‘రేంజ్’ దాటిన గౌస్ లీలలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏలూరు.. గుంటూరు.. రాయలసీమ, తెలంగాణ.. ఇలా అన్ని పోలీసు రేంజ్‌ల్లోనూ సీఆర్ రెడ్డి కళాశాల లెక్చరర్ గౌస్‌మొహియిద్దీన్ ఉరఫ్ పోలీస్ బ్రోకర్ తన లీలలు సాగించినట్టు తెలుస్తోంది. గౌస్ ఫోన్ కాల్‌డేటా పరిశీలించిన పోలీసు అధికారులు అతనితో ఎక్కువసార్లు సంభాషించిన డీజీపీ కార్యాలయంలోని కం ప్యూటర్ విభాగం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి పిల్లి జస్టిన్‌ను ఏలూరు పిలిపించి విచారణ చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి టూటౌన్ పోలీసుల అదుపులోనే ఉన్న జస్టిన్ కీలక సమాచారాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది. ఐపీఎస్‌ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని డీజీపీ కార్యాలయం కంప్యూటర్ విభాగం నుంచి గౌస్‌కు చేరవేసినట్టు అతడు అంగీకరించినట్టు తెలిసింది. పోలీస్ డీఐజీల శాఖాపరమైన వివరాలను కూడా గౌస్‌కు చేరవేసిన విషయాన్ని జస్టిన్ ఒప్పుకున్నాడని అంటున్నారు. సీఆర్ రెడ్డి కళాశాలలో తన భార్య చదువుకుందని, అప్పట్లో తమ ప్రేమ వివాహాన్ని గౌస్ దగ్గరుండి జరిపించాడన్న కృతజ్ఞతతోనే తాను ఈ వివరాలన్నీ చేరవేశానని జస్టిన్ వివరించినట్టు తెలుస్తోంది. మరేవిధమైన దురుద్దేశం తనకు లేదని స్పష్టం చేశాడని అంటున్నారు.
గుంటూరులో మరో రియల్ వివాదం
గుంటూరు పోలీస్ రేంజ్ పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ గౌస్‌పై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే సిరిసంపద రియల్ వెంచర్ కేసుకు సంబంధించి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తుండగా, తాజాగా గుంటూరులోనూ ఓ కేసు నమోదుకు రంగం సిద్ధమవుతోంది. గుంటూరు నగరానికి సమీపంలోని నల్లపాడు ప్రాంతంలో రూ.మూడుకోట్ల విలువైన ఓ స్థల వివాదానికి సంబంధించి గౌస్ అడ్డగోలుగా సెటిల్‌మెంట్ చేసినట్టు తెలుస్తోంది. దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఓ బిల్డర్ ఆ స్థలాన్ని ఆక్రమించాడు. ఇదేమని ప్రశ్నించిన స్థలం యజమానిని గౌస్ సాయంతో గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసలకు గురిచేశారు. గౌస్ చెప్పడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేయకుండానే 15 రోజులపాటు స్టేషన్‌లో ఉంచి లాఠీలకు పనిచెప్పడంతో చివరకు సదరు యజమాని స్థలం కాగితాలను గౌస్ వకాల్తా పుచ్చుకున్న బిల్డర్‌కు ఇచ్చి తప్పుకున్నాడు. ఈ పనిచేసినందుకు గాను సదరు బిల్డర్ గౌస్‌కు ఫోర్డ్ ఐకాన్ కారు బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. గౌస్ లీలలు ఇలా ఒక్కొక్కటిగా బయటపడటంతో సదరు బాధితుడు బయటకు అటు గుంటూరు, ఇటు ఏలూరు పోలీసులను ఆశ్రయించాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ గ్రానైట్ వివాదాన్ని సెటిల్‌మెంట్ చేసిన గౌస్‌కు ప్రస్తుతం గుంటూరులోనే ఉంటున్న ఓ వ్యాపారి ఇటీవలే ఇన్నోవా కారును బహుమతిగా ఇచ్చాడని తెలిసింది. ఆరు రోజుల కిందట అరెస్టయ్యే వరకు గౌస్ ఆ ఇన్నోవా వాహనాన్ని వాడేవాడని అంటున్నారు.
సెలవుపై గౌస్ అనుచరులు
ఇన్నాళ్లూ షాడో బాస్‌కు వేగుల్లా అన్నీ తామై వ్యవహరించిన ఏలూరులోని వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బంది పరిస్థితులు తారుమారు కావడంతో ఎటు తిరిగి ఎటొస్తుందోన్న భయంతో సెలవులు పెట్టేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఓ కానిస్టేబుల్, రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఓ కానిస్టేబుల్, సీసీఎస్‌లో పనిచేస్తున్న పలువురు కానిస్టేబుళ్లు పత్తా లేకుండా పోయారని పోలీసువర్గాలే అంటున్నాయి.
గౌస్ కస్టడీ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా
ఏలూరు (వన్ టౌన్) : గౌస్ మొహియిద్దీన్‌ను కస్టడీకి అప్పగించాలని కోరుతూ టూటౌన్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఓ నిరుద్యోగికి ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానన్న గౌస్ సొమ్ము తీసుకుని మోసం చేశాడంటూ ఒంగోలుకు చెందిన సూర్యప్రకాష్‌రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. వాదోపవాదాలు విన్న రెండో అదనపు జిల్లా జడ్జి ఎ.హరిహరనాథశర్మ విచారణను బుధవారానికి వాయిదా వేశారు.