అప్పే ముప్పైంది
కొల్చారం :
కష్టపడి పంట పండిద్దామని అప్పు చేశాడు అన్నదాత. కానీ ఆ అప్పే తనపాలిట ముప్పైంది. పంట సాగు కోసం బోరు వేస్తే నీరు రాలేదు. దీంతో నాలుగు బోర్లు వేయించాడు. నాలుగో బోరులో నీరు వచ్చినా పంటకు తగ్గ సామర్ధం రాలేదు. దీంతో అన్నదాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన చింత దుర్గయ్య (48)కు రెండెకరాల పొలం ఉంది. పంట సాగుకోసం రూ.2లక్షలు అప్పు చేసి నాలుగు బోర్లు వేయించాడు. అయితే నాలుగో బోరులో కొంత నీరు వచ్చినా అది పంటకు సరిపోవడంలేదు. దీంతో పంట ఎండిపోతోంది. చేసిన అప్పులను ఎలా తీర్చాలనుకుని కలత చెంది ఆది వారం ఉదయం పురుగుల మందు తాగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే పొలానికి వెళ్లిన దుర్గయ్య ఇంకా రాకపోవడంతో పొలం వద్ద పడిఉన్నాడు. పక్కన పురుగుల మందు డబ్బా ఉంది. దీంతో మృతుడి భార్య బోరున విల పించింది. మృతుడికి కూతురు శోభ, అవిటి వాడైన కుమారుడు సంగమేశ్వర్‌లు ఉన్నారు. ఈ మేరకు విషయం తెలుసుకున్న కొల్చారం పోలీసులు అక్కడికి చేరుకొని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ నీరుడి లక్ష్మయ్య, గ్రామస్థులు తదితరులు కోరారు.