License fee
-
ఏజీఆర్ లెక్కింపుపై టెల్కోలకు ఊరట
న్యూఢిల్లీ: టెలికం సంస్థలపై పన్ను భారాన్ని తగ్గించే దిశగా లైసెన్స్ నిబంధనలను కేంద్రం సవరించింది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కించే విధానంలో మార్పులు చేసింది. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల విధింపునకు సంబంధించి టెలికంయేతర ఆదాయాలు, డివిడెండ్ల రూపంలో వచ్చే ఆదాయం మొదలైన వాటిని ఏజీఆర్ నుంచి మినహాయించింది. ఇకపై టెల్కోల స్థూల ఆదాయం నుంచి ముందుగా వీటిని మినహాయిస్తారు. ఆ తర్వాత మిగిలే మొత్తం నుంచి ఇప్పటికే మినహాయింపులు అమలవుతున్న రోమింగ్ ఆదాయాలు, ఇంటర్కనెక్షన్ చార్జీల్లాంటి వాటిని తీసివేసి తుది ఏజీఆర్‌ను లెక్కిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచే ఈ సవరణను వర్తింపచేస్తున్నట్లు టెలికం శాఖ (డాట్) తెలిపింది. గత ఏజీఆర్ లెక్కింపు విధానం కారణంగా టెల్కోలపై ఏకంగా రూ. 1.47 లక్షల కోట్ల బకాయిల భారం పడుతోంది. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న టెలికం రంగాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల్లో ఏజీఆర్ సవరణ కూడా ఒకటి. ‘మారటోరియం’కు ఎయిర్టెల్ ఓకే! సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్), స్పెక్ట్రమ్ బకాయిల చెల్లింపుపై నాలుగు సంవత్సరాల మారటోరియం తనకు అంగీకారమేనని భారతీ ఎయిర్టెల్ ప్రభుత్వానికి తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. టెలికం రంగానికి ఇటీవల ప్రకటించిన సహాయక ప్యాకేజీలో భాగంగా టెల్కోలకు బకాయిలపై మారటోరియం అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. -
డ్రోన్ల ఆపరేషన్ సులభతరం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో నూతన డ్రోన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. డ్రోన్లకు సంబంధించిన కొత్త నియమాలు, మార్గదర్శకాలు విడుదల కావడంతో భారతదేశంలో డ్రోన్ రంగానికి ఒక చరిత్రాత్మక క్షణం ప్రారంభమైందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. డ్రోన్లకు సంబంధించిన కొత్త నిబంధనలు స్టార్టప్‌లతో పాటు ఈ రంగంలో పనిచేస్తున్న యువతకు ఎంతో సహాయకారిగా ఉంటాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో డ్రోన్ వినియోగం పెరగడానికి నూతన మార్గదర్శకాలు ఉపయోగపడనున్నాయి. డ్రోన్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం డ్రోన్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయనుంది. రూ.100కు రిమోట్ పైలట్ లైసెన్స్ ఫీజు కుదింపు నూతన డ్రోన్ విధానం ప్రకారం అన్ని డ్రోన్లు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఇప్పుడు డ్రోన్ నిర్వహణ, లైసెన్స్, సర్టిఫికెట్ కోసం సెక్యూరిటీ క్లియరెన్స్ పొందవలసిన అవసరం లేదు. వాణిజ్యేతర ఉపయోగం కోసం వినియోగించే మైక్రో డ్రోన్లకు, నానో డ్రోన్లకు రిమోట్ పైలట్ లైసెన్స్ అవసరం లేదని నూతన విధానంలో పొందుపరిచారు. డీజీసీఎ డ్రోన్ శిక్షణ అవసరాలను పరిశీలించడమే కాకుండా, పైలట్ లైసెన్స్‌లను ఆన్లైన్లో జారీ చేస్తుంది. డ్రోన్ సైజుతో సంబంధం లేకుండా అన్నింటికీ రిమోట్ పైలట్ లైసెన్స్ ఫీజు రూ.3వేల నుంచి రూ.100కి తగ్గించారు. గ్రీన్జోన్లో అనుమతి అక్కర్లేదు రెడ్ లేదా ఎల్లో జోన్లలో డ్రోన్లను ఆపరేట్ చేయడానికి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ముందస్తు అనుమతి లేకుండా ఎవరూ డ్రోన్ ఎగరవేయడానికి అనుమతించరు. భూమి నుంచి 400 అడుగుల ఎత్తువరకు గ్రీన్‌జోన్‌గా పేర్కొనే ప్రాంతంలో కొత్త నిబంధనల ప్రకారం డ్రోన్లు ఎగరడానికి అనుమతి అవ సరం లేదు. విమానాశ్రయం చుట్టుపక్కల ఎల్లో జోన్‌ను 8–12 కి.మీ.లకు తగ్గించారు. సరళీకృత నిబంధనల్లో డ్రోన్ల వినియోగానికి చేసే దరఖాస్తుల సంఖ్యను 5కి తగ్గించారు. ఫీజుల రకాలను సైతం 72 నుంచి 4కి కుదించారు. గ్రీన్ జోన్లో ఉన్న సొంత లేదా అద్దె ప్రాంగణంలో డ్రోన్లను వినియోగిస్తున్న పరిశోధనా సంస్థలకు టైప్ సర్టిఫికెట్, ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య, రిమోట్ పైలట్ లైసెన్స్ అవసరం లేదు. -
లైసెన్స్ ఫీజుపై సైలెన్స్!
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్డౌన్ తర్వాత బార్ అండ్ రెస్టారెంట్లు తెరుచుకునేందుకు అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయా బార్ల లైసెన్స్ ఫీజు విషయంలో మాత్రం పీటముడి ఇంకా విప్పలేదు. లాక్‌డౌన్‌తో ఆరు నెలలకు పైగా బార్లు మూసివేయాల్సి వచ్చిన నేపథ్యంలో ఆ కాలానికి లైసెన్సు ఫీజును ప్రభుత్వం మినహాయిస్తుందనే ఆశలో బార్ యాజమాన్యాలున్నాయి. అయితే ఫీజు చెల్లించే విషయంలో వెసులుబాటు కల్పించేంతవరకు నిబంధనలు అనుమతిస్తాయి కానీ, ఫీజు మినహాయింపునకు అవకాశం లేదని ఎక్సైజ్ వర్గాలు అంటున్నాయి. బార్ యజమానులు మాత్రం అసలే నష్టాల్లో ఉన్నామని, ఈ పరిస్థితుల్లో ఫీజు చెల్లించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, లేదంటే లైసెన్సులు అమ్ముకోవడం మినహా మరో మార్గం లేదని చెపుతున్నారు. వెసులుబాటు వరకు ఓకే ఎక్సైజ్ అధికారుల సమాచారం ప్రకారం లైసెన్సు ఫీజు చెల్లించే విషయంలో బార్ యాజమాన్యాలకు వెసులుబాటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి, గత నెలలోనే ఫీజు చెల్లించి లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. కానీ, బార్లు మూసి ఉండటంతో అది సాధ్యపడలేదు. ఇప్పుడు మళ్లీ బార్లు నడుపుకునేందుకు అనుమతిచ్చిన నేపథ్యంలో కుదుటపడేంతవరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. మరో నెల రోజులపాటు లైసెన్సు ఫీజుపై ఒత్తిడి తేవద్దని ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వ వర్గాల నుంచి మౌఖిక ఉత్తర్వులు అందినట్టు తెలుస్తోంది. అదే విధంగా గతంలో మూడు వాయిదాల్లో వార్షిక లైసెన్సు ఫీజు చెల్లించే నిబంధనను కొంత మార్చి దాన్ని నాలుగు వాయిదాలకు పెంచాలని, వడ్డీ లేకుండానే ఫీజు కట్టేందుకు అనుమతివ్వాలని కూడా ప్రతిపాదనలు తయారు చేసినట్టు తెలుస్తోంది. అయితే, అసలు ఫీజు ఎప్పటివరకు, ఎంత కట్టాలన్న దానిపై ఎక్సైజ్ వర్గాల నుంచి స్పష్టత లేకపోవడంతో ఎప్పుడు మళ్లీ ఫీజు పిడుగు తమ నెత్తిపై పడుతుందనే ఆందోళన బార్ యాజమాన్యాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే నష్టపోయాం.. కరోనా లాక్డౌన్ కాలానికి ఫీజు మినహాయింపు అంశాన్ని బార్ యజమానుల అసోసియేషన్ రెండు నెలల ముందు నుంచే తెరపైకి తెచ్చింది. ఎక్సైజ్ ఉన్నతాధికారులతో పాటు ఆ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ను పలుమార్లు అసోసియేషన్ నేతలు కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదు. అయితే, బార్లు తెరిచేందుకు అనుమతినిచ్చిన సమయంలోనే వైన్‌షాపుల పర్మిట్‌రూంలను మూసి ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొనడం ద్వారా కొంతమేర బార్లకు ఊరట కలిగించారు. కరోనా కారణంగా లక్షల్లో నష్టపోయామని, ఇప్పుడు మళ్లీ బార్లు తెరిచేందుకు అడ్వాన్సుల కింద పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నామని, మళ్లీ లైసెన్సు ఫీజు కట్టాలంటే తమ వల్ల కాదని బార్ యజమానులు అంటున్నారు. -
బాబోయ్.. ఇదేం నగర పాలన!
గజ్వేల్: గజ్వేల్ ‘నగర పంచాయతీ’ పాలనపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. హోదా పెరిగిన తర్వాత వసతుల మాటేమోగానీ పన్నుల భారం విపరీతంగా పెరిగింది. అభివృద్ధి సైతం ఆశించిన స్థాయిలో ముందుకుసాగడంలేదు. మరోవైపు ఇళ్ల నిర్మాణాల అనుమతులు, ఇతర వసతుల కల్పనలో దళారుల రాజ్యం కొనసాగుతున్నదనే ఆరోపణలు వినవస్తున్నాయి. మరోవైపు రెండున్నర నెలల క్రితం పాలకవర్గం కొలువు దీరినా.. పరిస్థితిలో మార్పులేదు. అభివృద్ధిని వేగవంతం చేయాల్సిన పాలకవర్గంలో అప్పుడే కోల్డ్‌వార్ మొదలైంది. ‘నగర పాలన’ గాడిన పెట్టడానికి చొరవ తీసుకోవాల్సిన అవసరముంది. 2012 జనవరిలో గజ్వేల్ మేజర్ పంచాయతీగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రజ్ఞాపూర్, ముట్రాజ్‌పల్లి, క్యాసారం గ్రామాలు విలీనం కాగా జనాభా 40 వేలకు చేరుకుంది. ప్రస్తుతం ఇళ్ల సంఖ్య 9 వేలకు చేరింది. హోదా పెరిగితే మెరుగైన వసతులు సమకూరుతాయని ప్రజల భావించారు. కానీ వారి అంచనాలు తారుమారయ్యాయి. గతంలో రూ.30గా నల్లా బిల్లులను రూ.75కు పెంచారు. విలీన గ్రామాలైన ప్రజ్ఞాపూర్, క్యాసారం, ముట్రాజ్పల్లిల్లో మాత్రం రూ.50 వసూలు చేస్తున్నారు. కొత్తగా నల్లా కనెక్షన్ కావాలంటే తెలుపు రంగు రేషన్‌కార్డు కలిగినవారు రూ.200, లేనిపక్షంతో రూ.6,500 చెల్లించాలని నిర్ణయించారు. ఇదిలావుంటే నగర పంచాయతీ పరిధిలో 250కు పైగా వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. వీరికి వ్యాపార స్థాయిని బట్టి రూ.500 నుంచి రూ. 8 వేల వరకు లెసైన్స్ రుసుము వసూలు చేయడానికి కార్యాచరణ సాగుతోంది. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పన్నుల భారాన్ని విపరీతంగా మోపారు. గతంలో ఒక చదరపు మీటరుకు రూపాయి వసూలు చేస్తే ప్రస్తుతం అది రూ.5కు చేరింది. అంటే పెరుగుదల 400 శాతమన్నమాట. ఇలా ప్రతి అంశంలోనూ ఛార్జీలు పెరిగాయి. వీటికి అనుమతులు పొందడంలోనూ నిబంధనలు గతంతో పోలిస్తే కఠినతరమయ్యాయి. ఈ క్రమంలోనే కొందరు దళారులుగా అవతారమెత్తి ఈ సేవలకు అనుమతులు ఇప్పిస్తామంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. నిబంధనల ప్రకారం వసూలు చేయాల్సిన చార్జీలతోపాటు దానికి రెండింతలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దందా కొంతకాలంగా యథేచ్ఛగా సాగుతోంది. పట్టణంలో కొత్తగా ఏర్పడిన కొన్ని కాలనీలకు నగర పంచాయతీ నుంచి ఇప్పటివరకు మంచినీటి వసతి, వీధి దీపాలు వంటి వసతులు సమకూరలేదు. ఆయా కాలనీల నిర్వాహకుల వద్ద నుంచి భారీ మొత్తంలో ముడుపులు స్వీకరించి నగర పంచాయతీ అధికారులతో సౌకర్యాల కల్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇంటి నిర్మాణాల అనుమతుల విషయంలోనూ ఇదే జరుగుతున్నది. అనుమతులకు నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన రుసుముతోపాటు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని లేని పక్షంలో అనుమతుల ఇవ్వడానికి తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ‘పాలకవర్గం’లో కోల్డ్‌వార్... రెండున్నర నెలల క్రితం కొలువు దీరిన పాలకవర్గంలో కోల్డ్ వార్ మొదలైంది. చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇటీవల మెజార్టీ కౌన్సిలర్లు టీఆర్ఎస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. బాధ్యతలు చేపట్టిన కొత్తలో జట్టుగా కార్యక్రమాలను నిర్వహించిన కౌన్సిలర్లు ఈ మధ్య ఎడముఖం పెడముఖంగా వ్యవహరిస్తున్నారు. ఎంపీగా కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలిచిన సందర్భంగా ఈ నెల 16న గజ్వేల్‌లో చైర్మన్ భాస్కర్ నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో మెజార్టీ కౌన్సిలర్లు పాల్గొనకపోవడం, ఈ నెల 17న కొందరు కౌన్సిలర్లు టీఆర్ఎస్ గెలుపుపై ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలావుంటే పాలకవర్గంలేని సమయంలో 2013లో నగర పంచాయతీ ప్రజలపై విపరీతమైన పన్నుల భారం మోపారు. ప్రస్తుతం పాలకవర్గం ఈ విషయంలో చొరవ చూపి పన్నులను తగ్గించాలని తీర్మానించి ప్రభుత్వాన్ని కోరే అవకాశమున్నా ఆ దిశగా చర్యలు కనిపించడంలేదు. పాలకవర్గంలో విభేదాలు రావడంవల్లే ఇలాంటి పరిస్థితి నెలకొన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అంతేకాకుండా నగర పంచాయతీ నూతన కార్యాలయ నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు సిద్ధంగా ఉన్నా.. ప్రస్తుత స్థలం అనువుగా లేదని తీర్మానించి పాలకవర్గం చేతులు దులుపుకుంది. అంతేకాకుండా రూ.2.2 కోట్ల ఎస్ఎఫ్సీ 63 పనుల్లో 3 మాత్రమే ప్రారంభమయ్యాయి. మిగతావాటి ప్రారంభానికి కూడా పాలకవర్గం చొరవ చూపాల్సి ఉంది.