ఢిల్లీ సీఎం ప్రకటనపై బిగ్ ట్విస్ట్
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి (Delhi Next CM) ఎవరు? అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేఎల్పీ భేటీ నేపథ్యంలో ఇవాళ సాయంత్రంలోపు స్పష్టమైన ప్రకటన వెలువడొచ్చని అంతా భావించారు. అయితే చివరి నిమిషంలో ఆ భేటీని వాయిదా వేస్తూ బీజేపీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.ఇవాళ జరగాల్సిన బీజేఎల్పీ(BJLP) సమావేశాన్ని వాయిదా వేసింది ఆ పార్టీ. ఢిల్లీ స్టేషన్ తొక్కిసలాట ఘటనకు సంఘీభావంగానే సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించింది. తిరిగి.. ఫిబ్రవరి 19న ఈ భేటీని నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే అదే తేదీన సీఎంతో పాటు కేబినెట్ కూర్పుపైనా ఓ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు రేపు మరోసారి సీఎం అభ్యర్థిపై అధిష్టానం సమాలోచనలు జరపనున్నట్లు సమాచారం. బీజేపీ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. 19వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన బీజేఎల్పీ జరగనుంది. ఆ భేటీలో సీఎం అభ్యర్థి పేరు ప్రకటన ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సరాసరి లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరకు వెళ్తారు. బీజేఎల్పీ నేత, కేబినెట్ పేర్లు ఉన్న వివరాలు అందజేసి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని ఎల్జీని కోరనున్నారు.అందుకే ఆలస్యం!ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు(Delhi Assembly Elections) పోలింగ్ జరగ్గా.. 8వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48, ఆప్ 22 గెలుచుకున్నాయి. సుమారు మూడు దశాబ్ధాల తర్వాత ఢిల్లీ పీఠం కమలం కైవసం చేసుకుంది. అయితే.. సీఎం ఎంపికలో ఆచీచూతీ వ్యవహారించాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు జేపీ నడ్డా నాయకత్వంలో అంతర్గత సంప్రదింపులు సైతం జరిపింది. అదే సమయంలో.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఎంపిక ఆలస్యమైంది. ఈలోపు ఢిల్లీ విషాదంతో.. మరోసారి ఆ భేటీ వాయిదా పడింది. ఇక 19వ తేదీన జరగబోయే బీజేఎల్పీ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శులు సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాదిరే.. ఢిల్లీకి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు(Delhi Deputy CMs) ప్రతిపాదనను అధిష్టానం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం.ప్రమాణం ఎప్పుడంటే..ఆ మరుసటిరోజు(ఫిబ్రవరి 20న) రామ్ లీలా మైదానం(Ram Leela Maidan)లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించాలనుకుంటోంది. ఎన్టీయే పాలిత ప్రాంతాలకు ఇప్పటికే ఆహ్వానం వెళ్లింది. గురువారం సాయంత్రం 4గం.30ని. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. మోదీ, అమిత్ షా సహా బీజేపీ అగ్ర నేతల సమక్షంలో సీఎం, మంత్రి వర్గం ప్రమాణం చేయనుంది. ఈ మేరకు కార్యక్ర కో ఆర్డినేటర్లుగా వినోద్ తావ్డే,తరుణ్ చుగ్‌లను బీజేపీ హైకమాండ్ నియమించింది.ఇక.. ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మ(న్యూ ఢిల్లీ), రేఖా గుప్తా (షాలిమార్ బాగ్), విజేందర్ గుప్తా (రోహిణి), సతీష్ ఉపాధ్యాయ్ (మాల్వియా నగర్), ఆశిష్ సూద్ (జనక్‌పురి), పవన్ శర్మ (ఉత్తమ్ నగర్), అజయ్ మహావార్ (ఘోండా)ర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జనాల్లో ‘క్లీన్ ఇమేజ్’ ఉన్న నేతకే ఢిల్లీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం ఓ అంచనాకి వచ్చినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: వద్దని తిరిగి వెళ్లిపోతుండగా ప్రాణం పోయింది!!