శ్రేయరాగ రాక్‌స్టార్
ఎక్కడి ఒడిశా? ఎక్కడి కొరియా? అయితే కలలు కనేవారికి దూరభారాలు ఉండవు.
పట్టుదలతో దూరాలను కరిగించేస్తారు. కలలను నిజం చేసుకుంటారు. ఒడిశాలోని రూర్కెలాకు చెందిన శ్రేయా లెంక ఈ కోవకు చెందిన ప్రతిభాశాలి....
ఇండియా ఫస్ట్ కె–పాప్ ఐడల్‌గా శ్రేయా లెంక చరిత్ర సృష్టించింది. పన్నెండు సంవత్సరాల వయసులో డ్యాన్సర్‌గా శ్రేయ కళాప్రస్థానం మొదలైంది. ఎప్పుడూ పెద్ద కలలే కనేది. ఒక ఫ్రెండ్ ద్వారా శ్రేయకు ‘కె–పాప్’ పరిచయం అయింది. వారి మ్యూజిక్ వీడియోలు తనను బాగా ఆకట్టుకున్నాయి. ‘వీళ్లు ఆర్టిస్టులా? మెరుపు తీగలా?’ అనిపించింది.
వారి యూనిక్ స్టైల్, సింగింగ్, డ్యాన్సింగ్ తనకు తెగ నచ్చేశాయి. ఏదో ఒకరోజు వారిలో కలిసి, వారిలో ఒకరిగా కలిసి పనిచేయాలనుకుంది. ‘అది అసాధ్యం’ అని ఎవరు అన్నా సరే శ్రేయ వెనక్కి తగ్గలేదు.
ఆమె కల నెరవేరడానికి ఎంతో కాలం పట్టలేదు. ప్రపంచంలోని వందలాది మందితో పోటీ పడి గెలిచింది. ‘కె–పాప్’ మెంబర్‌గా తన కలను నెరవేర్చుకుంది. దేశం కాని దేశం... సౌత్ కొరియాలోకి అడుగు పెట్టినప్పుడు శ్రేయా లెంకాకు అక్కడి ఆహారం, జీవనవిధానం, భాష...అన్నీ కొత్తగా అనిపించాయి. తాను ఇల్లు విడిచి అంత దూరం వెళ్లడం అదే తొలిసారి.
కొత్త విషయాలను ఉత్సాహంగా నేర్చుకుంది. కొత్త జీవనవిధానానికి ఆనందంగా అలవాటు పడింది. చుట్టు పక్కల వాళ్లు కూడా ఎంతో ప్రోత్సాహకంగా ఉండేవాళ్లు. ఇండియాలో అయితే రాత్రి పదిలోపు భోజనం చేసేది. కొరియాలో మాత్రం సాయంత్రం 6–7 మధ్య భోజనం చేస్తారు. మొదట్లో కష్టం అనిపించినా ఆ పద్ధతికి మెల్లగా అలవాటు పడింది.
తనలాగే ‘కె–పాప్ ఐడల్’ కావాలనుకునే ఔత్సాహికులకు శ్రేయా లెంకా ఇచ్చే సలహా...
‘మీ కలలను నెరవేర్చుకోవడం విషయంలో రాజీ పడవద్దు. వందసార్లు అపజయం పాలైనా సరే, ఆవగింజంత ఆత్మవిశ్వాసం కూడా కోల్పోవద్దు. ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్లు తప్పకుండా ఒకరోజు గెలుస్తారు’