుల్, సీసీఎస్‌లో పనిచేస్తున్న పలువురు కానిస్టేబుళ్లు పత్తా లేకుండా పోయారని పోలీసువర్గాలే అంటున్నాయి. గౌస్ కస్టడీ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా ఏలూరు (వన్ టౌన్) : గౌస్ మొహియిద్దీన్‌ను కస్టడీకి అప్పగించాలని కోరుతూ టూటౌన్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఓ నిరుద్యోగికి ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానన్న గౌస్ సొమ్ము తీసుకుని మోసం చేశాడంటూ ఒంగోలుకు చెందిన సూర్యప్రకాష్‌రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. వాదోపవాదాలు విన్న రెండో అదనపు జిల్లా జడ్జి ఎ.హరిహరనాథశర్మ విచారణను బుధవారానికి వాయిదా వేశారు. -
గౌస్ వెనుక ఆ ఇద్దరు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా పోలీస్ శాఖను కుది పేస్తూ.. రాష్ర్టంలోని కొంతమంది ఐపీఎస్ అధికారులకు వణుకు పుట్టిస్తున్న లెక్చరర్ గౌస్ మొహియిద్దీన్ అరెస్ట్ వ్యవహారంలో మరో కోణం వెలుగుచూస్తోంది. అటు డీఐజీ, ఇటు జిల్లా పోలీస్ కార్యాల యాల్లో పనిచేసే ఉద్యోగులే ఇంటిదొంగలుగా మారి కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు గౌస్‌కు అందజేశారని తెలుస్తోంది. ఆ సమాచారంతోనే అంతా తానే అన్నట్టు చక్రం తిప్పాడని అంటున్నారు. సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్ల బదిలీలకు సంబంధించిన నోట్లు, పదోన్నతులు, పనిష్మెంట్ల నోట్లు, అవార్డులు, రివార్డులు, సేవా, ప్రోత్సాహక పత్రాలకు సంబంధించిన జాబితాలను పోలీస్ కార్యాలయాల్లోని ఇద్దరు ఉద్యోగులు ముందుగానే గౌస్‌కు చేరవేసేవారని తెలుస్తోంది. ఉన్నతాధికారుల దృష్టికి తప్ప బయటకు రాకూడని ఈ జాబితా గౌస్ వద్ద ఉండటంతో ముందుగానే ఆయన ఆ జాబితాలో పేర్లున్న అధికారులకు, సిబ్బందికి ఫోన్లు చేసేవారని అంటున్నారు. ‘ఇదిగో నీకు ఈ పతకం వస్తోంది.. నేనే సిఫార్సు చేశా.. నీకు ప్రమోషన్ గ్యారంటీ.. నేనే మాట్లాడా.. ఫలానా చోటకు బదిలీ అవుతుంది.. నీపై ఉన్న పనిష్మెంట్ నోట్ ఎత్తివేయించా.. మీ పై అధికారులతో నేను మాట్లాడితేనే ఇవన్నీ జరుగుతున్నారుు’ అంటూ పోలీసులకు ముందుగానే సమాచారం చెప్పేవాడని తెలుస్తోంది. గౌస్ చెప్పినట్టే జరుగుతోందన్న అభిప్రాయానికి వచ్చిన సదరు అధికారులు ఆయనకు సలామ్ కొట్టేవారని అంటున్నారు. చివరకు గౌస్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలోనూ బదిలీ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు పోలీస్ అధికారులు భీమవరంలో గల గౌస్ ఇంట్లోనే ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం అనంతపురంలో పనిచేస్తూ నరసాపురం డీఎస్పీగా వచ్చేందుకు యత్నిస్తున్న ఓ అధికారి, గతంలో ఏలూరులో సీఐగా పనిచేసి ఇప్పుడు కృష్ణాజిల్లా దివిసీమలో పనిచేస్తున్న ఓ సీఐ గౌస్ అరెస్ట్ సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారని చెబుతున్నారు. అరెస్ట్ విషయం ముందే తెలుసా తనపై పోలీసులు వల పన్నుతున్నారని గౌస్‌కు ముందే సమాచారం ఉందని అంటున్నారు. ఒంగోలుకు చెందిన కె.సూర్యప్రకాష్‌రెడ్డి ఫిర్యాదు చేసిన వెంటనే ఆ విషయాన్ని కొంతమంది ఇంటిదొంగలు ఆయనకు చేరవేశారని తెలిసింది. ఫిర్యాదుపై ఎంతో కొంత పోలీస్ యాక్షన్ ఉంటుందని భావిం చారే కానీ.. తనను అరెస్ట్ చేసి రోడ్డుకీడుస్తారని మాత్రం గౌస్ ఊహించలేదని అంటున్నారు. ఊహిస్తే జాగ్రత్త పడేవాడని పోలీస్ వర్గాలంటున్నారుు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ప్రత్యేక బృందాలు గౌస్ మేనేజింగ్ పార్టనర్‌గా వ్యవహరిస్తున్న సిరిసంపద రియల్ ఎస్టేట్ వ్యవహారానికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం పొందేందుకు పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. నెల్లూరులోని సంగం ప్రాంతంలో కూడా రియల్ వెంచర్ పేరి ట గౌస్ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఈ మేరకు జిల్లా పోలీస్ అధికారులు ఆయా జిల్లాల ఎస్పీలకు సమాచారం ఇచ్చారు. అక్రమార్జనతో ఆస్తులు సంపాదించుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఆస్తి వివరాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులను కూడా సంప్రదించాలని పోలీసులు భావిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో చేరిక గౌస్ మొహియిద్దీన్ ప్రస్తుతం గుంటూ రు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనికి గొంతు క్యాన్సర్ ఉండటం, అనారోగ్యం బారిన పడ టంతో ఏలూరు సబ్‌జైల్ నుంచి ముందుగా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి, మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. కస్టడీ, బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొం దుతున్న గౌస్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం ఏలూరు కోర్టులో విచారణ జరగనుంది. అదేవిధంగా మరిన్ని కేసుల సమాచారం కోసం నిందితుడు గౌస్‌ను విచారించేందుకు పోలీస్ అధికారులు కస్టడీ కోరుతూ కోర్టులో వేసిన పిటిషన్‌పైనా అదేరోజు విచారణ జరగనుంది. ఆ డైరీలో ఏముంది గౌస్‌మొహియిద్దీన్ ఇంటినుంచి పోలీస్‌లు స్వాధీనం చేసుకున్న డైరీ కలకలం రేపుతోంది. ఆయన రాసుకున్న డైరీలో చాలామంది ఐపీఎస్‌ల తలరాతలు ఉన్నట్టు సమాచారం. తాను ఎవరెవరికి పనిచేసి పెట్టింది, తనతో ఎవరు సన్నిహితంగా ఉంటారు, ఎవరు దూరంగా ఉంటారు వంటి వివరాలు అందు లో పొందుపరిచినట్టు భోగట్టా. ఈ నేపథ్యంలో గౌస్‌కు ఏయే పోలీస్ అధికారులతో సంబంధాలు ఉన్నాయనే దానిపై డైరీలోని వివరాలు ఉపయోగపడతాయని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సెల్ ఫోన్ కాల్ డేటాతోపాటు ఆయన ఏయే పోలీస్ అధికారులకు మెసేజ్ లు ఇచ్చారు, ఎవరు రిప్లై ఇచ్చారనే అంశాలపైనా విచారణ చేస్తున్నారు.