ఇక పచ్చ కాంట్రాక్టర్లు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: టీడీపీ కార్యకర్తలు మరో కొత్త అవతారం ఎత్తారు. నిన్నమొన్నటి వరకు పార్టీ జెండా మోసిన అనేక మంది కార్యకర్తలు రేషన్‌షాపులు, ఎల్ఈడీ బల్బుల డీలర్లుగా మారిపోయారు. వారిని చూసిన గ్రామీణ ప్రాంతాల్లోని కార్యకర్తలు తమ సంగతేమిటని నేతల్ని ప్రశ్నించడంతో రానున్న ఖరీఫ్‌లో సాగునీటి, మురుగునీటి కాల్వల మరమ్మతులు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో గ్రామాల్లోని టీడీపీ కార్యకర్తలు నయా కాంట్రాక్టర్లుగా మారి హల్చల్ చేస్తున్నారు. ఎలాంటి అనుభవం, అర్హతలు లేకపోయినా రూ.5 లక్షల విలువైన పనులను నామినేషన్ పద్ధతిపై చేయడానికి జలవనరుల శాఖ అవకాశం కల్పించింది.
ఆ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తాను అందరిలాంటి మంత్రిని కానని, తన శాఖలో నామినేషన్‌పై పనులు ఉండవని ప్రకటించి, దాదాపు 10 నెలల పాటు నామినేషన్ విధానాన్ని నిలువురించారు. ఏమైందో ఏమోగాని కాల్వల మరమ్మతులను నామినేషన్‌పై ఇవ్వడానికి అనుకూలంగా ఉత్తర్వులు విడుదల చేశారు. జిల్లాలోని సాగునీటి కాల్వల మరమ్మతులకు ప్రభుత్వం రూ.8.64 కోట్లు కేటాయించింది. సాగునీటి కాల్వల్లోని పరిస్థితులకు అనుగుణంగా 440 పనులకు జలవనరుల శాఖ అంచనాలు తయారు చేసి ప్రభుత్వ ఆమోదానికి రెండు నెలల క్రితం పంపింది. వాటిని ఆమోదిస్తూ టెండర్లకు బదులు నామినేషన్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించింది.
కాల్వలకు నీటిని విడుదల చేయడానికి రెండున్నర నెలల సమయం ఉందని, ఈ సమయంలో టెండర్లు ఆహ్వానించడం, ఖరారు చేయడం, పనులు ప్రారంభించడం వంటివి ఆలస్యమవుతాయని, యూజర్ కమిటీలకు వాటిని అప్పగించాలని ఆదేశించింది. యూజర్ కమిటీలను మండల రెవెన్యూ అధికారి ధృవీకరించే అధికారాన్ని అప్పగించారు. గ్రామంలోని రైతులు, వ్యవసాయ కార్మికులకు ఈ కమిటీలో తప్పకుండా స్థానం కల్పించాలని ఆదేశించారు. దీంతో ఏర్పాటుకానున్న యూజర్ కమిటీల్లో ఎక్కువ మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ఆ పార్టీకి చెందిన రైతులే ఉంటున్నారు. ఈ కమిటీని ఎంఆర్వో ధ్రువీకరించి జలవనరుల శాఖకు పంపితే, ఆ కమిటీకి రూ.5 లక్షల్లోపు విలువైన పనిని జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు కేటాయిస్తారు.
ఈ మేరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో యూజర్ కమిటీలు ఏర్పాటయ్యాయి. కొన్ని గ్రామాల్లో కమిటీలు ఏర్పాటవు తున్నాయి. ఈ కమిటీలకే జలవనరుల శాఖ పనులు కేటాయించనుండటంతో టీడీపీ కార్యకర్తలు నయా కాంట్రాక్టర్ల అవతారం ఎత్తుతున్నారు. ఈ విషయమై జలవనరుల శాఖ ఇంజినీర్లు వివరణ ఇస్తూ ఎంఆర్ఓ ధ్రువీకరించిన యూజర్ కమిటీలకు నామినేషన్ విధానంపై పనులు కేటాయించనున్నామని, ఈ కమిటీల పరిశీలన జరుగుతోందని, త్వరలో పనులు కేటాయింపు జరుగుతుందని చెప్పారు.
పనుల నాణ్యతపై సందేహాలు ...
కాగా, ఈ విధానంలో పనులు జరిగితే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి అర్హత లేని వారికి ఈ పనులు అప్పగించే అవకాశాలు ఉండటంతో షట్టర్ల మరమ్మతులు, రివిట్మెంట్లు వంటి పనుల నిర్వహణకు వారికి సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడతో వాటిని సక్రమంగా చేయలేరనే అభిప్రాయం వినపడుతోంది. అధికార బలం వారికి వెన్నంటి ఉండటంతో నాణ్యత లేని పనులను ప్రశ్నించే అధికారాన్ని జల వనరులశాఖ ఇంజినీర్లు కోల్పోయే అవకాశం ఉంది. మొత్తం మీద నామినేషన్ విధానంలో రైతులు నష్టపోయే అవకాశాలు ఎక్కువ గా కనపడుతున్నాయి.