గజ్వేల్: గజ్వేల్ ‘నగర పంచాయతీ’ పాలనపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. హోదా పెరిగిన తర్వాత వసతుల మాటేమోగానీ పన్నుల భారం విపరీతంగా పెరిగింది. అభివృద్ధి సైతం ఆశించిన స్థాయిలో ముందుకుసాగడంలేదు. మరోవైపు ఇళ్ల నిర్మాణాల అనుమతులు, ఇతర వసతుల కల్పనలో దళారుల రాజ్యం కొనసాగుతున్నదనే ఆరోపణలు వినవస్తున్నాయి. మరోవైపు రెండున్నర నెలల క్రితం పాలకవర్గం కొలువు దీరినా.. పరిస్థితిలో మార్పులేదు. అభివృద్ధిని వేగవంతం చేయాల్సిన పాలకవర్గంలో అప్పుడే కోల్డ్‌వార్ మొదలైంది. ‘నగర పాలన’ గాడిన పెట్టడానికి చొరవ తీసుకోవాల్సిన అవసరముంది.
2012 జనవరిలో గజ్వేల్ మేజర్ పంచాయతీగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రజ్ఞాపూర్, ముట్రాజ్‌పల్లి, క్యాసారం గ్రామాలు విలీనం కాగా జనాభా 40 వేలకు చేరుకుంది. ప్రస్తుతం ఇళ్ల సంఖ్య 9 వేలకు చేరింది. హోదా పెరిగితే మెరుగైన వసతులు సమకూరుతాయని ప్రజల భావించారు. కానీ వారి అంచనాలు తారుమారయ్యాయి. గతంలో రూ.30గా నల్లా బిల్లులను రూ.75కు పెంచారు. విలీన గ్రామాలైన ప్రజ్ఞాపూర్, క్యాసారం, ముట్రాజ్‌పల్లిల్లో మాత్రం రూ.50 వసూలు చేస్తున్నారు. కొత్తగా నల్లా కనెక్షన్ కావాలంటే తెలుపు రంగు రేషన్‌కార్డు కలిగినవారు రూ.200, లేనిపక్షంతో రూ.6,500 చెల్లించాలని నిర్ణయించారు. ఇదిలావుంటే నగర పంచాయతీ పరిధిలో 250కు పైగా వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు.
వీరికి వ్యాపార స్థాయిని బట్టి రూ.500 నుంచి రూ. 8 వేల వరకు లెసైన్స్ రుసుము వసూలు చేయడానికి కార్యాచరణ సాగుతోంది. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పన్నుల భారాన్ని విపరీతంగా మోపారు. గతంలో ఒక చదరపు మీటరుకు రూపాయి వసూలు చేస్తే ప్రస్తుతం అది రూ.5కు చేరింది. అంటే పెరుగుదల 400 శాతమన్నమాట. ఇలా ప్రతి అంశంలోనూ ఛార్జీలు పెరిగాయి. వీటికి అనుమతులు పొందడంలోనూ నిబంధనలు గతంతో పోలిస్తే కఠినతరమయ్యాయి. ఈ క్రమంలోనే కొందరు దళారులుగా అవతారమెత్తి ఈ సేవలకు అనుమతులు ఇప్పిస్తామంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. నిబంధనల ప్రకారం వసూలు చేయాల్సిన చార్జీలతోపాటు దానికి రెండింతలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ దందా కొంతకాలంగా యథేచ్ఛగా సాగుతోంది. పట్టణంలో కొత్తగా ఏర్పడిన కొన్ని కాలనీలకు నగర పంచాయతీ నుంచి ఇప్పటివరకు మంచినీటి వసతి, వీధి దీపాలు వంటి వసతులు సమకూరలేదు. ఆయా కాలనీల నిర్వాహకుల వద్ద నుంచి భారీ మొత్తంలో ముడుపులు స్వీకరించి నగర పంచాయతీ అధికారులతో సౌకర్యాల కల్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇంటి నిర్మాణాల అనుమతుల విషయంలోనూ ఇదే జరుగుతున్నది. అనుమతులకు నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన రుసుముతోపాటు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని లేని పక్షంలో అనుమతుల ఇవ్వడానికి తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
‘పాలకవర్గం’లో కోల్డ్‌వార్...
రెండున్నర నెలల క్రితం కొలువు దీరిన పాలకవర్గంలో కోల్డ్ వార్ మొదలైంది. చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇటీవల మెజార్టీ కౌన్సిలర్లు టీఆర్‌ఎస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. బాధ్యతలు చేపట్టిన కొత్తలో జట్టుగా కార్యక్రమాలను నిర్వహించిన కౌన్సిలర్లు ఈ మధ్య ఎడముఖం పెడముఖంగా వ్యవహరిస్తున్నారు. ఎంపీగా కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలిచిన సందర్భంగా ఈ నెల 16న గజ్వేల్‌లో చైర్మన్ భాస్కర్ నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో మెజార్టీ కౌన్సిలర్లు పాల్గొనకపోవడం, ఈ నెల 17న కొందరు కౌన్సిలర్లు టీఆర్‌ఎస్ గెలుపుపై ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలావుంటే పాలకవర్గంలేని సమయంలో 2013లో నగర పంచాయతీ ప్రజలపై విపరీతమైన పన్నుల భారం మోపారు.
ప్రస్తుతం పాలకవర్గం ఈ విషయంలో చొరవ చూపి పన్నులను తగ్గించాలని తీర్మానించి ప్రభుత్వాన్ని కోరే అవకాశమున్నా ఆ దిశగా చర్యలు కనిపించడంలేదు. పాలకవర్గంలో విభేదాలు రావడంవల్లే ఇలాంటి పరిస్థితి నెలకొన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అంతేకాకుండా నగర పంచాయతీ నూతన కార్యాలయ నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు సిద్ధంగా ఉన్నా.. ప్రస్తుత స్థలం అనువుగా లేదని తీర్మానించి పాలకవర్గం చేతులు దులుపుకుంది. అంతేకాకుండా రూ.2.2 కోట్ల ఎస్‌ఎఫ్‌సీ 63 పనుల్లో 3 మాత్రమే ప్రారంభమయ్యాయి. మిగతావాటి ప్రారంభానికి కూడా పాలకవర్గం చొరవ చూపాల్సి ఉంది.
బాబోయ్.. ఇదేం నగర పాలన!
Published Sat, Sep 20 2014 12:16 AM | Last Updated on Thu, May 24 2018 1:29 PM
Advertisement
Advertisement