డీఎస్‌పై చర్య తీసుకోండి
సాక్షి, నిజామాబాద్, హైదరాబాద్ : మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌పై సొంత పార్టీకే చెందిన ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఫిర్యాదు చేశారు. ఆయనపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ముఖ్య ప్రజాప్రతినిధులు బుధవారం సీఎంకు లేఖ రాశారు. ‘‘మొదట్నుంచీ గ్రూపులు కట్టడం, పైరవీలు చేయడం, అక్రమార్జనకు పూర్తిగా అలవాటు పడిన డి.శ్రీనివాస్ టీఆర్ఎస్లో ఇమడలేకపోతున్నారు. అవినీతికి ఆస్కారం లేని మీ పరిపాలనలో తన స్వార్థ ప్రయోజనాలు నెరవేరకపోవడంతో కుట్రలకు తెరతీశారు. మెల్లగా తన నిజ స్వరూపాన్ని బయటపెడుతూ.. పార్టీ ద్రోహానికి తలపడుతున్నారు. కాంగ్రెస్ ఆయనకు కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వడానికి నిరాకరించింది.
ఈ అవమాన బాధతో అలమటిస్తూ తనను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొమ్మని మిమ్మల్ని వేడుకున్నారు. దాదాపు ఆరు నెలల పాటు అభ్యర్థించడంతో మీరు దయ తలచి పార్టీలో చేర్చుకొన్నారు.. ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదా కల్పించారు. ఆయనకున్న అనుభవం రీత్యా జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రయోజనాలు నెరవేర్చడానికి ఉపయోగపడతారని భావించారు. తెలంగాణ రాష్ట్రానికి రాజ్యసభలో ఏడుగురు సభ్యులకు ప్రాతినిధ్యం పొందే అవకాశం ఉంటే అందులో ఒకటి డి.శ్రీనివాస్‌కు కేటాయించారు. మీరు విశాల దృష్టితో అత్యున్నత స్థానం కల్పించినా.. ఆయన మాత్రం వెనకటి గుణమేల మాను వినరా సుమతీ అన్న విధంగానే ప్రవర్తిస్తూ వస్తున్నారు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘‘డీఎస్ టీఆర్ఎస్లో కొనసాగుతూనే పచ్చి అవకాశవాదంతో తన కొడుకును బీజేపీలో ప్రవేశపెట్టారు. తన కొడుకు ఎదుగుదల కోసం టీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చడానికి ప్రయత్నిస్తున్నారు.
నిజామాబాద్ రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలను ప్రేరేపిస్తున్నారు. కొడుకును ఆశీర్వదించవలసిందిగా కోరుతూ బీజేపీ పెద్దల దగ్గర మోకరిల్లుతున్నారు. తన కొడుకు జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను తీవ్ర పదజాలంతో దూషిస్తుంటే ఖండించకపోగా ఆయనే వత్తాసుగా నిలుస్తున్నారు. ఇటీవల టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరడానికి ఢిల్లీ పెద్దలతో మంతనాలు ప్రారంభించారు’’అని ఆరోపించారు. ‘‘గతంలో డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ చేతిలో రెండుసార్లు ఓటమికి గురయ్యారు. మొత్తంగా మూడుసార్లు వరుసగా నిజామాబాద్ ప్రజల చేత తిరస్కరించబడిన నాయకుడు. ఆయన వల్ల టీఆర్ఎస్కు ఇసుమంత ప్రయోజనం కలగలేదు. ఇచ్చిన గౌరవాన్ని నిలుపుకోకపోగా ద్రోహానికి పాల్పడుతున్న డి.శ్రీనివాస్ విషయంలో వేచిచూసే ధోరణిని ప్రదర్శించకుండా సత్వరమే ఆయనపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతున్నాం ..’’అంటూ ఆ లేఖలో నిప్పులు చెరిగారు.
పార్టీకి వ్యతిరేకంగా
వ్యవహరిస్తున్నారు: తుల ఉమ
డీఎస్‌కు సీఎం సముచిత స్థానం ఇచ్చినా ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా వ్యవహారాల ఇన్చార్జి తుల ఉమ పేర్కొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తుండటంతో ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తన కుమారునికి అండగా నిలవాలని కొన్ని కుల సంఘాల సమావేశంలో డీఎస్ పేర్కొన్నారన్నారు.
మొన్న ఎమ్మెల్సీపై... నేడు ఎంపీపై
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం నిజామాబాద్ జిల్లాలోనే రెండో ప్రజాప్రతినిధిపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు అందింది. నిజామాబాద్‌కు చెందిన ఎమ్మెల్సీ ఆర్.భూపతిరెడ్డిపై పార్టీ నేతలు ఐదారు నెలల క్రితమే ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత నేతృత్వంలోనే ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు సమావేశమై భూపతిరెడ్డిపై ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు నియోజకవర్గంలో వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడంటూ భూపతిరెడ్డిపై ఫిర్యాదు చేశారు. తాజాగా అదే జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు డీఎస్‌పై ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నారు: కవిత
టీఆర్ఎస్లో ఉంటూ బీజేపీలో ఉన్న తన కుమారునికి అండగా ఉండాలని డీఎస్ చెబుతుండటంతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ కవిత అన్నారు. అడుగడుగునా ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. డీఎస్ వ్యవహార శైలితో ఇటు నాయకులు, కార్యకర్తలు మనస్తాపానికి గురవుతున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రతినిధులతో సమావేశం తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు.
ఫిర్యాదు అత్యుత్సాహం: డీఎస్
రాజకీయాల్లో క్రమశిక్షణ గురించి తనకు చెప్పాల్సిన అవసరం లేదని ఎంపీ డి.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. తనపై లేఖ ఎందుకు రాయాల్సి వచ్చిందో.. విమర్శలు ఎందుకు చేయాల్సి వచ్చిందో వారే సమాధానం చెప్పాలని, అలా చేసిన వారిది అత్యుత్సాహం తప్ప ఇంకోటి కాదని అన్నారు. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని తన నివాసంలో డీఎస్ మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీకి అన్యాయం చేసే ప్రయత్నం తన జీవితంలో చేయలేదని చెప్పారు. తనకు.. పార్టీకి, సీఎంకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. ‘నేను వ్యక్తిగత పనులపై ఢిల్లీ వెళ్లా. నా నివాసానికి మరమ్మతుల గురించి వెళ్లా’అని వివరించారు.
ఆజాద్‌ను కలిశారట కదా అని విలేకరులు ప్రశ్నించగా... ఢిల్లీ వెళ్తే కాంగ్రెస్ నాయకులు తప్ప ఎవరూ దొరకరని వ్యాఖ్యానించారు. అయితే తాను ఆజాద్‌ను కలిశానన్నది మాత్రం పచ్చి అబద్ధమని, అసలు టీఆర్ఎస్లో చేరిన తర్వాత రాజకీయ నాయకులను కలవడమే మానేశానని వివరించారు. తన కుమారుడి కోసం తానేదో చేస్తున్నట్టు వస్తున్న ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. అలాంటి పనులు తానెప్పుడూ చేయనని చెప్పారు. ‘‘ఎవరి స్వాతంత్య్రం వారికుంటుంది. అందరి పిల్లలు తల్లిదండ్రుల కంట్రోల్లో ఉంటున్నారా? వాళ్ల కెరీర్ కూడా చూసుకుంటారు గదా.. చెప్పాల్సిందంతా చెప్పాం.. అయినా తను వినలేదు’’అని డీఎస్ వివరించారు. ఈ విషయాలన్నింటినీ తాను సీరియస్‌గా తీసుకోనని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది సరైంది అనుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.