గౌస్ వెనుక ఆ ఇద్దరు | lecturer ghouse mohiuddin cheating case continue | Sakshi
Sakshi News home page

గౌస్ వెనుక ఆ ఇద్దరు

Published Mon, Oct 27 2014 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM

గౌస్ వెనుక ఆ ఇద్దరు

గౌస్ వెనుక ఆ ఇద్దరు

 సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా పోలీస్ శాఖను కుది పేస్తూ.. రాష్ర్టంలోని కొంతమంది ఐపీఎస్ అధికారులకు వణుకు పుట్టిస్తున్న లెక్చరర్ గౌస్ మొహియిద్దీన్ అరెస్ట్ వ్యవహారంలో మరో కోణం వెలుగుచూస్తోంది. అటు డీఐజీ, ఇటు జిల్లా పోలీస్ కార్యాల యాల్లో పనిచేసే ఉద్యోగులే ఇంటిదొంగలుగా మారి కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు గౌస్‌కు అందజేశారని తెలుస్తోంది. ఆ సమాచారంతోనే అంతా తానే అన్నట్టు చక్రం తిప్పాడని అంటున్నారు.

 

సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్ల బదిలీలకు  సంబంధించిన నోట్‌లు, పదోన్నతులు, పనిష్మెంట్ల నోట్‌లు, అవార్డులు, రివార్డులు, సేవా, ప్రోత్సాహక పత్రాలకు సంబంధించిన జాబితాలను పోలీస్ కార్యాలయాల్లోని ఇద్దరు ఉద్యోగులు ముందుగానే గౌస్‌కు చేరవేసేవారని తెలుస్తోంది. ఉన్నతాధికారుల దృష్టికి తప్ప బయటకు రాకూడని ఈ జాబితా గౌస్ వద్ద ఉండటంతో ముందుగానే ఆయన ఆ జాబితాలో పేర్లున్న అధికారులకు, సిబ్బందికి ఫోన్లు చేసేవారని అంటున్నారు.
 
 ‘ఇదిగో నీకు ఈ పతకం వస్తోంది.. నేనే సిఫార్సు చేశా.. నీకు ప్రమోషన్ గ్యారంటీ.. నేనే మాట్లాడా.. ఫలానా చోటకు బదిలీ అవుతుంది.. నీపై ఉన్న పనిష్మెంట్ నోట్ ఎత్తివేయించా.. మీ పై అధికారులతో నేను మాట్లాడితేనే ఇవన్నీ జరుగుతున్నారుు’ అంటూ పోలీసులకు ముందుగానే సమాచారం చెప్పేవాడని తెలుస్తోంది. గౌస్ చెప్పినట్టే జరుగుతోందన్న అభిప్రాయానికి వచ్చిన సదరు అధికారులు ఆయనకు సలామ్ కొట్టేవారని అంటున్నారు.

 

చివరకు గౌస్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలోనూ బదిలీ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు పోలీస్ అధికారులు భీమవరంలో గల గౌస్ ఇంట్లోనే ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం అనంతపురంలో పనిచేస్తూ నరసాపురం డీఎస్పీగా వచ్చేందుకు యత్నిస్తున్న ఓ అధికారి, గతంలో ఏలూరులో సీఐగా పనిచేసి ఇప్పుడు కృష్ణాజిల్లా దివిసీమలో పనిచేస్తున్న ఓ సీఐ గౌస్ అరెస్ట్ సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారని చెబుతున్నారు.
 
 అరెస్ట్ విషయం ముందే తెలుసా
 తనపై పోలీసులు వల పన్నుతున్నారని గౌస్‌కు ముందే సమాచారం ఉందని అంటున్నారు. ఒంగోలుకు చెందిన కె.సూర్యప్రకాష్‌రెడ్డి ఫిర్యాదు చేసిన వెంటనే ఆ విషయాన్ని కొంతమంది ఇంటిదొంగలు ఆయనకు చేరవేశారని తెలిసింది. ఫిర్యాదుపై ఎంతో కొంత పోలీస్ యాక్షన్ ఉంటుందని భావిం చారే కానీ.. తనను అరెస్ట్ చేసి రోడ్డుకీడుస్తారని మాత్రం గౌస్ ఊహించలేదని అంటున్నారు. ఊహిస్తే జాగ్రత్త పడేవాడని పోలీస్ వర్గాలంటున్నారుు.
 
 ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ప్రత్యేక బృందాలు

 గౌస్ మేనేజింగ్ పార్టనర్‌గా వ్యవహరిస్తున్న సిరిసంపద రియల్ ఎస్టేట్ వ్యవహారానికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం పొందేందుకు పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. నెల్లూరులోని సంగం ప్రాంతంలో కూడా రియల్ వెంచర్ పేరి ట గౌస్ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఈ మేరకు జిల్లా పోలీస్ అధికారులు ఆయా జిల్లాల ఎస్పీలకు  సమాచారం ఇచ్చారు. అక్రమార్జనతో ఆస్తులు సంపాదించుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఆస్తి వివరాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులను కూడా సంప్రదించాలని పోలీసులు భావిస్తున్నారు.
 
 గుంటూరు జీజీహెచ్‌లో చేరిక
 గౌస్ మొహియిద్దీన్ ప్రస్తుతం గుంటూ రు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనికి గొంతు క్యాన్సర్ ఉండటం, అనారోగ్యం బారిన పడ టంతో ఏలూరు సబ్‌జైల్ నుంచి ముందుగా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి, మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
 
 కస్టడీ, బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ
 గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొం దుతున్న గౌస్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం ఏలూరు కోర్టులో విచారణ జరగనుంది. అదేవిధంగా మరిన్ని కేసుల సమాచారం కోసం నిందితుడు గౌస్‌ను విచారించేందుకు పోలీస్ అధికారులు కస్టడీ కోరుతూ కోర్టులో వేసిన పిటిషన్‌పైనా అదేరోజు విచారణ జరగనుంది.
 
 ఆ డైరీలో ఏముంది
 గౌస్‌మొహియిద్దీన్ ఇంటినుంచి పోలీస్‌లు స్వాధీనం చేసుకున్న డైరీ కలకలం రేపుతోంది. ఆయన రాసుకున్న డైరీలో చాలామంది ఐపీఎస్‌ల తలరాతలు ఉన్నట్టు సమాచారం. తాను ఎవరెవరికి పనిచేసి పెట్టింది, తనతో ఎవరు సన్నిహితంగా ఉంటారు, ఎవరు దూరంగా ఉంటారు వంటి వివరాలు అందు లో పొందుపరిచినట్టు భోగట్టా. ఈ నేపథ్యంలో గౌస్‌కు ఏయే పోలీస్ అధికారులతో సంబంధాలు ఉన్నాయనే దానిపై డైరీలోని వివరాలు ఉపయోగపడతాయని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సెల్ ఫోన్ కాల్ డేటాతోపాటు ఆయన ఏయే పోలీస్ అధికారులకు మెసేజ్ లు ఇచ్చారు, ఎవరు రిప్లై ఇచ్చారనే అంశాలపైనా విచారణ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement