కిష్టారెడ్డికి సీఎల్పీ నివాళి
- దివంగత నేత సేవలను కొనియాడిన సీఎల్పీ, టీపీసీసీ
- నారాయణ్‌ఖేడ్ ఉపఎన్నిక ఏకగ్రీవం చేయాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: నారాయణ్‌ఖేడ్ శాసనసభ్యుడు పి.కిష్టారెడ్డి మృతికి సంతాపం ప్రకటిస్తూ కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) తీర్మానం చేసింది. గురువారం సీఎల్పీ నేత కె.జానారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్కతో పాటు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు సాల్గొన్నారు. కిష్టారెడ్డి చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలను ఉంచి నేతలు నివాళులు అర్పించారు. గత మంగళవారం కిష్టారెడ్డి గుండెపోటుతో ఇక్కడ కన్నుమూసిన సంగతి విదితమే.
కాగా, నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో పోటీకి పార్టీ అభ్యర్థిగా కిష్టారెడ్డి కుటుంబీకుల్లో ఒకరికి లేదా వారు సూచించే వారికే అవకాశం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరాలని సీఎల్పీ నిర్ణయించింది. అంతేకాకుండా ఈ ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా చూడాలని అన్ని పార్టీలను కోరాలని కూడా ఈ సమావేశం తీర్మానించింది. కిష్టారెడ్డి క్రమశిక్షణ కలిగిన నేత అని జానారెడ్డి కొనియాడారు. పార్టీకి, మెదక్ జిల్లా ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా కిష్టారెడ్డి హుందాగా ఉండేవారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుకు, ఒక ప్రభుత్వ పథకానికి కిష్టారెడ్డి పేరు పెట్టాలని సీఎల్పీ కోరింది.
టీపీసీసీ కార్యాలయంలో నివాళి..
నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి మరణం కాంగ్రెస్‌పార్టీకి తీరనిలోటని టీపీసీసీ అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క అన్నారు. గాంధీభవన్‌లో గురువారం జరిగిన సమావేశంలో కిష్టారెడ్డి మృతికి సంతాపం ప్రకటిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సర్పంచ్ నుంచి పీఏసీ చైర్మన్ దాకా అనేక పదవులను నిర్వహించిన కిష్టారెడ్డి మరణంతో కాంగ్రెస్ పార్టీ ఒక పెద్దదిక్కును కోల్పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఉద్దెమర్రి నర్సింహారెడ్డి, నాగయ్య, దామోదర్, కుసుమకుమార్, భిక్షమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.