పల్లె.. కన్నీటి ముల్లె!
పల్లె.. కన్నీటి ముల్లె!
Published Wed, Nov 9 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM
నీటి ఇక్కట్లు తీవ్రరూపం
- మంచి నీటి పథకాల విద్యుత్ బకాయి రూ.14.72 కోట్లు
- గత నెల రూ.1.95 కోట్లు చెల్లించిన జెడ్పీ
- పూర్తి బిల్లులు చెల్లించాలని మొండికేసిన ట్రాన్స్‌కో
- ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిపివేత
- 10 రోజులుగా 45 గ్రామాల్లో నీటి ఇక్కట్లు
కర్నూలు(అర్బన్): జిల్లాలోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాల(సీపీడబ్ల్యూఎస్) విద్యుత్ బకాయి తాగునీటి ఎద్దడికి కారణమవుతోంది. ఏపీ ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేస్తుండటంతో.. పథకాల పరిధిలోని గ్రామాల్లో గుక్కెడు నీటికి చుక్కలు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గొంతు తడుపుకునేందుకు కిలోమీటర్ల దూరం పరుగులు తీయాల్సి వస్తోంది. ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గ పరిధిలో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. బాపురం, చింతకుంట, కాజీపురం, విరుపాపురం, సమ్మతగేరి తదితర ప్రాంతాల్లోని ఎస్‌ఎస్ ట్యాంకుల్లో నీరు పుష్కలంగా ఉన్నా.. పంపింగ్ ఆగిపోవడంతో దాదాపు 45 గ్రామాల్లో నీటి ఇక్కట్లు తీవ్రరూపం దాల్చాయి. గత పది రోజులుగా తాగునీటి కోసం పలు గ్రామాలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అదేవిధంగా కర్నూలు, నంద్యాల డివిజన్లలోని పలు గ్రామాల్లోనూ ఇలాంటి ఇక్కట్లే కనిపిస్తున్నాయి. ఆయా గ్రామాల ప్రజలు బోర్ల వద్ద క్యూ కట్టడంతో పాటు సమీప పొలాల్లోని బోర్లను ఆశ్రయిస్తున్నారు. ఓవర్‌హెడ్ ట్యాంకులు, జీఎల్‌ఎస్‌ఆర్ ట్యాంకుల్లో నిల్వ ఉన్న కొంత నీటి కోసం బారులు తీరుతున్నారు. గ్రామ పంచాయతీల్లోని అరకొర ఆదాయంతో మంచినీటి పథకాలకు విద్యుత్ బిల్లులు చెల్లించే పరిస్థితి లేని కారణంగా ఏళ్ల తరబడి బకాయి పేరుకుపోయింది.
విద్యుత్ బకాయిలు రూ.14.72 కోట్లు
జిల్లాలోని 54 సీపీడబ్ల్యూఎస్ స్కీంలకు సంబంధించి దాదాపు రూ.14.72 కోట్ల ఽబకాయి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో లో టెన్షన్‌కు సంబంధించి రూ.12,18,28,318 ఉండగా, ఈ బకాయిలకు సంబంధించి గత నెల 4వ తేదీన జిల్లా పరిషత్ రూ.1,95,96,543 విద్యుత్ శాఖకు 25 శాతంగా చెల్లించింది. అలాగే హై టెన్షన్‌కు సంబంధించి రూ.2,54,72,121 బకాయిఽ ఉంది. 14వ ఆర్థిక సంఘం నిధుల్లో 25 శాతం నిధులను సంబంధిత సర్పంచ్‌లు జిల్లా పరిషత్‌కు జమ చేసినా, ఆ మొత్తం వారి జీతాలకే సరిపోయినట్లు సమాచారం.
రూ.16 కోట్లు విడుదల చేస్తున్నట్లు జీఓ
పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం రూ.16 కోట్లను విడుదల చేస్తున్నట్లు జీఓ ఇచ్చింది. నిధులు విడుదలైన వెంటనే బకాయిలను చెల్లిస్తాం. మంచినీటి పథకాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయవద్దని ట్రాన్స్‌కో అధికారులను కోరాం. విద్యుత్ సరఫరా నిలిపేసినా మంచినీటి పథకాలకు సంబంధించి గ్రామాల్లో ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు చేపడతాం.
- జె.మనోహర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ
25 శాతం నిధులను జెడ్పీకి చెల్లించాం
మంచినీటి పథకాలకు విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు 14వ ఆర్థిక సంఘం నిధుల్లో 25 శాతం జిల్లా పరిషత్‌కు చెల్లించాం. అయినా, సీపీడబ్ల్యూఎస్ పథకాలకు విద్యుత్ సరఫరాను నిలిపి వేయడం వల్ల గ్రామంలో తీవ్ర మంచి నీటి సమస్య ఏర్పడింది. పక్కనే రిజర్వాయర్ ఉన్నా, మంచినీటికి ఇబ్బందులు తప్పని పరిస్థితి.
- చంద్ర, చింతకుంట సర్పంచ్
విద్యుత్ బిల్లులు చెల్లించినా..
మంచినీటి పథకాల నిర్వహణను సర్పంచ్‌లకు అప్పగించిన నేపథ్యంలో పలుమార్లు విద్యుత్ బిల్లులను చెల్లించాం. అయినా బకాయిలు ఉన్నాయనే కారణంతో సీపీడబ్ల్యూఎస్ పథకాలకు విద్యుత్ సరఫరా నిలిపేయడం వల్ల ప్రజలు తీవ్ర మంచినీటి సమస్య ఎదుర్కొంటున్నారు. ప్రజల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఉన్నతాధికారులు బకాయి పడిన విద్యుత్ బిల్లులపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి.
- రుక్మిణి, సర్పంచ్, ఆలూరు
ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలి
గత వారం రోజులుగా కుళాయిలకు మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు తప్ప, ప్రజా సమస్యల పరిష్కారంలో శ్రద్ధ చూపడం లేదు.
- రత్నమ్మ, గృహిణి
Advertisement
Advertisement