సాక్షి, హైదరాబాద్: నీటి చుక్కను ఒడిసిపట్టు.. భావితరాలకు దాచిపెట్టు.. అనే నినాదం ఆ పల్లెలో నిత్యం ప్రతిధ్వనిస్తుంది. ఆ గ్రామంలో నీటి కష్టాలను జయించేందుకు ఇంటికో ఇంకుడు గుంత, 10 గుంటలకో కందకం తవ్వుకున్నారు. మూడేళ్లుగా ఆ పల్లెవాసులు చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు ఫలితాలనిస్తోంది.
వేసవిలో పల్లెలన్నీ నీళ్ల కోసం అల్లాడుతుంటే ఆ గ్రామం మాత్రం ‘పచ్చగా’ఉంది. దీనికి కారణం ఆ గ్రామస్తుల సంకల్పం. వారి సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం ‘శక్తి కరణ్’అవార్డు ఇచ్చి సత్కరించింది. సిద్దిపేట జిల్లాలో నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు దత్తత గ్రామం ఇబ్రహీంపూర్ గ్రామం దేశానికే ఆదర్శంగా నిలిచింది.
ఇబ్రహీంపూర్.. ఒకప్పుడు నీళ్ల కోసం అల్లాడిన గ్రామం. అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండేదంటే.. ఈ గ్రామానికి ఆడపిల్లను ఇవ్వాలన్నా, ఎద్దు ఇవ్వాలన్నా భయపడే వాళ్లు. దీంతో 2015లో గ్రామ సర్పంచ్ కుంబాల లక్ష్మీ రాఘవరెడ్డి ఊరందరిని ఏకం చేసి, వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవాలని శపథం తీసుకున్నారు. అదే సమయంలో వాళ్లకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చేయూతనిచ్చారు. గ్రామంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, రైతులు తమ పొలాల్లో కందకాలను తవ్వుకున్నారు. కనీసం ఐదుకు తక్కువ కాకుండా ఇంటి ముందు చెట్లు నాటుకున్నారు.
పెరిగిన పంట దిగుబడి...
గతంలో తీవ్రనీటి ఇబ్బందులు ఉండటంతో వరి పంట వేయడానికి రైతులు భయపడేవాళ్లు. పొలాల్లో కందకాల తవ్వకం తర్వాత భూగర్భ నీటి మట్టం పెరిగి పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. కూరగాయల సాగు కూడా ఆశించినంతగా వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దేశంలోనే ఆదర్శ గ్రామం..
ఇబ్రహీంపూర్ దేశంలోనే ఆదర్శ గ్రామం. గ్రామ ప్రజల శ్రమైక జీవనమే వాళ్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. ఈ వేసవిలో జిల్లావ్యాప్తంగా భూగర్భ మట్టాలు పడిపోతుంటే ఈ గ్రామంలో మాత్రం స్థిరంగా ఉన్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇంకుడు గుంత నిర్మించుకుంటే రూ.4,500 ఇస్తున్నాం. గ్రామాల్లోని ప్రజలు ముందుకొచ్చి, పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్
గ్రామస్తుల సహకారంతోనే సాధ్యం..
గ్రామస్తులు, రైతుల సహకారంతో వంద శాతం ఇంకుడు గుంతలు, కందకాలు సుమారు 600 ఎకరాల్లో తవ్వుకున్నాం. దీంతో వ్యవసాయ భూముల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. కందకాలు, ఇంకుడు గుంతల వల్ల వ్యవసాయ భూముల్లో, బోరు బావుల్లో నీరు పుష్కలంగా ఉంది. – కుంబాల లక్ష్మీరాఘవరెడ్డి, సర్పంచ్
పంటలు బాగాపండుతున్నాయి...
ఎండాకాలం వస్తే బోర్లు ఎండిపోయేవి. కందకాల పుణ్యాన మాకు నీటి ఇబ్బందులు తొలిగిపోయాయి. పోలం గట్ల వద్ద కందకాలను తవ్వడంతో బోరులో నీరు ఏ మాత్రం తగ్గలేదు. ఈ సీజన్‌లో బీర, కాకర, బెండ, కూరగాయలు పెట్టిన. బాగున్నాయి. – బండి భారతమ్మ, మహిళా రైతు, ఇబ్రహీంపూర్
Comments
Please login to add a commentAdd a comment