కాళ్లవాపు నియంత్రణకు ప్రత్యేక చర్యలు
అన్నవరం గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్
వీఆర్‌పురం : కాళ్లవాపు ప్రభావిత గ్రామాల ప్రజలు విటమిన్ల లోపంతో పాటు రక్తహీనతతో బాధపడుతున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని, వీటి నియంత్రణకు ఆయా గ్రామాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. కాళ్లవాపు ప్రభావం అధికంగా ఉన్న వీఆర్ పురం మండలంలో బుధవారం ఆయన పర్యటించారు. రేఖపల్లి పీహెచ్సీలో కాళ్లవాపు బాధితులను పరామర్శించారు. ఈ వ్యాధికి సంబంధించి తీసుకున్న చర్యలపై అధికారులను ఆరాతీశారు. వ్యాధి నుంచి ఉపశమనం పొందిన అన్నవరం గ్రామానికి చెందిన వారిని కూడా పరామర్శించారు. అనంతరం గ్రామంలోని కిరాణా దుకాణాన్ని తనిఖీ చేశారు. గ్రామానికి చెందిన పూనెం రాజారావు ఇంట్లో బియ్యం, వంటనూనెను, వంట విధానాన్ని పరిశీలించారు. కాళ్లవాపుపై ఆందోళన చెందవద్దని చెప్పారు. పోలవరం ముంపు ప్రభావంతో సంబంధం లేకుండా, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో ప్రత్యేక వైద్య బృందం సేకరించిన రక్త నమూనా, తాగునీరు, ఆహారాన్ని పరీక్షించారని, అన్నీ సాధారణంగానే ఉన్నట్టు రిపోర్టులు వచ్చాయని వివరించారు. నేషనల్ లేబరేటరీ బృందం రెండు రోజుల్లో ఆయా గ్రామాల్లో పర్యటించి, పూర్తి అధ్యయనం చేయనుందని తెలిపారు. కలెక్టర్ వెంట ఐటీడీఏ పీఓ కేవీఎన్ చక్రధర్‌బాబు, పోలవరం(భూసేకరణ ) డిప్యూటీ కలెక్టర్ ఎల్లారమ్మ, డిప్యూటీ కలెక్టర్ (స్పెషలాఫీసర్ ) పి.శ్రీరామచంద్రమూర్తి, అడిషనల్ డీఎంహెచ్ఓ పవన్‌కుమార్ తదితరులు ఉన్నారు.
‘కలెక్టర్ గారూ.. ఆ మాటలకు చాలా బాధపడ్డాం’
వీఆర్‌పురం : ‘నాటుసారా తాగడం వల్ల కాళ్లవాపు మరణాలు సంభవిస్తున్నాయంటూ మీరు అన్న మాటకు మేమంతా చాలా బాధపడ్డాం సార్..’ అని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ వద్ద రేఖపల్లి సర్పంచ్ మడకం జోగమ్మ ఆవేదన వెళ్లగక్కారు. కాళ్లవాపు ప్రభావిత గ్రామమైన రేఖపల్లి పంచాయతీలోని అన్నవరం గ్రామంలో కలెక్టర్ బుధవారం పర్యటించారు. కాళ్లవాపు వ్యాధి బారిన పడి, కాకినాడకు వెళ్లి చికిత్స అనంతరం తిరిగి వచ్చిన వారితో ఆయన మాట్లాడారు. అనంతరం అక్కడున్న సర్పంచ్.. కలెక్టర్‌ని పరిచయం చేసుకుని, ‘సార్.. సారా తాగడం వల్ల కాళ్లవాపు వచ్చి చనిపోయారని మీరు మొన్న కాకినాడలో అన్నారు. దానికి మా గిరిజన ప్రజలమంతా చాలా బాధపడ్డాం’ అని చెప్పారు. దీంతో ఆయన తేరుకుని, ‘కాదమ్మ.. అలా కాదు, ఆ మరణాలకు సారా కూడా ఓ కారణమై ఉండవచ్చేమోనని అన్నాను. అంతేకానీ మరే ఉద్దేశంతో అనలేదు’ అని ఆయన తన మాటలను సరిదిద్దుకున్నారు.
కాకినాడ జీజీహెచ్‌కు మరో 16 మంది తరలింపు
వీఆర్ పురం : కాళ్లవాపు లక్షణాలతో ఉన్న మరో 16 మందిని చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి అంబులెన్స్‌లో బుధవారం తరలించారు. వైద్య, రెవెన్యూ, మండల పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పడిన బృందాలు మంగళవారం నుంచి చేపట్టిన ఇంటింటి సర్వే వేగవంతంగా కొనసాగుతోంది. మండలంలోని 7,814 కుటుంబాలుండగా, మంగళ, బుధవారాల్లో 4,120 కుటుంబాలను ఈ బృందాలు సర్వే చేశాయి. ఈ నేపథ్యంలో బుధవారం కాళ్లవాపు లక్షణాలతో ఉన్న కొంతమందిని రేఖపల్లి పీహెచ్‌సీకి తరలించారు. కొత్తగా నియమితులైన వైద్య నిపుణుడు రవికాంత్ వారిని పరీక్షించి, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న 16 మందిని కాకినాడకు పంపే ఏర్పాట్లు చేశారు. మంగళవారం తరలించిన ఐదుగురితో కలిపి మొత్తం 21 మంది కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే అన్నవరం, పెదమట్టపల్లి, లక్ష్మీనగరం గ్రామాల నుంచి వెళ్లిన 32 మందిలో 30 మంది చికిత్స అనంతరం స్వగ్రామాలకు మంగళవారం వచ్చారని, మిగిలిన ఇద్దరు కూడా ఆరోగ్యంగానే ఉన్నారని అడిషనల్ డీఎంహెచ్ఓ ఎం.పవన్‌కుమార్ తెలిపారు.