మూడు రోజుల కస్టడీ.. నాలుగు గంటల విచారణ
ఏలూరు(వన్ టౌన్) : మూడు రోజుల పోలీసుల కస్టడీలో అనారోగ్యం సాకుతో రెండు రోజులు వృథా కాగా ఆఖరి రోజు కూడా మిగిలిన పూట గౌస్‌ను వైద్య పరీక్షలు చేసి కోర్టుకు తరలించేందుకు సరిపోయింది. ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ మాట్లాడాల్సి వచ్చిన ప్రతీసారి గొంతునొప్పి, ఛాతినొప్పి, రక్తపోటు సాకుతో పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. దీంతో పోలీసులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇన్ని రోజుల విచారణలో పోలీసులకు గౌస్ సహకరించిన సమయం కేవలం నాలుగైదు గంటలు మాత్రమే. కుటుంబ సభ్యులతో తన లాయర్‌తో చక్కగా మాట్లాడానికి ఆరోగ్యం సహకరించినప్పటికీ పోలీసులు ప్రశ్నలు అడిగే సమయానికి టంచనుగా రక్తపోటు వచ్చేస్తుంది. వైద్య పరీక్షల్లో సైతం ఏమీ లేదని, ఆరోగ్యంగా ఉన్నాడని తెలుస్తున్నా.. కిమ్మనకుండా ఉండిపోవడం తప్ప పోలీసులు ఏమీ చేయలేక పోయారు. కీలక సమాచారం రాబడతారనుకున్న పోలీసులు ఏమాత్రం వివరాలు రాబట్టలేక పోయారని తెలుస్తోంది. విచారణకు ఏమాత్రం సహకరించకుండా ఆధ్యంతం అనారోగ్యం సాకుతో పోలీసులకు, ఆస్పత్రి వైద్యులకు విలువైన సమయాన్ని గౌస్ వృథా చేసి మూడో రోజు డ్రామా ముగించి జైలుకు చేరుకున్నాడు.
గౌస్‌ను కలిసిన నిఘా విభాగం డీఐజీ స్థాయి అధికారి
వేరే ప్రాంతానికి చెందిన ఒక నిఘా విభాగానికి చెందిన డీఐజీ స్థాయి అధికారి గౌస్‌ను కలిసి మాట్లాడటం కలకలం రేపింది. రాత్రి సమయంలో ఎవరో ఒకరు వచ్చి గౌస్‌ను పరామర్శిచడం ఒక ఎత్తయితే శనివారం ఓ నిఘా విభాగపు ఉన్నత స్థాయి అధికారి వచ్చి వెళ్లాడన్న వార్త ఆస్పత్రిలో కలకలం సృష్టించింది. ఆ అధికారి కేసుకు సంబంధించిన వివరాల కోసమే వచ్చినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు అనంతరం కోర్టుకు తరలించి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జిల్లా జైలుకు తరలించారు.