lend
-
అర్హులందరికీ పంట రుణాలివ్వాలి
ఓడీ చెరువు: అర్హులైన రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలంటూ సీపీఐ నాయకులు, రైతులు గురువారం మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు ఆంజనేయులు, మున్నా తదితరులు మాట్లాడుతూ స్టేట్ బ్యాంకులో రుణాలు కావాలంటే దళారులు లేదా పలుకుబడి ఉన్న వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. దీంతో చాలా మంది రైతులకు పంట రుణాలు అందక బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారని వాపోయారు. బ్యాంకు అధికారులు కొంత మంది బ్రోకర్ల ద్వార రుణాలు ఇస్తున్నారని ఆరోపించారు. రైతులు బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదిస్తే కొత్త రుణాలు ఇచ్చేది లేదని వెనక్కి పంపుతున్నారని రైతులు వాపోయారు. పంట రుణం కావాలని వచ్చే ప్రతి రైతుకూ కొత్తగా రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ నాయకులు రమణ, రహీం, రైతులు పాల్గొన్నారు. -
అప్పే ముప్పైంది
కొల్చారం : కష్టపడి పంట పండిద్దామని అప్పు చేశాడు అన్నదాత. కానీ ఆ అప్పే తనపాలిట ముప్పైంది. పంట సాగు కోసం బోరు వేస్తే నీరు రాలేదు. దీంతో నాలుగు బోర్లు వేయించాడు. నాలుగో బోరులో నీరు వచ్చినా పంటకు తగ్గ సామర్ధం రాలేదు. దీంతో అన్నదాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన చింత దుర్గయ్య (48)కు రెండెకరాల పొలం ఉంది. పంట సాగుకోసం రూ.2లక్షలు అప్పు చేసి నాలుగు బోర్లు వేయించాడు. అయితే నాలుగో బోరులో కొంత నీరు వచ్చినా అది పంటకు సరిపోవడంలేదు. దీంతో పంట ఎండిపోతోంది. చేసిన అప్పులను ఎలా తీర్చాలనుకుని కలత చెంది ఆది వారం ఉదయం పురుగుల మందు తాగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే పొలానికి వెళ్లిన దుర్గయ్య ఇంకా రాకపోవడంతో పొలం వద్ద పడిఉన్నాడు. పక్కన పురుగుల మందు డబ్బా ఉంది. దీంతో మృతుడి భార్య బోరున విల పించింది. మృతుడికి కూతురు శోభ, అవిటి వాడైన కుమారుడు సంగమేశ్వర్లు ఉన్నారు. ఈ మేరకు విషయం తెలుసుకున్న కొల్చారం పోలీసులు అక్కడికి చేరుకొని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ నీరుడి లక్ష్మయ్య, గ్రామస్థులు తదితరులు కోరారు. -
'అప్పు చెల్లించలేదన్న అక్కసుతోనే హత్యలు'
విశాఖ : కేవలం అప్పు చెల్లించలేదన్న అక్కసుతోనే మేనమామ తమపై హత్యాయత్నం చేశాడని ప్రాణాలతో బయటపడ్డ మంత్రి గణేష్ తెలిపారు. ప్రస్తుతం అతను తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విశాఖ శివారు పెందుర్తి సమీపంలోని చినముషిడివాడలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణహత్యకు గురయిన విషయం తెలిసిందే. అయితే ఈ దారుణ కాండలో తండ్రి, తాతయ్య, నానమ్మలను కోల్పోయిన విషయాన్ని పోలీసులు గణేష్‌కు తెలియనివ్వలేదు. ఇంటర్ చదువుతున్న గణేష్ తన మేనమామ అసిరి నాయుడు మొదటి నుంచి మూర్ఖంగా ప్రవర్తించేవాడిని తెలిపాడు. దీపావళి రోజున తనను సరదాగా ఆటాడుకుందామంటూ రెండుకాళ్ళను తాళ్లతో బంధించి, ముఖానికి కవర్‌తో ముసుగు తొడిగి రాడ్‌తో దాడి చేసినట్లు చెప్పాడు. అయితే అతని నుంచి తప్పించుకున్న తాను బంధువుల సాయంతో ఆస్పత్రిలో చేరినట్లు తెలిపాడు. వివరాల్లోకి వెళితే రాజమండ్రి సమీపంలోని ద్వారపూడి అన్నదేవరపేటకు చెందిన మంత్రి సన్యాసిరావు(70), ఎల్లమ్మ(65) దంపతులతో పాటు కుమారుడు మంత్రి సాంబ(37) ఎనిమిదేళ్ల క్రితం చినముషిడివాడలోని క్రాంతినగర్‌కు వలస వచ్చారు. సన్యాసిరావు, ఎల్లమ్మ దంపతుల అల్లుడు పల్లాడ అసిరినాయుడు వీరికి రూ.50వేలు అప్పుగా ఇచ్చాడు. కొంతకాలంగా బాకీ విషయంలో, అలాగే అన్నదేవరపేటలోని ఆస్తిపై వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం సన్యాసిరావు కుటుంబ సభ్యులతో అసిరినాయుడు వివాదానికి దిగాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఈ ముగ్గురిపై ఇనపరాడ్డుతో దాడికి దిగడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతదేహాలను ఇంటి పడక గదిలో గుట్టగా పడేసి ఏమీ తెలియనట్టు ఉన్నాడు. మధ్యాహ్నం సాంబ కుమారుడు గణేష్ కళాశాల నుంచి ఇంటికి వచ్చాడు. అసిరినాయుడే అతడికి భోజనం పెట్టాడు. కాసేపటి తరువాత దొంగ, పోలీస్ ఆట ఆడుకుందాం అంటూ చేతులు వెనక్కికట్టి గోనెసంచిలో పెట్టి మూశాడు. అనంతరం ఇనుపరాడ్డుతో దాడికి దిగడంతో భీతిల్లిన గణేష్ అక్కడ నుంచి తప్పించుకుని బయటకు పరుగు తీశాడు. అనంతరం స్థానికుల సాయంతో ఆస్పత్రిలో చేరాడు. కాగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.