ఉబర్ డ్రైవర్ దోషి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళా ఎగ్జిక్యూటివ్(25)పై అత్యాచారం కేసులో ఉబర్ డ్రైవర్ శివకుమార్ యాదవ్(32)ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. ఈ నెల 23న కుమార్‌కు శిక్ష ఖరారు చేయనున్నట్టు మంగళవారం తెలిపింది. కుమార్‌కు గరిష్టంగా జీవితఖైదు పడే అవకాశం ఉంది. గత ఏడాది డిసెంబర్ 5న రాత్రి గుర్గావ్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఇంటికి వచ్చేందుకు ఉబర్ క్యాబ్ ఎక్కింది. అయితే ఇంటి వచ్చే క్రమంలో కారు డ్రైవర్ శివకుమార్ ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు.
ఆమెను తీవ్రంగా కొట్టడమే కాకుండా గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత మధురలో నిందితుడు శివకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కుమార్‌ను ఐపీసీ 376(2)(ఎం), 366, 506, 323 తదితర సెక్షన్ల కింద కోర్టు దోషిగా తేల్చింది. కుమార్‌పై అభియోగాలన్నీ నిరూపితమయ్యాయని, ఈ నెల 23న శిక్ష ఖరారు చేస్తామని అదనపు సెషన్స్ కోర్టు జడ్జి కావేరి బవేజా తెలిపారు. జడ్జి తీర్పును ప్రకటించగానే కుుమార్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. అతడిని వెంటనే పోలీసులు కోర్టు నుంచి జైలుకు తరలించారు.
కేసు విచారణకు కుమార్ భార్య, తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు హాజరైనా.. అతనితో మాట్లాడే అవకాశం వారికి దక్కలేదు. అయితే కోర్టు బయట కుప్పకూలిపోయిన కుమార్ భార్య.. తమ కుటుంబం ఛిన్నాభిన్నమైపోయిందని బోరున విలపించింది. తన భర్తతో ఒక్క నిమిషం కూడా మాట్లాడే అవకాశం కల్పించకపోవడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి తండ్రి మాత్రం తన కుమార్తెకు జరిగిన అన్యాయానికి సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పు సంతృప్తి కలిగించిందని చెప్పారు. కాగా, కుమార్ తరఫు న్యాయవాది డీకే మిశ్రా స్పందిస్తూ కోర్టు తీర్పుపై తాము ఢిల్లీ హైకోర్టులో అప్పీలు చేస్తామని చెప్పారు.