ఆగస్టులోనూ తక్కువ వర్షపాతమే
న్యూఢిల్లీ: ఈ సీజన్లో దేశవ్యాప్తంగా పరస్పర విరుద్ధ వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. భారీ వర్షాలు, వరదలతో కేరళకు తీవ్రనష్టం వాటిల్లగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మరికొన్ని రాష్ట్రాల్లో అతిగా వర్షాలు కురిశాయని పేర్కొంది. అదే సమయంలో తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో వరుసగా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజే రమేశ్ వివరించారు. సాధారణ వర్షపాతం 261.3 మిల్లీమీటర్లు కాగా ఆగస్టులో 241.4 మిమీ మాత్రమే నమోదైందన్నారు. అయితే, దేశ వ్యాప్తంగా చూస్తే వర్షాలు మంచిగానే కురిశాయని తెలిపారు. సాధారణంగా సెప్టెంబర్ 15 తర్వాత రుతు పవనాల నిష్క్రమణ రాజస్తాన్ నుంచి మొదలవుతుంది. దీని ఫలితంగా వానలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి.